పులివెందులలో మరో ఎలక్షన్ వార్
posted on Aug 21, 2025 @ 10:58AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడ్డపై ఆయనకు, ఆయన పార్టీ వైసీపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక తరువాత అదే పులివెందులలో మరో ఎన్నికల యుద్ధానికి తెర లేచింది. పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నిక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినది కాగా.. ఇప్పుడు జరగబోతున్నది పులివెందుల పట్టణంలోని మునిసిపల్ కౌన్సిల్ స్థానానికి. నిజానికి ఒక కౌన్సిలర్ ను ఎన్నుకోవడానికి జరిగే ఎన్నికకు పెద్దగా ప్రాథాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ అది పులివెందుల.. జగన్ కోట అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అటువంటి పులివెందుల మునిసి పాలిటీలో వార్డు కౌన్సిలర్ స్థానానికి ఎన్నిక జరగనుంది.
మరి పులివెందుల జడ్పీటీసీ స్థానినికి జరిగిన ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేసి మంచి జోరుమీద ఉన్న తెలుగుదేశం.. పులివెందుల పట్నంలో కూడా వైసీపీకి ఓటమి చూపి సత్తా చాటాలని సహజంగానే భావిస్తుంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికలో ఓటమిని పరాభవాన్ని.. పులివెందుల మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి జరగనున్న ఎన్నికలో విజయం సాధించి సమాధానం చెప్పాలన్న పట్టుదలతో వైసీపీలో కనిపిస్తోంది. దీంతో పులివెందుల మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి జరగబోయే ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉండటం సహజమే. ఒక్క పులివెందులలోనే కాదు.. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఆరు మునిసిపాలిటీలో, కార్పొరేషన్ లలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇవీ ఉప ఎన్నికలే. జిల్లాలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరణించి ఖాళీ అయిన స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సంప్రదాయాన్ని అనసరించి ఈయా స్థానాలలో పోటీకి అభ్యర్థులను నిలపకుండా తెలుగుదేశం దూరంగా ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఖాళీగా ఉన్న కార్పొరేటర్ , కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఎన్నికలు జరుగనున్న స్థానాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. కడప నగరంలోని 22 ,48 డివిజన్ ల్లో, మైదుకూరులో 5 వ వార్డు, జమ్మల మడుగు లో 4 వ వార్డు, పులివెందుల లో 23 వ వార్డు, బద్వేలులో 11,30 వార్డుల్లో, కమలాపురం లో 8,20 వార్డుల్లో, రాయచోటిలో 19,30 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మరోసారి కడప జిల్లా, మరీ ముఖ్యంగా పులివెందుల ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.