సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోనున్న భారతీయ కార్మికులు
posted on Apr 3, 2013 @ 8:46PM
గత మూడున్నర దశాబ్దాలుగా లక్షలాది భారతీయులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతూ ఆయ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో అధికంగా రోడ్లు, భవన నిర్మాణ, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక నిపుణులు తదితరులున్నారు. సాంకేతిక నిపుణుల పరిస్థితి కొంచెం మెరుగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళిన వారిలో ఎంతో కొంత మిగుల్చుకోగలిగినా, మిగిలిన వారి జీవితాలు మాత్రం కలల ప్రపంచంలో బ్రతుకులేనని చెప్పవచ్చును.
ఒక్క సౌదీ అరేబియా దేశంలోనే దాదాపు 20 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. వారిలో కేరళ నుండి వెళ్ళినవారు దాదాపు 6 లక్షల మంది ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి కనీసం 2-3 లక్షల మంది ముఖ్యంగా తెలంగాణా, ఉత్తరాంధ్రా జిల్లాలయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వెళ్లినవారున్నారు. స్వదేశంలో తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం, గల్ఫ్ దేశాలలో ఎంతో కొంత మిగుల్చుకొనే అవకాశాలు ఉండటం చేత పొట్ట చేత పట్టుకొని వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు.
గల్ఫ్ దేశాలలో పనిచేసే స్థానికులతో లేదా యూరోపు దేశస్థుల జీతాలతో పోలిస్తే కేవలం పదో వంతు లేదా అంత కంటే తక్కువ జీతాలకే ఎక్కువ పని గంటలు పనిచేయడం, కష్టపడి పనిచేసే గుణం, సాంకేతిక పరిజ్ఞానం వగైరా లక్షణాలున్న భారతీయ కార్మికుల సేవలను ఆదేశం ఇంత కాలం పొందింది.
అయితే, ఇస్లామిక్ సూత్రాలను తూచా తప్పకుండా పాటించే సౌదీ అరేబియా దేశంలో బహుభార్యత్వం, కుటుంబ నియంత్రణపై నిషేధం ఉండటంతో క్రమంగా దేశ జనాభా కూడా పెరిగిపోయింది. అయినప్పటికీ, ఆ దేశంలో సహజ సిద్ధంగా లబించిన అపారమయిన ముడి చమురు నిల్వల వలన ఆ దేశ ఆర్ధిక పరిస్థితి బలంగా ఉన్నందున అక్కడ రాజరిక వ్యవస్థ దేశ జనాభాపై బాహ్య ప్రపంచ ఆర్ధిక ఒత్తిళ్ళు పడకుండా ఇంతకాలం బాగనే చూసుకోగలిగింది. కానీ, మతాచారాల వలన అదుపు తప్పి పెరుగుతున్న జనాభా సమస్యను మాత్రం అదిగమించలేకపోవడంతో క్రమంగా నిరుద్యోగం తద్వారా పేదరికం, సామాజిక అశాంతి మొదలవుతోంది. పెరుగుతున్న జనాభాను అరికట్టడం అక్కడ సాద్యం కాదు గనుక, ఇక స్థానికులకు ఉద్యోగంలో ప్రాదాన్యం ఈయడమే మిగిలి ఉన్న ఏకైక మార్గం.
ఆ ప్రయత్నంలో సౌదీ ప్రభుత్వం అన్ని సంస్థలలో స్థానికులకు 10 శాతం రిజర్వేషన్ అనే నిటకత్ పాలసీని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అక్కడ ప్రభుత్వం ఒకసారి శాసనం చేస్తే అది శిలాశాసనమేనని చెప్పవచ్చును. దానికి ఎదురు చెప్పే అవకాశం కానీ, కోర్టుల్లో అప్పీలు చేసుకొనే వీలు కానీ, దిక్కరించే దైర్యం గానీ ఎవరికీ ఉండదు. ఇప్పుడు దాని ప్రభావం మొట్ట మొదటగా భారతీయ కార్మికులపైనే పడుతుంది. తద్వారా వేలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దారి పట్టక తప్పదు.
నియమనిబందనలను అమలు పరచడంలో సౌదీ ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా ఉంటుందో బాగా ఎరిగిన కేరళ ప్రభుత్వం ఇప్పటికే తిరువనంతపురం, కొచ్చిన్, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌదీలో ఉద్యోగాలు కోల్పోనున్న వారికి సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసింది. ఈ విషయంలో మేల్కొనడానికి మన రాష్ట్రానికి మరి కొంచెం సమయం పట్టవచ్చును.