చంద్రబాబుకి ముందు నుయ్యి వెనుక గొయ్యి
posted on Apr 2, 2013 @ 11:01PM
ఇటీవల కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలో కూడా రాబోయే ఎన్నికల కోసం టికెట్లకి కుమ్ములాటలు, నాయకులలో అసంతృప్తి మొదలయింది. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కృష్ణాజిల్లా పార్టీలో చేసిన మార్పులతో జిల్లా నాయకుల మధ్య కొత్త విభేదాలు పుట్టుకొచ్చాయి. తనను అర్బన్ అధ్యక్షుడి పదవినుండి తొలగించినందుకు వల్లభనేని వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వల్లభనేనికి గన్నవరం టికెటు, కేసినేని నానికి విజయవాడ లోక్ సభ టికెట్ ఖాయం చేసినట్లు వస్తున్నవార్తలతో పార్టీ సీనియర్ నేత గద్దె రామ్ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అందువల్ల గద్దె రామ్ మోహన్ అనునయించే ప్రయత్నంలో తనను వచ్చి కలువమని చంద్రబాబు ఆయనకు కబురు పంపారు.
మరి ఆయనకి ఏవిధంగా నచ్చజెప్పుకొంటారో తెలియకపోయినా, ఆయనను చంద్రబాబు పిలవడంతో, ఇంతవరకు విజయవాడ లోక్ సభ టికెట్ తనదేననే నిశ్చింతగా ఉన్న కేశినేని నానికి కలవరం మొదలయింది. ఒకవేళ చంద్రబాబు గద్దె ఒత్తిడికి లొంగి మళ్ళీ విజయవాడ టికెట్ ను ఆయనకి ఇచ్చేస్తానని మాట ఇస్తారేమోనని ఆయన ఇప్పుడు కలవరపడుతున్నారు. చంద్రబాబు విజయవాడ టికెట్ గద్దెకు తిరిగి ఇస్తే కేశినేనికి కోపం రాక మానదు. ఒకవేళ గన్నవరం టికెట్ ఇస్తే వంశీకి, సిట్టింగ్ యంయల్యే దాసరి బలవర్ధన్ కి ఇద్దరికీ కూడా కోపం వస్తుంది. పోనీ గద్దెకి నచ్చజెప్పుదామన్నా అదీ కష్టమే. ఆయన ఈ సారి తప్పనిసరిగా విజయవాడ లేదా గన్నవరం నుండి ఎన్నికలలో పోటీ చేయాలని కోరుకొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. దీనిని ఆయన ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.