విజయవాడ సీటుకోసం పంతం పట్టిన గద్దె రామ్మోహన్
posted on Apr 3, 2013 @ 4:35PM
సాధారణ ఎన్నికలకి ఇంకా ఒక ఏడాది సమయం మిగిలిఉండగానే రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లు కనబడుతోంది. ఏ పార్టీని చూసిన టికెట్ల వ్యవహారం గురించి చర్చలు, అసంతృప్త రాగాలు తీస్తున్న నేతలే కనిపిస్తునారు. ఈ వ్యవహారాలతో రాజకీయ పార్టీలకి ఇప్పటి నుండే అగ్నిపరీక్ష మొదలయినట్లు ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టువంటి, కృష్ణా జిల్లా ప్రత్యేకించి విజయవాడ ఎన్నికల రాజకీయాలు అప్పుడే మంచి రసకందాయంలో పడ్డాయి.
ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ పార్లమెంటు సీటును కేశినేని నానికి దాదాపు ఖరారు చేయడంతో అక్కడి నుంచే పోటీ చేయాలనుకొన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు గద్దె రామ్మోహన్ తీవ్ర నిరాశ చెందారు. నిన్న చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడిన ఆయన విజయవాడ పార్లమెంట్ సీటు ఇవ్వకపోతే మరిక తానూ సామాన్య కార్యకర్తగా మాత్రమే పనిచేస్తాను తప్ప వేరే చోటనుండి శాసనసభకు పోటీ చేయబోనని ఖరాఖండిగా చెప్పడంతో బాబు ఖంగు తిన్నారు. కావాలనుకొంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాభిప్రాయసేకరణ కూడా జరిపి అందులో 90 శాతం తనకు అనుకూలంగా వస్తే సీటు ఇవ్వచ్చునని ఆలా కాదంటే వేరేవరికిచ్చినా తానేమి అభ్యంతరం చెప్పబోనని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఆ సీటును కేశినేని నానికి కేటాయించడంతో చంద్రబాబు గద్దెకు వెంటనే హామీ ఏమీ ఈయకపోయినా త్వరలోనే దీనికి సరయిన పరిష్కారం చెప్తానని అంతవరకు ప్రశాంతంగా ఉండమని నచ్చజెప్పి తిప్పి పంపేసారు.
2004, 2009 ఎన్నికల్లో కంకిపాడు, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుసార్లు పరాజయం పాలయిన గద్దె రామ్మోహన్, ఈ సారి ఎన్నికలలో ఎలాగయినా విజయం సాదించాలని అనుకొంటున్న సమయంలో హటాత్తుగా కేశినేని నాని వచ్చి తన సీటుకి ఎసరు పెట్టడం గద్దె రామ్మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా గత ఎన్నికలలో ఓటమి పాలయిన తరువాత నుండి విజయవాడ 'తూర్పు' ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయన ఆ నియోజక వర్గం తనకే కేటాయిస్తారనే పూర్తి నమ్మకంతో ఉండటం వలన ఆయన బాబు నిర్ణయంతో మరింత నిరాశకు గురయ్యారు.
గద్దె గతంలో గన్నవరం నియోజక వర్గం నుండి శాసన సభకు పోటీ చేయాలను కొన్నపుడు ఆయనకు పార్టీ టికెట్ కేటాయించలేకపోవడంతో ఆయన పార్టీని కూడా వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన తరువాత ఆయన మళ్ళీ పార్టీలోకి తిరిగిరావడం జరిగింది. 2009 ఎన్నికలలో సినిమా నిర్మాత అశ్వనీదత్‌కు సీటు ఇవ్వాల్సిరావడంతో 2004 ఎన్నికలలో ఆయనకు పార్లమెంటుకు పోటీ చేసేందుకు టికెట్ దొరకలేదు. కానీ, దానికి ప్రతిగా కంకిపాడు అసెంబ్లీ సీటు కేటాయించినప్పటికీ ఆయన దేవినేని చేతిలో ఓడిపోయారు.
నాటి నుండి ఆయనకు రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, రాబోయే ఎన్నికలలో విజయవాడ నుండి పార్లమెంటు సీటుకి పోటీ చేసి గెలిస్తే అంతా సరవుతుందని ఇంతకాలం భావిస్తున్న ఆయనకీ ఊహించని విధంగా కేశినేని రాకతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపద్యంలో ఇప్పుడు ఆయనకు విజయవాడ టికెట్ ఈయకపోతే మళ్ళీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఇక గన్నవరం సీటు విషయంలో కూడా వల్లభనేని వంశీ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. విజయవాడ అర్బన్ అధ్యక్షుడి పదవి నుండి చాలా అవమానకర రీతిలో తనను తప్పించినందుకు ఆగ్రహంతో ఉన్న వంశీ గన్నవరం నుండి తనకు టికెట్ ఈయకోతే పార్టీని వీడి ఇంట్లో కూర్చొంటానని ముందే హెచ్చరించారు. ఇప్పుడు విజయవాడ లోక్ సభ స్థానానికి గద్దె రామ్మోహన్ మరియు కేశినేని నాని, గన్నవరం శాసన సభ స్థానానికి వల్లభనేని వంశీ మరియు డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావుల టికెట్ కేటాయింపుల విషయంలో చంద్రబాబు అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు. అయితే ఇటువంటి అగ్నిపరీక్షలకి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని ఆయనకు బాగా తెలుసు.