2014 ఎన్నికల్లో గెలవడం కష్టమే ... రామచంద్రయ్య

  2004లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం విద్యుత్ ఛార్జీల పెంపేనని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనని  దేవాదాయాశాఖా మంత్రి సి.రామచంద్రయ్య ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలపెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తగవని, ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఈఆర్సీ నిర్ణయం వెలువరిస్తుందా అని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను నిలదీశారు. ఈఆర్సీ ఎంత స్వాతంత్ర సంస్థ అయినా ప్రభుత్వం అనుమతిలేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై చర్చించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు లేఖలు వ్రాసినట్టు చెప్పారు.

జగన్ ఆస్తుల కేసులో మరో చార్జిషీట్

        జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేయనుంది. మొదటి చార్జ్‌షీట్‌కు అనుబంద చార్జిషీట్‌నే రేపు దాఖలు చేయనున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేవీపీ సహా పలువురిని సీబీఐ విచారించింది. ఈ కేసులో ఇప్పటి వరకు సీబీఐ నాలుగు అనుబంధ చార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రేపు దాఖలు చేసే చార్జిషీట్ కీలకం కానుంది. ఫార్మా కంపెనీల పాత్రనూ సీబీఐ దర్యాప్తులో వెల్లడించనుంది. అటు ఈ కేసులో మంత్రి ధర్మానప్రసాద్‌రావు ఈ ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఢిల్లీలోని ఈడీ న్యాయప్రాదిక సంస్థ ఎదుట జగన్ ఆస్తుల జప్తుపై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరుగనుంది.

పెరిగిన రైలు టికెట్ ధరలు

        రైల్వే బడ్జెట్ లో పెంచిన టికెట్ ధరలు, ఇతర ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయి. బడ్జెట్ లో ప్రకటించిన దాని ప్రకారం సెకండ్, స్లీపర్ క్లాస్ చార్జీలు పెరగకపోయినా.. ఏసీ రిజర్వేషన్ చార్జి టికెట్‌కు రూ.15 నుంచి రూ.25కు, సూపర్ ఫాస్ట్ రైళ్లలో సెకండ్, స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.10 పెరగనుంది. అలాగే, తత్కాల్ చార్జీలు కూడా సెకండ్ క్లాస్ టికెట్‌పై పది శాతం, ఏసీ టికెట్‌పై 30 శాతం పెరగనున్నాయి.   రిజర్వేషన్ ఖాయమైన టికెట్‌ను రద్దు చేసుకుంటే ఇకనుంచి రూ.50 హాంఫట్! వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్లను రద్దు చేసుకుంటే టికెట్‌కు రూ.5; ఏసీ టికెట్‌కు రూ.10 చొప్పున చార్జీలు పెరిగాయి. ఇకనుంచి, రైలు ప్రయాణానికి పక్కా ప్రణాళిక ఎంత అవసరమో.. ఆచితూచి ప్రయాణాలు పెట్టుకోవడమూ అంతే అవసరం.

షారుక్ ఖాన్ పై మనోజ్ కుమార్ కేసు

  షారుఖ్ ఖాన్, ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్లుగా, ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే 2007లో ఓం శాంతి ఓం అనే సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో మనోజ్ కుమార్ పై ఒక స్కూఫ్ వుంది. దాంతో మనోజ్ కుమార్ 2008లో ముంబై హైకోర్టులో ఒక పిటీషన్ వేశారు. దాంట్లో తన ఇమేజ్ ను కించపరిచారని ఆ సీన్లను తొలగించాలని ఉంది. కోర్టు ఆ స్కూఫ్ సీన్లను తొలగించి శాటిలైట్ ద్వారా రిలీజ్ చేసుకోవచ్చని తీర్పు నిచ్చింది. ఎరోస్ ఇంటర్నేషనల్ వారు దీనిపై స్పందించలేదు. తాజాగా ఓం శాంతి ఓం సినిమాను కోర్టును ధిక్కరించి జపాన్ లో విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ మండిపడుతూ తాను ఈ చిత్ర నిర్మాతలపై సివిల్, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తానని పరువునష్టం కింద 100కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్లు చెల్లించాలని కేసు ఫైలు చేయనున్నారు.

విద్యుత్తు చార్జీల పై చిరు రివర్స్ గేర్

        విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని తప్పుబడుతూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఆజాద్‌కు ఆ లేఖ పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదంటూ దానివల్ల జరిగే నష్టాలను లేఖలో వివరించారు. ఈఆర్సీ టారిఫ్ నిర్ణయించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, కానీ, ఉపసంఘం పరిశీలన లేకుండానే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయంటూ నిర్ణయం తీసేసుకున్నారని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉండగా విద్యుత్ చార్జీలను పెంచారని, ఇది ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విపక్షాలన్నీ విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమబాట పట్టాయని, కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చార్జీల పెంపుపై నియోజకవర్గాల్లో సమాధానం చెప్పుకోవడం పార్టీ నేతలకూ ఇబ్బందికరమేనన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆజాద్‌ను కోరారు.

ప్రభుత్వం సంజయ్ దత్త్ కు క్షమాభిక్ష ఇస్తుందా

  బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కి 1993 ముంబై బాంబు ప్రేలుళ్ళ కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగిన నేరంలో ఇటీవలే సుప్రీం కోర్టు 5 సం.ల జైలు శిక్ష విదించిన సంగతి తెలిసిందే. నాటి నుండి ఆయనకు క్షమాభిక్ష పెట్టలని కొందరు, వద్దని మరి కొందరూ వాదనలు మొదలు పెట్టడంతో ఖిన్నుడయిన సంజయ్ దత్త్ మీడియాతో మాట్లాడుతూ తనకు క్షమాభిక్ష అవసరం లేదని, సుప్రీం కోర్టు తీరుపుకు కట్టుబడి జైలు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నానని, అందువల్ల తన కోసం ఎవరూ కూడా ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరవద్దని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఆయనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా అనేక మంది మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ శంకర్ నారాయణన్ కి లేక్షలు వ్రాసారు. సంజయ్ దత్త్ కు క్షమాబిక్ష పెట్టమని కోరుతూ వ్రాసిన వారిలో అలనాటి నటి మరియు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా ఒకరు. సంజయ్ దత్త్ సత్ప్రవర్తన మరియు సినిమా రంగానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్ట వలసిందిగా ఆమె గవర్నర్ కు లేఖ వ్రాసారు. అయితే, సంజయ్ దత్త్ క్షమాభిక్షపై చెలరేగుతున్న రాజకీయ దుమారం చూసిన తరువాత దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా అది మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందని భావించిన గవర్నర్, జయప్రద వ్రాసిన లేఖపై ఎటువంటి సలహాలు, సూచనలు చేయకుండానే మహారాష్ట్ర హోం శాఖకు పంపించేసారు. ఇంతకాలం సంజయ్ దత్త్ కు అనుకూలంగా మాట్లాడిన మహారాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఆయనకి క్షమాభిక్ష పెడుతుందా లేక దానిని కేంద్ర హోం శాఖకు పంపి చేతులు దులుపుకొంటుందో చూడాలి.

4, 5 తేదీల్లో ఈఆర్సీ.నివేదిక సమీక్షిస్తాం ... సి.ఎం.

  చిత్తూరుజిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కలికిరిలో విలేఖరులతో మాట్లాడుతూ ... ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీల కోసం తమ ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, గతేడాది ఈఆర్సీ ఇచ్చిన నివేదిక తర్వాత 5,500 కోట్ల మేర పేదప్రజలకు విద్యుత్ రాయితీ కల్పించామనీ, ఈ ఏడాది కూడా పెడ ప్రజలపై భారం పడకుండా చూస్తామని, ప్రతినెలా 450 నుంచి 550 మెగావాట్ల విద్యుత్ ను యూనిట్ కు 12.20 నుండి 12.30కు కొని రైతులకు ఉచితంగా అందిస్తున్నామని, 50 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిపై భారం పడుతోందని, రాష్ట్రంలోని 97 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లలో 50 శాతం దానికి లోబడే ఉన్నందున వారిపై భారం పడదని తెలిపారు. అలాగే ఈ నెల 4,5 తేదీలలో ఈఆర్సీ ఇచ్చే నివేదికపై సమీక్ష నిర్వహిస్తామని, ఏయే రంగాలపై ఎంతెంత భారం పడుతుందో పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని కిరణ్ కుమార్ హామీ ఇచ్చారు.

బాబు ఒకరోజు దీక్ష

  రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడలోని జె.ఎన్.టి.యు. వద్ద గల నాగమల్లితోట సబ్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేయనున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 8-30 గంటలకు ఆనందభారతి నుండి ప్రాదయాత్రగా 2.7 కిలో మీటర్లు దూరంలోని నాగమల్లితోటకి చేరుకొని 11 నుండి సాయంత్రం 5 గంటలవరకు సబ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యుత్ ఛార్జీల పెంపు. విద్యుత్ కోటలకు నిరసనగా దీక్ష చేస్తారు. ఆ తరువాత పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టింది.

చెడుగుడు ఆడుకొంటున్న కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు

  ఇటీవల యుపీయే ప్రభుత్వానికి డీయంకే పార్టీ మద్దతు ఉపసహరించుకొన్ననాటి నుండి, యుపీయేకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెడుగుడు ఆడుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ ఆటను కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టడం విశేషం.   ఆ పార్టీకి చెందిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, సమాజ్ వాది పార్టీ తమకు మద్దతు ఇస్తున్నవిషయాన్నీ కూడా పట్టించుకోకుండా సమాజ్ వాది అధినేత ములాయం సింగుకు ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నాయని, యుపీయేకు మద్దతు ఇచ్చేందుకు డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడంతో, బేణీ ప్రసాద్ వర్మ చేత వెంటనే క్షమాపణలు చెప్పించి ఆయనని పదవి నుండి వెంటనే తొలగించాలని లేకపోతే మద్దతు ఉపసంహరిస్తామంటూ సమాజ్ వాది పార్టీ బెదిరించేసరికి, ప్రధాని మన్మోహన్ సింగు, సోనియా గాంధీలిరువురూ కూడా ములాయం ముందు చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరక తప్పలేదు.   అయితే, తమను సీబీఐ చేత వేదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్న సమాజ్ వాది అధినేత ములాయం మాత్రం బెట్టు సడలించలేదు. పైగా బీజేపీ నాయకుడు అద్వానీని పొగుడుతూ మాట్లాడి యుపీయే నుండి యన్డీయే వైపు జంపు చేస్తానని సూచన ప్రాయంగా తెలియజేసారు. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయ పార్టీల కోసం వెదికినప్పుడు లలిత, మమత అనే ఇద్దరు వీరనారీ మణులు యుపీయే కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని సూచన ప్రాయంగా చెప్పడంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సమాజ్ వాది పార్టీతో చెడుగుడు ఆటకు దైర్యంగా సై అంది.   మొట్ట మొదట ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా 2014వరకు ఎటువంటి డోకా లేదని అన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషిద్ అల్వీ మాట్లాడుతూ ములాయం సింగ్ ఎన్డీయే వైపు చూడటాన్ని తప్పు పట్టారు.   మద్దతు ఉపసంహరిస్తామని బెదిరిస్తే బయపడుతుందనను కొన్న కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా ఎదురు దాడి మొదలుపెట్టేసరికి ములాయం సింగుకు కూడా పరిస్థితులు మళ్ళీ మారాయని అర్ధం అయ్యింది. తమ మద్దతే కనుక కాంగ్రెస్ అవసరం లేకపోతే, ఇక సీబీఐతో ఏమి కొత్త తంటాలు వస్తాయోనని బయపడిన ములాయం సింగ్ “యుపీయే ప్రభుత్వం పడిపోవాలని మేము కూడా కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీతో మా సంబందాలు మరీ అంత ఘోరంగా ఏమి లేవు. ఇప్పటికీ చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని మేము నమ్ముతున్నాము,” అని ఆయన అన్నారు.   అయితే ఆయన ఆ మాట అన్న తరువాత కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. మళ్ళీ బేణీ ప్రసాద్ వర్మ మీడియా ముందుకు వచ్చి “వచ్చే ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీకి మహా అయితే నాలుగో, ఐదో పార్లమెంటు సీట్లు రావచ్చును. ఎందుకంటే, ములాయం సింగ్ రాష్ట్ర ముస్లిం ప్రజలందరినీ మోసం చేసాడు. ఇప్పుడు ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా అదే పని చేస్తున్నాడు. అందువల్ల వచ్చే ఎన్నికల తరువాత ఆ పార్టీకి రాష్ట్రంలో అంత్యక్రియలు తప్పవు” అని అన్నారు. అందుకు ఆ పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందించినప్పటికీ, ఈ సారి మాత్రం సోనియా గాంధీ కానీ, ప్రధాని గానీ మంత్రి బేణీ ప్రసాద్ మాటలకు విచారం వ్యక్తం చేయలేదు, కనీసం ఖండించ లేదు కూడా.   కాంగ్రెస్ పద్దతి ఎలా ఉందంటే ఏరు దాటేవరకు ఏటి మల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అంటున్నట్లుందని ఒక పక్క విమర్శిస్తూనే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకే సమాజ్ వాది పార్టీ మళ్ళీ సిద్దపడటం చూస్తే బహుశః సీబీఐ భయం వలననే అయిఉండాలి. కానీ అదే సమయంలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ములాయం సింగ్ జోస్యం కూడా చెప్పడం మరో విశేషం.

గుంటూరు జిల్లా కాంగ్రెస్ సమావేశం రచ్చ రచ్చ

        గుంటూరులో జరిగిన డీసీసీ సమావేశం ఒక్కసారిగా రసాభాసాగా మారింది. తమ సోదరుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉండి సేవ చేస్తే ఆయనను జైలులో పెడతారా? అంటూ ఆయన తమ్ముడు మోపిదేవి హరినాథ్ తీవ్రంగా మండిపడ్డారు.   డిసిసి సమావేశంలో ఎవరి సమస్యలు వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా మోపిదేవి హరినాథ్ లేచి తన సోదరుడు కాంగ్రెసు పార్టీ కోసం కష్టపడ్డారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలులో ఉంటే ఎవరు స్పందించరా? అని సమావేశంలో నిలదీశారు. నాటి జివోలతో సంబంధమున్న మంత్రులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తన సోదరుడు ఒక్కడినే ఎందుకు బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ఇద్దరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన నేత అకారణంగా జైలులో ఉంటే పట్టించుకోరా అని నిలదీశారు. ఆయనను బయటకు తీసుకు వచ్చేందుకు అందరం కలిసి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని ఆయన సూచించారు. పార్టీలో బిసిల పట్ల చిన్న చూపు కనిపిస్తోందన్నారు. హరినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సమావేశాన్ని వాయిదా వేశారు.

పార్లమెంటరీ బోర్డులో నరేంద్ర మోడీకి చోటు

        భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదవి కీలక లభించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డులో మోడీకి చోటు దక్కింది. పదకొండు మంది సభ్యుల ఈ కమిటీలో ఆరేళ్ల అనంతరం నరేంద్ర మోడీకి చోటు కల్పించారు.   బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీతో పాటు మోడీ సలహాదారుడు అమిత్ షా, మురళీధర రావులను నియమించారు. అలాగే స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నక్వీ, ప్రభాత్ ఝా, ఉమా భారతిలకు బీజేపీ ఉపాధ్యాక్షులుగా స్థానం కల్పించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇందులో చోటు లభించలేదు.   మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సరోజ్ పాండే ఎంపికయ్యారు. పార్లమెంటరీ సెంట్రల్ బోర్డులో వెంకయ్య నాయుడుకు చోటు లభించింది. కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మురళీధర రావు స్వంత జిల్లా కరీంనగర్. క్రమశిక్షణ కమిటీలో విశాఖకు చెందిన హరిబాబుకు చోటు దక్కింది.

సెటప్ బాక్స్‌ల గడువు పై కేంద్రానికి సీఎం లేఖ

      డిజిటలైజేషన్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్, విశాఖలలో కేబుల్ వినియోగదారులు ఇంకా సెటప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోలేదని, గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. కేంద్రప్రభుత్వం కేబుల్ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయాలని జీవో జారీచేస్తూ ఈనెల 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.   సీఎం కిరణ్ కేంద్రానికి రాసిన లేఖపై ఈ సాయంత్రం గడువు పెంచేదీ, లేనిదీ తెలియనుంది. హైదరాబాద్‌లో కేబుల్ వినియోగదారులు 100శాతం సెటప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు కేంద్రం అభిప్రాయపడింది. ఇంకా గడువు పెంచేది లేదన్నట్లు సమాచారం. ఇదే వంకతో సెటప్ బాక్స్‌ల ధరలను విపరీతంగా పెంచివేశారు.

గ్రేటర్ పై పట్టు కోసం తెరాస ప్రయత్నాలు

  గ్రేటర్ హైదరాబాదులో ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడిన వారే అధికంగా ఉండటంతో, ఇంతవరకు అక్కడ జరిగిన ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేస్తూవచ్చి తెరాస, లగడపాటి, రాయపాటి, కావూరి వంటి ఆంధ్ర నేతల సవాళ్ళను స్వీకరిస్తున్నట్లు ఇప్పుడు అక్కడా తన పట్టు బిగించేందుకు సిద్దం అవుతోంది. తెలంగాణకు గుండె కాయ వంటిదని చెప్పుకొనే ఆ ప్రాంతం పైన తమకు సరయిన పట్టు లేకపోవడం వలననే ప్రతిసారి తమ ఉద్యమం విఫలమవుతున్న సంగతి తెరాస కు అర్ధం అవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణమని చెప్పవచ్చును. ఈ ప్రయత్నంలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి తెరాస చాలా గట్టి ఏర్పాట్లు చేసుకొని ముందు కదులుతోంది.   వచ్చే నెల2 నుండి 9 వరకు, 12 నుండి 16 వరకు రెండు విడతలుగా నగరంలో ‘గడప గడపకు తెలంగాణ’ కార్యక్షికమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొన్నట్లు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లకు ఇన్‌చార్జీలను నియమించినట్లు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మొత్తం 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. ఒక్కో డివిజన్‌కు 20మందితో కూడిన బృందం ఏర్పాటుచేయడం జరిగింది. ఇవి కాక తెరాస అనుబంధ విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొంతోంది. ఈ కమిటీలు ఆయా డివిజన్‌ల పరిధిలో నివాసముండే ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారవేత్తలు సహా ముఖ్యుల వివరాలన్నీ సేకరించడం ద్వారా, తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవచ్చునని తెరాస భావిస్తోంది.   ఇంత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్న తెరాసను సరయిన నాయకత్వం లేని వైకాపా, అంతర్గత తగాదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ, తెదేపాలు, ఏవిధంగా ఎదుర్కొంటాయో చూడాలి.

కేసీఆర్ ‘మండల యాత్ర’

        ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్న కేసీఆర్, 'తెలంగాణ మండల యాత్ర' పేరుతో మే నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి బస్సు యాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతినిధుల సభను నిజామాబాద్‌లో నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు కుత్బుల్లాపూర్ కూడా పరిశీలనలో ఉంది. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. సమావేశం వివరాలను అనంతరం నాయిని, వినోద్‌కుమార్ మీడియాకు తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ వివిధ పార్టీలు ఏప్రిల్ 9న జరపతలపెట్టిన బంద్‌లో తమ పార్టీ శ్రేణులూ పాల్గొంటాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ రెండు నుంచి బస్తీ బాట చేపట్టనున్నట్టు వారు తెలిపారు. అది పూర్తయ్యాక మండల బస్సు యాత్రను కేసీఆర్ చేపడతారని తెలిపారు. కాగా టీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్సీలు కె.స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, మహమూద్అలీ ఏప్రిల్ 5న ప్రమాణం చేయనున్నారు.  

డిఆర్సీ సమావేశంలో తిట్లదండకం

  ఆరు నెలల తరువాత మెదక్ జిల్లా ఇన్ ఛార్జీ డి.కె. అరుణ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ గీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యేలు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ లు హాజరయ్యారు. సమావేశంలో ముత్యం రెడ్డి తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా రూ.5 లక్షలు ఎలా కేటాయించారని అధికారులను ప్రశ్నించారు. అది ముత్యంరెడ్డి, ఫారుక్ మధ్య వివాదానికి దారి తీసింది. నువ్వు దొంగవి అంటే నువ్వు దొంగవి అని ఇద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. డి.కే.అరుణ, ఎమ్మెల్యేలు వారిని శాంతింపచేశారు. మళ్ళీ ఉపాధి హామీ గురించి చర్చ జరుగుతుండగా ముత్యంరెడ్డి తన నియోజకవర్గ నిధుల నుంచి డ్వాక్రా భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చానని కానీ ఎన్ని బావుల పూడికలు తీశారో అధికారులు లెక్కలు ఇవ్వటంలేదని వారిపై మండిపడ్డారు. ఫారుక్ హుస్సేన్ కల్పించుకుని ఆడవారిని గౌరవించేలా మాట్లాడాలని ముత్యంరెడ్డికి హితవు పలికారు. దీంతో రెచ్చిపోయిన ముత్యం రెడ్డి మళ్ళీ తిట్ల దండకం అందుకున్నారు. హుస్సేన్ కూడా తానేమీ తీసిపోలేదని అతనూ తిట్ల దండకం ప్రారంభించారు. వీరిని శాంతింపచేయడానికి జిల్లా ఇన్ ఛార్జి, ఎమ్మెల్యేల ప్రాణం తోకకొచ్చింది. ఇలా ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిథులు నిసిగ్గుగా, బహిరంగంగా ఇద్దరు మహిళలు ఉన్న సభలో తిట్లదండకం మొదలుపెడితే ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు వారికే తెలియాలి.

శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్

  ఓబుళాపురం మైనింగ్ అక్రమాల్లో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీలక్ష్మికి సిబీఐ కోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి తనకు తానుగా లేచి నిలబడలేని పరిస్థితి, ఎడమ కాలు పూర్తిగా స్వాధీనం తప్పే స్థితికి వస్తుండటం, ఆరోగ్యం బాగా దెబ్బతినడం, తోటి ఖైదీలు ఆమెకు చేస్తున్న సపర్యలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సిబీఐ కోర్టు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు పూర్తయినా, అనారోగ్యంతో అవస్థలు పడుతున్నా బెయిల్ కు అడ్డుపడటం సిబీఐ తీరుకు నిదర్శనమని డిఫెన్స్ లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి దుర్గాప్రసాద్ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు తీర్పు నిచ్చారు.

ప్రతిపక్షాలకు 'షాక్' ఇచ్చిన కిరణ్ కుమార్

  తొమ్మిది లెఫ్ట్ పార్టీలు ఇందిరాపార్క్ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపుదల నిలపాలని నిరాహార దీక్షలు చేసింది. వారి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విద్యుత్ సంక్షోభం, సర్ ఛార్జీల పేరిట ప్రభుత్వం పెదప్రజలపై పెనుభారం మోపుతుందని, ఛార్జీలు తగ్గించేవరకూ నిరాహార దీక్షలు చేపట్టారు. నాలుగోరోజు అర్థరాత్రి వీరి దీక్షా శిభిరాన్ని కూడా పోలీసులు భగ్నం చేసి దీక్ష చేస్తున్నవారిని హాస్పిటల్ కు తరలించారు. వైఎస్సార్సీపీ సభ్యులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన రోజు అసెంబ్లీ ఎదుటే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బైఠాయించారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. టి.ఆర్.ఎస్. బడ్జెట్ సమావేశాలలో విద్యుత్ ఛార్జీల పెంపుపై తమ నిరసనను తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏదో ఒక విధంగా తమ నిరసనలు తెలియజేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేఖాతరు చేస్తూ ఈ.ఆర్.సి.కి ఛార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ ఒకటినుండి అమలులోకి రానున్నాయి. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. గృహ సముదాయాలకు 50 లోపు యూనిట్లకు 1.45, 51-100 యూనిట్లకు 3.25, 101-150 యూనిట్లకు 4.88, 151-200 యూనిట్లకు 5.63, 201-250 యూనిట్లకు 6.38, 251-300 యూనిట్లకు 6.88, 301-400 యూనిట్లకు 7.38, 401-500 యూనిట్లకు 7.88, 500 కంటే ఎక్కువ యూనిట్లు వాడుకున్నవారికి 8.38చొప్పున రెట్లు వసూలు చేస్తారు. అలాగే పరిశ్రమలకు కూడా యూనిట్ కు రూ.6.08 గా నిర్ణయించారు. దీంతో అటు గృహ వినియోగదారుడిని, ఇటు పరిశ్రమల వారిని ఈ.అర.సి. వదలలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ నిర్ణయించేసింది.

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలకు నోటిసులు

        అవిశ్వాసం తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్, 9 మంది టిడిపి ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం మధ్యాహ్నం నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, సుజయకృష ్ణరంగారావు, పేర్నినాని, ద్వారంపూడి, జోగి రమేష్, ముద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వేణు గోపాలాచారి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.   టిడిపి నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలు బాలనాగిరెడ్డి, సాయిరాజ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వనిత, కొడాలి నాని, అమర్ నాథ్ రెడ్డి, ఇతరులు ఉన్నారు