విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందే: చిరంజీవి
posted on Apr 3, 2013 @ 5:20PM
విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందేనని, చార్జీల పెంపు నిర్ణయం సరైంది కాదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. చార్జీల పెంపు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు సీఎం కిరణ్ మంత్రివర్గంతో చర్చించాలని, ఏక పక్ష నిర్ణయాలవల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పేద ప్రజలపై చార్జీల భారం పడకుండా చూడాలని ఆయన కోరారు. విద్యుత్ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చిరంజీవి మండిపడ్డారు.
దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందన్న వార్తలో నిజం లేదని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో 2.1 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యాటకుల రక్షణపై కేంద్ర మంత్రి, సీఎంలతో మాట్లాడామని, విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో హోటళ్ల అనుమతులకు వెబ్‌సైట్‌ను చిరంజీవి ప్రారంభించారు.