పెద్దిరెడ్డి కుటుంబం పై ఫిర్యాదు.. దర్యాప్తు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అరాచకాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి.  కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ధైర్యం కలిగింది. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాతో ముందుకు వచ్చి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ కోవలోనే పెద్దిరెడ్డి కుటుంబంపై పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు అందింది.  అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పోలీస్ స్టేషన్ లో పెద్దిరెడ్డి కుటుంబం పై ఓ వ్యక్తి  ఫిర్యాదు చేశారు.  2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన అంకయ్య చౌదరి ఈ ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల సమయంలో తాను పోలింగ్  బూత్ లను పరిశీలిస్తుండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారక నాథ రెడ్డి ప్రోత్సాహంతో తనపై దాడి చేసి తన కారు ధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.   విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో  జిల్లా ఎస్పికి ఫోన్  చేసిన తర్వాతనే  తనకు రక్షణ కల్పించారని అంకయ్య చౌదరి  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు ప్రోత్సాహించిన పెద్దిరెడ్డికుటుంబం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఏపీలో ఒక్క రోజే 18 లక్షల మంది మహిళల ఉచిత బస్సు ప్రయాణం

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన క్షణం నుంచీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం ఉత్సాహం చూపుతున్నారు. దీంతో  ఈ పథకం ప్రారంభంతోనూ అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకానికి ఆదరణ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలోనే సోమవారం (ఆగస్టు 18) ఒక్క రోజులోనే  18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో  ప్రయాణించారు. అంటే దాదాపు 7 కోట్ల రూపాయల వరకూ మహిళలు ఈ ప్రయాణాల ద్వారా ఆదా చేసుకున్నారన్న మాట.  ఈ పథకంప్రారంభమైన  నాలుగు రోజుల్లోనే  47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు  19 కోట్ల రూపాయల మేర వారికి ఆదా అయ్యింది.   అంతే కాకుండా..  రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అయ్యిందన్న విషయాన్ని మహిళలు అధికారులకు తెలియజేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఇలా ఉండగా   స్త్రీశక్తి పథకం వర్తించే బస్సు సర్వీసులను మహిళలు సులభంగా గుర్తిం చేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

తిరుపతిలో మరో చిరుత సంచారం.. మళ్లీ భయం గుప్పిట్లోకి జనం

మూడు నెలలు  ఫారెస్టు అధికారులకు, ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కిందని ఊపిరి పీల్చుకున్నంత సేపు పట్టలేదు తిరుపతి జనాలకు. మరో చిరుత కూడా తిరుపతి నగరంలో సంచరిస్తోందన్న వార్తతో వారు మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు. సోమవారం (ఆగస్టు 18) అటవీ అధికారులు ఎస్వీ యూనివర్సిటీ వద్ద అమర్చిన బోనులో చిరుత చిక్కడంతో గత మూడు నెలలుగా భయం భయంగా గడిపిన తిరుమల జనం ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుత గత మూడు నెలలుగా  ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, ఆగ్రి కల్చర్ యూనివర్సిటీ, జూపార్కు రోడ్డు, అలిపిరి వద్ద సంచరిస్తూ  కుక్కలు, దుప్పులు, జింకలను చంపేస్తూ వచ్చింది.  అంతే కాకుండా జూపార్కు రోడ్డులో ఓ టూవీలర్ పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు తృటిలో తప్పించుకున్నాడనుకోండి అది వేరే విషయం. దీంతో చిరుత దాడికి ఎప్పుడు ఎక్కడ గురి అవ్వాల్సి వస్తుందో అన్న భయంతో విలవిలలడిన తిరుపతి వాసులు చిరుత బోనులో చిక్కడంతో హమ్మయ్య అనుకున్నారు. అయితే  అంతలోనే మరో చిరుత కూడా తిరపతి నగరంలో సంచరిస్తోందన్న వార్త వారిని బెంబేలెత్తిస్తోంది. సోమవారం (ఆగస్టు 18) సాయంత్రమే మరో చిరుత  కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  మంగళం రోడ్డులోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో  చిరుత కదలికలు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో ఆ చరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒంటరిగా ఎవరూ ఆ ప్రాంతంలో సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష  దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ( ఆగస్టు 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టెకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయప ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్ల భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 18) శ్రీవారిని మొత్తం స్వామివారిని మొత్తం 80,502 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4కోట్ల 88 లక్షల రూపాయలు వచ్చింది. 

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థితో మంత్రి లోకేష్ భేటీ

  ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి  సీపీ రాధాకృష్ణన్‌ను  రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన్ను భేటీ అయ్యారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన పరిచయాన్ని లోకేశ్‌తో సీపీ రాధాకృష్ణన్ పంచుకున్నారు. ఈనెల 20వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు నామినేషన్‌ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు, ఉభయ సభల పక్ష నేతలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.  

శ్రీశైలం డ్యాంకు భారీగా పెరుగుతున్న వరద

  నంద్యాల జిల్లా  శ్రీశైలం డ్యామ్‌కు  భారీవరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనితో  శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్కులు నీరు, అలాగే సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రీ నది నుండి  3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.  మొత్తంగా ఇన్ ఫ్లో 3,29,145 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను  12 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215.8070 టి.ఎం.సి. లు కాగా, ప్రస్తుతం 197.0114 టి.ఎం.సి లుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 3,70,786 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు .  

సినిమాల్లో హీరో.. రియల్ లైఫ్ విలన్

  ఓ హీరో సినిమాలో  బాగా నటించాడు.. కానీ నిజజీవితంలో మాత్రం జీవించాడు. అతని పర్ఫామెన్స్ తట్టుకోలేక అతని భార్య పోలీసులను ఆశ్రయించింది...ఆ హీరో మరి ఎవరో కాదండోయ్...ధర్మా మహేషే... అవును ఇతనిపై కేసు నమోదు అయింది. ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్... సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటిం చాడు. సినిమాలో ఎదుగుతున్న సమయంలోనే ఇతనికి పెళ్లి జరిగింది.  అయితే ఈ హీరో సినిమాల్లో హీరో గా నటిస్తు..అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం విలన్ పాత్ర పోషించి... భార్య కు నరకం చూపిస్తు న్నారు.. హీరో మహేష్ మూవీ అవకాశాలు రాక పోవడంతో జల్సాలు, షికార్లకు అలవాటు పడి... ప్రతినిత్యం అదనపు కట్నం కోసం  తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ హీరో ధర్మ మహేష్ భార్య గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బాధితురాలు ఇచ్చిన తరువాత మేరకు హీరో పై గచ్చిబౌలి మహిళ పోలీస్ స్టేషన్‌లో  పలు సెక్షన్ల పై కేసు నమోదు చేశారు

క్వాంటమ్ వ్యాలీకీ ఆర్థిక సాయం అందించండి..అశ్వనీ వైష్ణవ్‌తో లోకేష్ భేటీ

  అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌కు  సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్జప్తిచేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.  మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఐటి పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల వలసలను తగ్గించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. టైర్ -3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐటి పరిశ్రమ విస్తరించేలా ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అత్యవసరంగా పర్మినెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ రూల్స్ లో  సవరణలు చేపట్టండి. విదేశీ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపర్చడానికి ఇది అనివార్యం. ఆంధ్రప్రదేశ్ లో ఐపిని కాపాడుతూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఎఐ శిక్షణ,  టెక్స్ట్ అండ్ డాటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ – 52కి కాపీరైట్ చట్టసవరణ చేపట్టాలి.  భారతదేశంలో మొట్టమొదటి జాతీయస్థాయి క్వాంటమ్ క్లస్టర్ గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్కును, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా  అధికారికంగా కేంద్రస్థాయి ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తిచేశారు. క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూ. 300 కోట్లు సాయం అందించండి. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ను సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చండి. అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్, ఇండియా ఇన్నోవేషన్ వీక్ – 2026ను నిర్వహణకు అవకాశం కల్పించండి.  అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రిసెర్చి ఇనిస్టిట్యూట్, ఐఐటి/ఐఐఎస్ సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్ టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి. జాతీయ విద్యావిధానం – 2020 (NEP) కింద ఫెలో షిప్ ప్రోగ్రామ్ లు, ఎఐ యూనివర్సిటీ, పాఠశాల స్థాయిలో స్టెమ్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్లోబల్ డాటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయండి. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఫ్యాబ్ లు, గ్లోబల్ ఐటి సామర్థ్యాల కోసం ఎపి ప్రభుత్వం 2024-25లో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహకాలను అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.  ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్, డేటా ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, AI & డీప్ టెక్, విజువల్ ఇంటెలిజెన్స్, పీపుల్ పర్సెప్షన్, పబ్లిక్ అలర్ట్ ప్లాట్‌ఫామ్‌ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుల్లో డేటా లేక్, RTGS లెన్స్, PGRS, CPGRAMS, అన్నదాత సుఖీభవ, డ్రోన్ మార్ట్, KPI డాష్‌బోర్డ్‌లు, AWARE ప్లాట్‌ఫామ్, ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు.  డేటా సెంటర్ పార్కు, క్వాంటమ్ వ్యాలీ, ఆర్ టిఐహెచ్ లను వికసిత్ భారత్ -2047లో అంతర్భాగాలుగా బ్రాండింగ్ చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ను జాతీయస్థాయి ఆవిష్కరణల్లో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు. సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల, ఇ-గవర్నెన్స్, డీప్ టెక్ పరిశోధన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఇల ప్రోత్సాహానికి ఎపిలో సంస్కరణలను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్టవ్ అంగీకారం తెలిపారు.

ఎన్నికల కమిషన్ బీజేపీ ప్లేయర్‌గా కాదు.. అంపైర్‌గా ఉండాలి : తులసి రెడ్డి

  ఓటర్ల జాబితాలో అవకతవకలకుగానూ ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని  రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. సోమవారం కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అంపైర్ లా కాకుండా బీజేపీ టీమ్ ప్లేయర్ గా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. ప్రజా స్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువని, అటువంటి ఎన్నికలకు సక్రమమైన ఓటర్ల జాబితా ప్రామాణికమని,కానీ అటువంటి ఓటర్ల జాబితాలో కొందరు అర్హులకు చోటు లేకపోవడం,కొందరు అనర్హులు ఉండడం సర్వ సాధారణం అయిందన్నారు.  ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు గానూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.అవక తవకలు ఉన్నందుకు ఎన్నికల కమిషనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా  ఓటర్ల జాబితాలో అవక తవకలు ఉన్నాయని అన్నారు. మరి ఆయనను కూడా క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ అడగాలి కదా అని ప్రశ్నించారు. నిస్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ నియామకమే పక్షపాతంతో కూడుకొని ఉందని, నియామక కమిటీలో ప్రధాన మంత్రి,లోక్ సభలో ప్రతి పక్ష నాయకుడు తో పాటు న్యాయ మూర్తి బదులు కేంద్ర మంత్రి ఉండడమే  ఇందుకు కారణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్  నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని తులసి రెడ్డి కోరారు.

ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా

  భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. యాక్సియం-4 అంతరిక్ష యాత్ర విజయవంతమైన తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానిని కలిశారు. ఈ నేపథ్యంలో మోదీని కలిసి తన అంతరిక్ష యాత్ర విశేషాలను పంచుకున్నారు. ప్రధాని ఆయనను ఆప్యాయంగా హత్తకుని సరదాగా ముచ్చటించారు. కాగా శుభాంశు చరిత్రాత్మక మిషన్‌ను ప్రశంసిస్తూ ఇవాళ పార్లమెంట్‌ల్లో ప్రత్యేక చర్చ జరిగింది. మోడీకి శుక్లా యాక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను బహుకరించారు. అలాగే, అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చిత్రాలను చూపించారు. అనంతరం, ఇద్దరూ భారత్‌లో అంతరిక్ష రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. కాగా, అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా కీలక పాత్ర పోషించారు. 18 రోజుల ఈ మిషన్‌లో శుక్లా మిగతా వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్‌లో 60 కంటే ఎక్కువ ప్రయోగాలు, 20 అవుట్‌రీచ్ సెషన్‌లను నిర్వహించారు.

సిద్దేశ్వరస్వామి ఆలయం మొదటి దశ పునర్మిణాన పనులకు భూమి పూజ

  తిరుపతి జిల్లా తలకోనలోని  సిద్దేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్మిణాన పనులకు నేడు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్మిణాం పనులను వేగవంతం చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్  బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి దశగా  సిద్దేశ్వర స్వామి వారి గర్భాలయం, అర్ధమండపం,  పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహా మండపం పనులను పునర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మెన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే రూ. 2 కోట్లు టీటీడీ విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నిధులతో పాటు సదరు పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామన్నారు. వీటితోపాటు ముఖ మండపం, నంది మండపం, రాజ గోపురం,  సుబ్రమణ్యస్వామి ఆలయం,  వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం,  అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోటు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు.     అంతకుముందు భూమి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే  పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి బోర్డు సభ్యులు  శాంతా రామ్, టిటిడి సీఈ టి.వి సత్యనారాయణ, టిటిడి ఎస్ శ్రీ మనోహర్, ఈఈ  జగన్మోహన్ రెడ్డి,  దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.  

ఓటు చోర్ ఆందోళన... అసలు లక్ష్యం అదేనా?

  కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, లోక్ సభలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నంత  పనిచేశారు. ఆటం బాంబు పేలుస్తా అన్నారు. పేల్చారు. భారత ఎన్నికల సంఘం, ప్రధాని మోదీ, బీజేపీలతో కుమ్ముక్కై,’ఓట్ల చోరీ’ కి పాల్పడిందని ఆరోపించారు. ఆరోపించడమే కాదు,  దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవిగో ఆధారాలు అంటూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన’, ద్వారా అవునా, నిజమా, నిజంగానే ఓటు చోరీ జరిగిందా, అనిపించేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అలాగే, కర్ణాటక  రాజధాని బెంగుళూరులో మరో స్టేజి షో నిర్వహించారు.  ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల గురించి కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు.అయితే ఆయన చేసిన ‘నిర్దిష్ట’ ఆరోపణల్లో,  ‘నిర్దిష్ట’ నిజాలు ఉన్నాయా లేవా, అనేది నిగ్గు తేలాలంటే, రాహుల్ గాంధీ, తాను చేసిన   ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, ఎన్నికల సంఘం, కోరింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 లోని, రూల్ 20 (3)(b) కింద, ప్రమాణం చేసి,అఫిడవిట్’ దాఖలు చేయమని కోరుతూ,కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కర్ణాటక చీఫ్ ఎలక్షన్ఆఫీసర్ ద్వారా,రాహుల్ గాంధీకి, వర్తమానం పంపింది. ఎదుకో ఏమో కానీ, రాహుల్ గాంధీ ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.  అయితే. రాహుల్ గాంధీ చేసిన చేస్తున్న నిర్దిష్ట ఆరోపణల్లో నిజం ఉన్న లేకున్నా, ఆయన ప్రస్తావించిన ఎన్నికల అవకతవకలు జరగడమే లేదని అనుకుంటే అది అత్మవచనే అవుతుంది. నిజానికి, 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల మొదలు, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు, పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎన్నికల అక్రమాలు అవకతవకలు జరగని ఎన్నిక ఇంత వరకు జరగలేదు. ఎక్కడిదాకానో ఎందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు రద్దయినట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనేక సందర్భాలలో  ఆరోపించారు. ఆయన పోటీ చేసి, ఓడిపోయినా తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలలోనూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయని దయాకర్’ కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తోంది. అలాగే, మాజీ ఎమ్మెల్సీ రాజకీయ  విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్’ బల్క్ ఓట్లకు సంబంధించి  ఒకే గదిలో పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న స్వీయ అనుభవాన్ని, ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.  సో .. రాహుల్ గాంధీ ప్రస్తావించిన దొంగ ఓట్లు, బల్క్ ఓట్లు, డ్యూయల్ ఓట్లు, చనిపోయినవారికి ఓటు హక్కు కొనసాగడం, బతికున్న వారికీ ఓటు లేక పోవడం వంటి సవాలక్ష  అవకతవకలు, అక్రమాలు, ఎన్నికల సంఘం పురుడు పోసుకోక ముందు నుంచి ఉన్నవే. ఆనవాయితీగా వస్తున్నావే. కాంగ్రెస్, బీజేపీ, లేదా మరో పార్టీ ఏపార్టీ అధికారంలో ఎవరున్నా, ప్రధాన ఎన్నికల అధికారిగా,అలనాటి శేషన్’ ఉన్నా ఈనాటి జ్ఞానేశ్ కుమార్’  ఉన్నా, అవకతవకలు అక్రమాలు జరగని ఎన్నికలు ఇంతవరకు జరగలేదు.  అప్పుడు ఇప్పడు జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి.అప్పుడే జరిగాయి, ఇప్పడు లేవు అనుకున్నా, అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అనుకున్నా,అది ఆత్మవంచన, పరనింద అవుతుందే కానీ, నిజం మాత్రం కాదు. నిజానికి,ఈవిషయంలో ఎదుటి వారిపై ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇప్పడు జరుగుతున్నది కూడా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ వైపు, మోదీ వైపు వేలు చూపితే, బీజేపీ కాంగ్రెస్ వైపు వేలు చూపుతుంది. ఒక విధంగా గొంగళిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా ఉంటుందో, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా అంతే.. అయితే ఈ రాజకీయ క్రీడలో రాజకీయ పార్టీల ప్రతిష్ట మాత్రమే కాదు, అతి పెద్ద ప్రజాసామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశానికి, ఎన్నికల నిర్వహణలో, ‘ది బెస్ట్’  అన్న కితాబు పొందిన మన ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను కూడా దిగజార్చి వేస్తోంది. అదే అసలు విషాదం. అయినా, కాంగ్రెస్ నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఇతర విపక్ష పార్టీల నాయకులు, బీహార్ ఎస్ఐఆర్’, కర్ణాటకలోఓట్ల గోల్ మాల్’ వ్యవహారాన్నికలగాపులగం చేసి, ప్రజల్లో అపోహలను సృష్టించే ప్రయత్నం, గందరగోల చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, బీహార్’ లో ‘ఓటర్ అధికార యాత్ర’ పేరిట... రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారు.సవాళ్ళు విసురుతున్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన సంధానాలు ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల నఘం, రాహుల్ గాంధీ, ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించింది.అంతే కాదు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, లేదంటే, దేశానికి క్షపణ చెప్పాలని ఎన్నికల ప్రదానాధికారి, జ్ఞానేశ్ కుమార్’ ఆదివారం డిమాండ్ చేశారు.అందుకు ప్రతిగా విపక్షాలు,’ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఏమి జరుగుతుంది

విపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈయనేనా?

  తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి  ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే తమిళనాడు చేందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను ప్రకటించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియాలో వార్తలోస్తున్నాయి. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగే ప్రతిపక్షాల భేటీలో అభ్యర్థి ఎవరో తేలనుంది. తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్‌డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని విపక్ష కూటమి భావిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈనెల 21వ తేదీతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకోసం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో కూటమి ఫోర్ల్‌ లీడర్లు సోమవారంనాడు సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థిని ఈరోజే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.  

మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విజయవాడ సీబీ కోర్టు సోమవారం (ఆగస్టు 18) కొట్టివేసింది. మధ్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి, అలాగే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ల వాదనలు పూర్తికావడంతో వాటిని కోర్టు తిరస్కరించింది. అలాగే ఈ కేసులో  వాపెదువరెడ్డి, సత్యప్రసాద్ ల ముందస్తు బెయిలు పిటిషన్లను కూడా  కోర్టు కొట్టివేసింది. 

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్.. ఆయనే ఎందుకంటే?

చివరాఖరుకు  ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర పడింది. నిజానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ ఖడ్  అనారోగ్య కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన మరు క్షణం నుంచీ ఆయన వారసుడి వేట మొదలైంది. ఊహాగానాలు ఊపందుకున్నాయి. చాలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి, అయితే..  చివరాఖరుకు  ఊహాగానాలలో అంతగా వినిపించని మహారాష్ట్ర గవర్నర్  సీపీ రాధాకృష్ణన్ ను అధికార ఎన్డీఎ తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోతీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా  ఆదివారం (ఆగస్టు 17)మీడియా సమావేశంలో ప్రకటించారు.  అయితే.. ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చినా, బీజీపీ నాయకత్వం ఆయన్నే ఎందుకు ఎంపిక చేసింది ? ఇదీ ఇప్పడు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తున్న ప్రశ్న. ఇందుకు ఒకటికంటే ఎక్కువ కారణాలే కనిపిస్తున్నాయి. అయితే ఇతర కారణాలు ఎన్నున్నా..  సైధాంతిక పునాదులే అయన ఎంపిక వెనక ఉన్న ప్రధాన కారణంగా’పేర్కొనవచ్చునని  పరిశీలకులు అంటున్నారు. అవునుజ. జగదీశ్ ధన్ ఖడ్ ను బలవంతంగా బయటకు పంపవలసి వచ్చిన  చేదు అనుభావాన్ని దృష్టిలో ఉంచుకునే  బీజేపీ నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేసిందని, అందుకే..  బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవం సఘ్(ఆర్ఎస్ఎస్) భావజాలంతో, భారతీయ జన సంఘ్ (బీజేఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కలిసి నడిచిన సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదొకటి అయితే వివిధ కీలక పదవులకు బాధ్యులను ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకత్వం, ఆలోచనా తీరు కొంత భిన్నంగా ఉంటుంది.  విభిన్న కోణాల్లో ఆలోచించి కానీ తుది నిర్ణయం తీసుకోదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖలఅధ్యక్షులు,ఇతర బాధ్యుల ఎంపిక విషయంలో బీజేపీ ఎంతో కసరత్తు చేస్తుంది. ఇప్పడు ఉపరాష్ట్రపతి అబ్యర్ది ఎంపిక విషయంలోనూ అదే కసరత్తు ఇంకొంచెం ఎక్కువగా చేసిందని పరిశీలకులు అంటున్నారు.  అందుకే సైద్ధాంతిక కట్టుబాట్లతో పాటుగా  రాజకీయ సమీకరణాలు, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుందని అంటున్నారు. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా  తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కమల దళం, తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీపీ రాధాకృష్ణన్‌ ను వ్యుహ్తంకంగానే   ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని అంటున్నారు.  ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నా, ఆయన స్వరాష్ట్రం తమిళనాడు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌  తమిళ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఆయన  అదే బాటలో రాజకీయ ప్రస్థానం సాగించారు. బీజేఎస్, బీజేపీలో కీలక బాధ్యతలు  నిర్వహించడంతో పాటుగా, 1998, 1999లో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.  అంతే కాకుండా రాధాకృష్ణన్‌ కు అన్ని పార్టీలతో, అందరు నాయకులతో సన్నిహిత సంబంధా లున్నాయి. డిఎంకే అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. రాధాకృష్ణన్ ఒక వారం పదిరోజుల క్రితం కూడా, ఇటీవల అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఆయన  ఇంటికెళ్ళి మరీ పరామర్శించారు. అలాగే..  ఇతర పార్టీలలోని ముఖ్యనేతలతోనూ రాధాకృష్ణన్‌కు మంచి సంబంధాలున్నాయని అంటారు. అలాగే.. ఆయన ఓబీసీ కులానికి చెందిన వారు కావడం కూడా కలిసి వచ్చిందని అంటారు. నిజానికి బీజేపీ అన్ని కోణాల్లో ఆలోచించే..  తమిళ మోదీగా పిలుచుకునే సీపీ రాధాకృష్ణన్‌ ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అదలా ఉంటే,సెప్టెంబర్ 9 న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజీలోని బలా బలాల దృష్ట్యా ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్ గెలుపు ఇంచు మించుగా ఖరారు అయినట్లే అంటున్నారు.

ఫాస్టాగ్ వార్షిక పాస్ కు అనూహ్య స్పందన

జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు అద్భుత స్పందన వచ్చింది.  దేశవ్యాప్తంగా 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్‌ ప్లాజాల్లో ఆగస్టు15 నుంచిఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలా వచ్చిన గంటలవ్యవధిలోనే అంటే  అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు   1.4 లక్షల వాహనదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు.  అంతే కాకుండా రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఏకకాలంలో పాతిక వేల మంది  లాగిన్‌ అవుతున్నట్లు భారత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మూడువేల రూపాయలతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకున్న వాహనయజమానులు ఈ పాస్ తో ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులు (వీటిలో ఏది ముందు అయితే అది) వరకూ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు అయితే ఈ వార్షిక పాస్ వ్యక్తిగత వాహనాలు, వ్యాన్లు, జీపులకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వహానాలకుకాదు ఈ పాస్ ద్వారా 200 ట్రిప్పులు లేదా ఏడాది పాటు ప్రయాణించవచ్చు. అది ముగిస్తే మళ్లీ మూడువేల రూపాయలతో పాస్ ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, 

కూకట్‌పల్లిలో దారుణం..బాలిక దారుణ హత్య

  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంగీత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. సంగీత్‌నగర్‌లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్‌ మెకానిక్‌.. తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్‌. బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌కు పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్‌ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడి లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్‌లో పొట్టపై కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన గమనించాడు. దుండగులు బాలికను హతమార్చినట్లు గుర్తించి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.  బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై లైంగిక దాడికి ఒక యువకుడు యత్నించాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసులో బాలిక ఒంటరిగా ఉందని తెలిసి బాలిక దగ్గరి బంధువువే హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం రేవంత్ గౌడ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ గౌడ్ అని సంభోధించారు. ముఖ్యమంత్రిని మేము రెడ్డిగా కాదు బీసీ నేతగా చూస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి లక్షణాలు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనను గౌడ్‌గా సంభోధించా అని వివరించారు. ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత ఉండాలి అనే రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ ఆచరణలో పేడుతున్నారని కొనియాడారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో పాపన్నగౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్  శంకుస్థాపన చేశారు.  సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. గాంధీ ఫ్యామిలీ మాట ఇస్తే అది శిలాశాసనమే. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేశాం. అందులో తప్పులుంటే చూపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభ వేదికగా సవాల్‌ విసిరాం. తప్పులు చూపితే క్షమాపణ చెబుతామని చెప్పాం. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణను తప్పుపట్టవద్దు. దీన్ని తప్పుపడితే వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. బీసీ రిజర్వేన్ల బిల్లును ఐదు నెలలుగా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ కలిపితే 70 శాతం వరకు చేరుతాయి.  తెలంగాణలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం చట్టం చేసింది. గత ప్రభుత్వం చేసిన చట్టం మనకు అడ్డంకిగా మారింది.’’ అని ముఖ్యమంత్రి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చాయని  రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు.  

కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో హస్తినలో లోకేష్ బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.   కేవలం భేటీలతో సరిపుచ్చడమే కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా లోకేష్ వారికి పలు విజ్ణప్తులు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే... లోకేష్ వినతలు పట్ట కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు.  నారా లోకేష్ సోమవారం హస్తినలో కేంద్ర మంత్రులు జైశంకర్, జేపీనడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు.  కేంద్ర మంత్రి జైశంకర్ తో భేటీ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. అలాగే తమ బృందం సింగపూర్ పర్యటన వివరాలను ఆయనకు తెలిపారు. కాగా ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి లోకేష్ కు హామీ ఇచ్చారు. ఇక నడ్డాతో భేటీలో  రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని విజ్ణప్తి చేశారు. లోకేష్ వినతికి సానుకూలంగా స్పందించిన నడ్డా.. ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు  ఇక కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన లోకేష్ రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేం దుకు సహకారం, అలాగే ఓఎన్ జీసీకి ఆఫ్ రిగ్ కాంట్రాక్టు సాధనకు తోడ్పడానికి కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే నితిన్ గడ్కరీతో భేటీలో కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.  అలా లోకేష్ కలిసిన ప్రతి కేంద్ర మంత్రీ లోకేష్ సమస్యలు వివరించిన తీరునూ, రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాల సాధన విషయంలో కనబరుస్తున్న శ్రద్ధనూ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు.