రాజకీయాలలోకి మేకలు, పులులు, నక్కలు
posted on Apr 3, 2013 @ 11:04AM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జైల్లో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గురించి వర్ణిస్తూ ఆయన జైలులో ఉన్నపటికీ పులి వంటివాడని, పులి బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అని వర్ణించారు. ఆ తరువాత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనను నక్కతో పోల్చి పులి పులే నక్క నక్కే అని అన్నారు. తమ తండ్రిగారి పధకాలన్నిటినీ వేరే పేర్లతో తన స్వంత పధకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని విమర్శిస్తూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకొనట్లుంది అని ఆమె అన్నారు.
ఆమె మొదలుపెట్టిన ఈ పులి-నక్కా ఆటలో ఇంకా తెదేపా నాయకులెవరూ ప్రవేశించకపోయినప్పటికీ, తెదేపా కార్యకర్తలు ఆమెకు దీటుగా బదులిస్తూ సమాజంలో మేకవన్నె పులులు కూడా తిరుగుతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండబోతే అవి తినేస్తాయని అన్నారు.
మరి వీరిద్దరూ పులీ నక్కా అయితే మరి తెరాస అధ్యక్షుడు కేసీఆర్, పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ నారాయణ, సీపీయం రాఘవులు తదితరులు ఏ జాతులను కేటాయించాలి? అనే ధర్మ సందేహం ఒకటి మిగిలిపోయింది. ఇంతకీ ఎవరు పులో ఎవరు నక్కో తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు ఆగవలసిందే. అప్పుడు ప్రజలే ఎవరేమిటనేది నిర్ణయిస్తారు.