చంద్రబాబుకి ముందు నుయ్యి వెనుక గొయ్యి

  ఇటీవల కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలో కూడా రాబోయే ఎన్నికల కోసం టికెట్లకి కుమ్ములాటలు, నాయకులలో అసంతృప్తి మొదలయింది. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కృష్ణాజిల్లా పార్టీలో చేసిన మార్పులతో జిల్లా నాయకుల మధ్య కొత్త విభేదాలు పుట్టుకొచ్చాయి. తనను అర్బన్ అధ్యక్షుడి పదవినుండి తొలగించినందుకు వల్లభనేని వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వల్లభనేనికి గన్నవరం టికెటు, కేసినేని నానికి విజయవాడ లోక్ సభ టికెట్ ఖాయం చేసినట్లు వస్తున్నవార్తలతో పార్టీ సీనియర్ నేత గద్దె రామ్ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అందువల్ల గద్దె రామ్ మోహన్ అనునయించే ప్రయత్నంలో తనను వచ్చి కలువమని చంద్రబాబు ఆయనకు కబురు పంపారు.   మరి ఆయనకి ఏవిధంగా నచ్చజెప్పుకొంటారో తెలియకపోయినా, ఆయనను చంద్రబాబు పిలవడంతో, ఇంతవరకు విజయవాడ లోక్ సభ టికెట్ తనదేననే నిశ్చింతగా ఉన్న కేశినేని నానికి కలవరం మొదలయింది. ఒకవేళ చంద్రబాబు గద్దె ఒత్తిడికి లొంగి మళ్ళీ విజయవాడ టికెట్ ను ఆయనకి ఇచ్చేస్తానని మాట ఇస్తారేమోనని ఆయన ఇప్పుడు కలవరపడుతున్నారు. చంద్రబాబు విజయవాడ టికెట్ గద్దెకు తిరిగి ఇస్తే కేశినేనికి కోపం రాక మానదు. ఒకవేళ గన్నవరం టికెట్ ఇస్తే వంశీకి, సిట్టింగ్ యంయల్యే దాసరి బలవర్ధన్ కి ఇద్దరికీ కూడా కోపం వస్తుంది. పోనీ గద్దెకి నచ్చజెప్పుదామన్నా అదీ కష్టమే. ఆయన ఈ సారి తప్పనిసరిగా విజయవాడ లేదా గన్నవరం నుండి ఎన్నికలలో పోటీ చేయాలని కోరుకొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. దీనిని ఆయన ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.

ఇటలీ రాయభారిపై ఆంక్షలు తొలగించిన సుప్రీం కోర్టు

  కొద్ది రోజుల క్రితం ఇటలీ రాయభారి డానీయేలీ మంసినీని భారతదేశం విడిచి వెళ్ళడానికి వీలులేదని ఆదేశించిన సుప్రీం కోర్టు, ఇద్దరు భారతీయ మత్స్యకారులను కాల్చి చంపిన కేసులో అరెస్టయిన ఇద్దరు ఇటలీ నావికుల మాస్సిమిలానో లతోర్ మరియు సలవతోరే గిరోనే లను, ఆ దేశం తిరిగి భారత్ కు తిప్పి పంపడంతో తను ఇదివరకు ఇటలీ రాయభారిపకి జారి చేసిన ఆదేశాలను ఉపసంహరించుకొని ఆయన స్వదేశం తిరిగి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.   కొద్ది వారల క్రితం సుప్రీం కోర్టు ఇటలీ రాయభారి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీతో వారిని ఇటలీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఇటలీ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఆ తరువాత ఇటలీ ప్రభుత్వం మాట తప్పి వారిని వెనక్కి తిప్పి పంపే ప్రసక్తి లేదని అని స్పష్టం చేయడంతో పార్లమెంటులో చాల పెద్ద రాద్దాంతమే జరిగింది. ప్రతిపక్షాల ఒత్తిడి భరించలేక ఇటలీ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు భారత విదేశంగశాఖ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ, ఇటలీ మొదట లొంగలేదు.   అయితే సుప్రీం కోర్టు తన రాయభారిని దాదాపు నిర్బందించినంత పనిచేయడంతో ఇక చేసేదేమీ లేక ఇటలీ ప్రభుత్వం తన ఇద్దరు నావికులను భారత్ కు త్రిప్పి పంపింది. అందువల్ల సుప్రీం కోర్టు కూడా తన ఆదేశాలను ఉపసంహరించుకొంది. అంతే కాకుండా ఇద్దరు ఇటలీ నావికులను విచారించేందుకు వెంటనే ఒక ప్రత్యేక న్యాస్థానం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే, తమ నావికులను అరెస్ట్ చేయకూడదు, మరణ శిక్ష వేయకూడదు అనే రెండు ముందస్తు షరతులు పెట్టి మరీ భారత్ కు అప్పగింపబడిన ఇటలీ నావికులను ఇప్పుడు భారత ప్రభుత్వం ఇటలీ దేశానికి ఇచ్చిన హామీ ప్రకారం ఆ షరతులు ఉల్లంఘించకుండా, అదే సమయంలో భారతీయ మత్సకారులను చంపినందుకు తగిన శిక్ష విదిస్తూ సుప్రీం కోర్టు సున్నితమయిన ఈ కేసును ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.

సర్వేను అడ్డుకున్న జగన్ కార్యకర్తలు

        సరైన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి సర్వే సత్య నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో దేశంలో ఇతర ప్రాంతాల ప్రజలు ఉన్నప్పుడు సీమాంధ్ర ప్రజలు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.   కాంగ్రెస్ లో ఉంటే జగన్ కు జైలు పరిస్థితి వచ్చేది కాదని సర్వే సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టారన్నారు. జగన్ ఆస్తులు సేకరిస్తే రాష్ట్ర ప్రజల సమస్యలు తీరుతాయని చెప్పారు.   మరోవైపు భీమవరం రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను వైసీపీ కార్యకర్తలు ఈ రోజు  అడ్డుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుంది

        ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష చూస్తుంటే దొంగే దొంగ, దొంగ అన్నట్లుగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు వైయస్ కుటుంబ సభ్యులు స్థాపించిన పార్టీయే విద్యుత్ పైన దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.   విద్యుత్ సంక్షోభం విషయంలో ఈ నెల 9వ తేది వరకు తెలుగుదేశం పార్టీ సంతకాల సేకరణ చేపడుతుందని సోమిరెడ్డి అన్నారు. టిడిపి, కాంగ్రెసు హయాంలోని విద్యుత్ పైన తాము ప్రజల ముందుకు వెళ్తామన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు టిడిపి తమ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ కోత కారణంగా రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. విద్యుత్ సమస్యపై సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజలపై కిరణ్ సర్కార్ పెనుభారం

        ప్రజలపై కిరణ్ సర్కార్ పెనుభారం మోపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు.   కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీల రూపంలో రూ.2 వేల కోట్ల భారం మోపారని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్‌ ఉండదు, బిల్లులు మాత్రం వస్తుంటాయని విజయమ్మ వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు చూసి చలించిపోయి అప్పట్లో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇచ్చారని విజయమ్మ గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ చక్కగా అమలైతే, వైఎస్‌ అనంతరం ఆ పథకానికి కిరణ్‌ సర్కార్‌ తూట్లు పొడిచిందని అన్నారు. కరెంట్‌ బిల్లులను రెట్టింపు పెంచేస్తే సామాన్యులు ఎలా చెల్లించగలరని విజయమ్మ ప్రశ్నించారు.

నన్నపనేని సుధకు సీటు డౌటే

  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కుమార్తె నన్నపనేని సుధ వైఎస్సార్సీపీ పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు.  నన్నపనేని సుధ గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండడంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం నన్నపనేని సుధను వినుకొండ సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆగ్రహం చెందిన టిక్కెట్ ఆశిస్తున్న ఆశావాహులు నన్నపనేని సుధను వెంటనే ఇంచార్జ్ పదవి నుండి తప్పించాలని పట్టుబిగిస్తున్నారు. ఈ నియోజకవర్గమనే కాదు వైఎస్సార్సీపీ లో ప్రతి నియోజకవర్గంలోనూ రోజుకో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి.

చంద్రబాబుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ

  చంద్రబాబు కాకినాడలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీక్ష అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థ నష్టాల బాటలో పయనించడానికి వై.ఎస్. ప్రభుత్వం, రోశయ్య ప్రభుత్వం, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుకు చంద్రబాబే కారణమని, తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు పాల్గొనివుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు పాడేది కాదని, పేదలకు అండగా ఉండేందుకే వై.ఎస్. విజయమ్మ దీక్ష చేపట్టారని, రైతులకు నిబంధనలు లేకుండా ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీల పంపు వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం ఛార్జీలు తగ్గించేవరకూ తమ దీక్షలు ఆగవని చంద్రబాబుపై మండిపడుతున్నారు.

వైయస్ విజయమ్మ ఆమరణ దీక్ష

        రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం విశేషమే. బషీర్బాగ్లో విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆమె అక్కడ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కరెంట్ సత్యాగ్రహం దీక్ష వేదిక వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు. ఆమె వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఉన్నారు. సత్యాగ్రహం దీక్షావేదికపై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పించిన అనంతరం విజయమ్మ ఆమరణ దీక్షకు కూర్చున్నారు.   అయితే అనూహ్యంగా విజయమ్మ ఆమరణ దీక్షకు పూనుకోవడం ఆసక్తి కరంగా ఉంది. ఇప్పటికే వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ విద్యుత్ చార్జీల మీద నిరవధిక దీక్షలు చేపట్టాయి. అయితే ప్రభుత్వం వారిని బలవంతంగా విరమింపచేసింది. ప్రస్తుతం బీజేపీ నిరవధిక దీక్షలో ఉంది. ఇప్పుడు విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టింది. మిగిలిన పార్టీలు ఆందోళన చేస్తుంటే తాము వెనకబడతామన్న ఆలోచనే ఆమరణ దీక్షకు కారణం అయి ఉండవచ్చు.  

త్రీడీ ప్రింటింగ్ తో కొత్త జీవితం

        బ్రిటన్ వైద్యులు ప్రపంచలో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం తో కృత్రిమ ముఖాన్ని తాయారు చేశారు. దీని సాయంతో కేన్సర్ బాధితుడికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. బ్రిటన్‌లోని ఎసెక్స్‌కు చెందిన ఎరిక్ మోగర్ (60) ఒక రెస్టారెంట్ మేనేజర్. నాలుగేళ్ల క్రితం అతని ముఖం ఎడమ భాగంలో ఒక కణితి ఏర్పడి పెరగడం ప్రారంభమైంది. అది కేన్సర్ కణితి అని, దాన్ని తీయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి కణితిని తీసేశారు.ఈ ప్రయత్నంలో అతడి ఎడమకన్ను, దవడ ఎముక భాగం మొత్తాన్ని తీసేయాల్సి వచ్చింది. ఈ శస్త్రచికిత్స వల్ల ఎరిక్ కేన్సర్ బారి నుంచి బయటపడిన...ఆ తరువాత అతనికి అనేక సమస్యలు మొదలైయాయి. అతడి ముఖం అతడికే భయంగొల్పే విధంగా మారిపోయింది. ఆహారం, నీరు తీసుకోవడటం కూడా సాధ్యం కాలేదు. పొట్టలోకి అమర్చిన ట్యూబ్ ద్వారా మాత్రమే ఆయన ఆహారం తీసుకొనేవారు. అయితే ఇటీవలికాలంలో కొత్తపుంతలు తొక్కుతున్న అవయవాల త్రీడీ ముద్రణ పరిజ్ఞానం అతడికి వరంలా అందివచ్చింది. ఎరిక్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బ్రిటన్ వైద్యులు.. స్కానింగ్ ద్వారా అతడి పుర్రె కొలతలు తీసుకున్నారు. ఈ వయసులో సహజంగా ఎరిక్ ముఖం ఎలా ఉంటుందో కంప్యూటర్ మోడలింగ్ ద్వారా సృష్టించారు.   ఆయన ముఖంలో ఖాళీగా ఉన్న ఎడమవైపు భాగాన్ని ఒక్కొక్కపోర చొప్పున పేర్చుకుంటూ కృత్రిమ ముఖాన్ని రూపొందించారు. అది  ఎరిక్ కు అతికినట్లు సరిపోయింది. ఆ కృత్రిమ ముఖాన్ని తన చేతిలో ఉంచినప్పుడు.. తన ముఖాన్ని తానే చేతుల్లో చూసుకున్నట్టుగా అనిపించిందని ఎరిక్ పేర్కొన్నాడు. "దాన్ని మొదటిసారి నా ముఖం మీద పెట్టుకున్నప్పుడు.. నమ్మలేకపోయాను, అదెంత అందంగా ఉందో'' అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

50 శాతం మూగబోయిన టీ.వీ.లు

  జంటనగరాలలో 50 శాతం పైగా టీ.వీ.లు  మూగబోయాయి. సోమవారం ఉదయం జంటనగరాలలో అనలాగ్ ప్రసారాలను సిటీకేబుల్, హాత్ వె నిలిపివేశారు. హైదరాబాద్ పలక సంస్థ పరిథిలో దాదాపు 25 లక్షల టీవీలు ఉన్నాయని ఎం.ఎస్.ఓ. లు వెల్లడించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలో 8.96 లక్షల ఇళ్లలో టీవీలు ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ లెక్కలు వేసింది. 10 లక్షలకుపైగా టీవీలకు సెట్ టాప్ బాక్స్, డి.టి.హెచ్. కనెక్షన్ లు ఉన్నాయనే భావనతో పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. సిటీకేబుల్, హాత్ వె ప్రసారాలను నిలిపివేయడంతో ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో సోమవారం ఉదయం ప్రసారాలు ప్రారంభించాయి. సమాచార, ప్రసార శాఖ పరిథిలో కేబుల్ డిజిటలైజేషన్ ను పర్యవేక్షిస్తున్న బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు (బేసిల్) కేబుల్ కార్యాలయాలకు వచ్చి ప్రసారాలు నిలిపివేయించారు. మరో 30-45 రోజుల గడువిస్తే అందరికీ సెట్ టాప్ బాక్స్ లు అమర్చగలమని ఎం.ఎస్.ఓ. ప్రతినిధి బేసిల్ ప్రతినిథులకు తెలపడంతో వారు ఈ విషయాన్ని నాట్ చేసుకుని వెళ్ళిపోయారు. దీంతో జంటనగరాలలోని 50 శాతం పైగా టీ.వీ.లు మూగబోయాయి. ప్రభుత్వం దీనిపై తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కిరణ్ కు చంద్రబాబు సవాల్ ...

  ఎవరి హయాంలో విద్యుత్తు వ్యవస్థ మెరుగ్గా వుందో, ఎవరి హయాంలో విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందో చర్చ జరగాల్సిన అవసరం ఉందని , దీనిపై చర్చించడానికి కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. 1994 నుండి 2013వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందేనని, మా హయాంలో 25 నుంచి 30పైసలు పెంచితే నానా రాద్ధాంతం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35వేల కోట్ల రూపాయలు పెంచిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల్లో 2014 వరకు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ళలోనే మూడుసార్లు పెంచారని, 2004లో తమ ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్ ను సాధించామని, 2009కు ముందు 70శాతం పీ.ఎల్.ఎఫ్.పై గ్యాస్ ప్లాంట్లు పనిచేసేవని ఇప్పుడు 24శాతం పి.ఎల్.ఎఫ్.పై పనిచేసే దుస్థితి ఏర్పడిందని తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రుల అవినీతి వల్లే విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని అన్నారు. అందుకే విద్యుత్ వ్యవస్థను ఎవరు భ్రష్టుపట్టించారో చర్చలో  తేలిపోవాలి అని చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ కు నేరుగా సవాల్ విసురుతున్నారు.

రఘురాజు అక్రమాల చిట్టా ... ఈడీ

  రఘురాజు కెవిపి రామచంద్ర రావు వియ్యంకుడు. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండ్ భారత్ ఇన్ ఫరా లిమిటెడ్ కంపెనీలకు రఘురాజు అధిపతి. 800కోట్ల రూపాయల పెట్టుబడులలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ ఆరోపణ. 2007-08లో ఇండ్ భారత ఇన్ ఫరా లిమిటెడ్ లోకి 600 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు, ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 200 కోట్ల రూపాయలు 2011లో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇండ్ భారత్ సన్ ఎనర్జీలోకి వచ్చిన విదేశీపట్టుబడులలో నిబంధనల ఉల్లంఘనకు రఘురాజు పాల్పడినట్టుగా తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంటుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్.ఐ.పి.బి.)అనుమతి లేకుండానే ఈ ఇన్వెస్ట్ మెంట్ ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ స్వీకరించింది. విద్యుత్ ప్రాజెక్టుల్లో మాత్రమే విదేశీ పట్టుబడులను అనుమతిస్తారు.ఇండ్ భారత్ సన్ ఎనర్జీ కేవలం ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ మాత్రమే. ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు, ట్రేడింగ్ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు రావాలంటే ఎఫ్.ఐ.పి.బి. అనుమతి తప్పనిసరి. ఈ విషయాలపై ప్రశ్నించేందుకు ఈడీ రఘురాజుకు సమన్లు జారీ చేసింది.

కిరణ్ కుమార్ కు అధిష్ఠానం అక్షింతలు

  కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ సంక్షోభం, ఈఆర్సీ కి సర్ ఛార్జి వసూలుకు అనుమతి ఇవ్వడంపై స్వపక్షంలోనే ఎదురుగాలులు వీస్తున్నాయి. కిరణ్ నిర్ణయంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లోనే అసంతృప్తి నెలకొని వుంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి, సీనియర్ నేత హనుమంతరావు, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, డి.ఎల్.రవీంద్రా రెడ్డి, సి. రామచంద్రయ్య, యాదవరెడ్డి మరికొందరు మరి కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నందున చార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని రుసరుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ పెంచిన ఛార్జీలను తగ్గించాలంటూ సూచించారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ పెంపు సరైనది కాదని, కాంగ్రెస్ లో పరుగుతున్న అసంతృప్తి మంచిది కాదని ఆజాద్ అభిప్రాయపడినట్లు తెలిసింది.

గృహహింస ... కేరళ మినిస్టర్ రాజీనామా

  కేరళ అటవీశాఖ మినిస్టర్ కె.బి. గణేష్ కుమార్ భార్య డా.యామిని తన్కాచీ పోలీసులకు తన భర్త తనను హింసిస్తున్నాడని ఎఫ్.ఐ.ర్. బుక్ చేసింది. దీంతో కుమార్ సోమవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం కుమార్ తన భార్యకి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనను తన భార్య ఏ విధంగా హింసిస్తున్నదో, ఫోటోలతో సహా ఆధారాలు పిటీషన్ లో దాఖలు పరిచారు. కోర్టు విడాకుల కేసును హియరింగ్ జూన్ 29కి వాయిదా వేసింది. ఈ విషయం తెలుసుకున్న యామినీ సాయంత్రం ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకీ, పోలీసులకు కంప్లైంట్ అందజేసింది. యామినీ తనను కుమార్ ఏ విధంగా హింసిస్తున్నాడో తెలియజేస్తూ ఫిబ్రవరి 22న ఒక వ్యక్తి తమ అధికార నివాసానికి వచ్చి కుమార్ కి తన భార్యతో అక్రమసంబంధం ఉందని అరుస్తుండటంతో, కుమార్ ఆ వ్యక్తి కాళ్ళపైపడి వేడుకున్నాడని ఇది చూసి తాను నిర్ఘాంతపోయాననీ, ఏమిటి విషయం అని అడిగినందుకు కుమార్ తనను ఒక గదిలో బంధించి నానా విధాలుగా హింసించాడని పేర్కొంది. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కుమార్ తాను క్యాబినెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

నాలుగు రోజుల నిరవదిక నిరాహార దీక్షలు

  దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రధానమయిన అన్ని రాజకీయపార్టీలు పెరిగిన కరెంటు చార్జీలకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్షలు పుచ్చుకోవడం, ఓ నాలుగు రోజులు తరువాత వాటిని పోలీసులు భగ్నం చేసి వారిని ఆసుపత్రిలొ చేర్చడం, దానిని సదరు పార్టీల నేతలు మీడియా ముందు ఖండించడం, ఆసుపత్రిలో కూడా కొనసాగిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేయడం, ఈ వార్తలన్నిటినీ ఫోటోలతో సహా మీడియాలో ప్రచురించడం, ఆ మర్నాడు ఎవరి బలవంతం మీదనో తప్పని సరి పరిస్థితులో ఇంత నిమ్మ రసం పుచ్చుకొని అయిష్టంగానే దీక్షలు విరమించడం అంతా ఒక పద్దతి ప్రకారం జరిగిపోవడం చూసి ప్రజలు కూడా చాలా ముచ్చట పడుతున్నారు. నిరవదిక నిరాహార దీక్షలకి’ కూడా ఇంత చక్కటి పద్దతిని ఏర్పరుచుకోగలిగినందుకు అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు రెండూ కూడా చాలా సంతోషిస్తున్నాయి. దీని వల్ల ఇద్దరికీ పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు గనుక ఎటువంటి ఉద్రిక్తతలు కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ‘నాలుగు రోజుల నిరవదిక నిరాహార దీక్షలు’ మూడు దీక్షలు ఆరు మీడియా ఫోటోలతో దిగ్విజయంగా ముగుస్తున్నాయి. శాసనసభ సమావేశాలకి కూడా ఇటువంటిదే ఏదయినా ఒక పద్దతి కనిబెడితే బాగుంటుందని ప్రజల విన్నపం.   పాపం మనం కనిపెట్టుకొన్న ఈ పద్దతుల గురించి తెలియని అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక పెద్ద మనిషి గత 9రోజుల నుండి కడుపు మాడ్చుకొని డిల్లీలో ‘నిజంగానే నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ అక్కడి పోలీసులు కూడా మన పద్దతులు తెలియనందున ఆయన దీక్షను ఇంతవరకు భగ్నం చేయనూ లేదు. ఆ తరువాత జరుగవలసిన తంతు కూడా జరుగలేదు. మన నేతలేవరయినా వెంటనే డిల్లీ వెళ్ళేపని ఉంటే కొంచెం అక్కడి పోలీసులకు మన ‘నాలుగురోజుల నిరవదిక నిరాహార దీక్షా పద్దతులు’ గురించి చెవిలో వెయగలిగితే ఆ అమాయకుడి ప్రాణాలు నిలబెట్టిన పుణ్యం దక్కుతుంది.   ఇప్పుడే అందిన సమాచారం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ‘నిరవధిక నిరాహారదీక్ష’ ప్రారంభిస్తారు.

సీఎం కిరణ్ ఏకపక్ష నిర్ణయ౦ సరికాదు

        ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మంత్రులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో సీఎంకు స్వపక్షంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపును అధికార పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. 2004లో కరెంట్ అంశం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పూర్తి భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం కొంత భరించే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన తెలిపారు.   ఛార్జీల పెంపు సున్నిత అంశం అని, దానిపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీలో ఈ అంశాన్ని చర్చించాలా, లేదా అనేది ముఖ్యమంత్రితో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.  

స్వపక్షంలోనే వ్యతిరేకత

కిరణ్ పాలనపై విపక్షాలే కాదు స్వపక్షంలో కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. కిరణ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి, సి.రామచంద్రయ్య విద్యుత్ సంక్షోభం, సర్ ఛార్జి వసూలుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రకటనలు చేస్తున్నారు. వి.హనుమంతరావు సి.ఎం.కిరణ్ కు లేఖ వ్రాయగా, చిరంజీవి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ కు లేఖ రాశారు. సి.రామచంద్రయ్య కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి చీఫ్ సత్యనారాయణకు లేఖలు వ్రాసారు. ఇప్పుడు మాజీమంత్రి జెసి దివాకర్ రెడ్డి వంతు వచ్చింది. ఏ ప్రభుత్వమైనా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని, విద్యుత్ ఛార్జీల పంపుతో ప్రజలు ఇబ్బందుల పాలవుతారని, ఛార్జీల పెంపును పునఃపరిశీలించాలని, కాంగ్రెస్ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి మరొకసారి పునరాలోచించుకుని ప్రజలకు ఆమోదయోగ్యమైన, అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైయస్ జగన్ ఇంకొన్ని రోజులు జైలులోనే!

        అక్రమాస్తుల కేసులో జైలులో వున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో బయటకు వస్తారని ఆయన మద్దతు దారులు భావిస్తుండగా, జగన్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేయనున్న చార్జ్‌షీట్‌ ఫైనల్ చార్జ్‌షీటని, అది పూర్తయితే జగన్ కు బెయిల్ వస్తుందని మద్దుతుదారులు అనుకున్నారు. అయితే రేపు సిబిఐ దాఖలు చేయబోయే చార్జ్‌షీట్‌ ఆఖరిది కాదని, ఇటీవల కేవీపీ సహా పలువురిని విచారించిన సిబిఐ వారు ఇచ్చిన వాంగ్మూలాలను మాత్రమే కోర్ట్ కు సమర్పించబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాని జగన్ కు సంబందించిన అంశాలు ఇందులో జతచేయడం లేదని అంటున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఇంకొన్ని రోజులు జైలులో ఉండే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు.