కిరణ్ తగ్గింపులు ... తృప్తి చెందని విపక్షాలు
గత కొద్దిరోజులుగా విపక్షాలు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు, నిరసనలు తెలుపుతున్న విషయం విదితమే. స్వపక్షంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై గురువారం మంత్రులు, విద్యుత్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, ఆనం రాంనారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారథి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గీతారెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గృహ వినియోగదారులకు కొత్తగా పెరిగిన కరెంటు ఛార్జీల భారంలో 830 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని, నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ యూనిట్లు వాడుకునే వారికి పాత ఛార్జీలనే కొనసాగిస్తామని, 201 యూనిట్ల నుంచి ఆపైన వాడుకునే వారికి మొదటి యూనిట్ నుండి కొత్తగా పెరిగిన ఛార్జీల ప్రకారం చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు. అలాగే గృహ వినియోగదారులు రెండు కోట్లు ఉంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో 1.86 కోట్ల ప్రజలకు కరెంటు ఛార్జీల పెంపు నుంచి ఉపశమనం పొందుతారని అన్నారు. విపక్షాలు మాత్రం సిఎం నిర్ణయంతో సంతృప్తికరంగా లేరు. ఈనెల తొమ్మిదిన రాష్ట్రవ్యాప్త బంద్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.