టీడీపీకి కేటీఆర్ మద్దతు.. టీడీపీతో ఉండండి

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు పంథాలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలుపొందాలని పావులు కదుపుతుంది. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. అటు టీఆర్ఎస్ కు ఓటు వేయమని చెబుతూనే.. టీడీపీకి కూడా మద్దతు పలుకుతున్నారంట కేసీఆర్ తనయుడు కేటీఆర్.. కేటీఆర్ ఏంటీ.. టీడీపీకి మద్దతు పలకడమేంటీ అనుకుంటున్నారా.. అదేంటంటే.. గ్రేటర్ లో సెటిలర్లు ఎక్కువ కాబట్టి.. వారిని తమ వైపు ఆకర్షించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సెటిలయిన రాజులను తమ వైపు తిప్పుకునే భాగంలో.. విభజన తరువాత సీమాంధ్రులు ఇక్కడ ఉంటే మా ప్రభుత్వానికి మద్దతివ్వండి.. ఏపీలో ఉంటే అక్కడ టీడీపీకి మద్దతు ఇవ్వండి అని ఓ కొత్త ప్ర‌తిపాద‌న ముందుకు తీసుకొచ్చారంట. అంతేకాదు కేటీఆర్ ప్రతిపాదనకు కొంతమంది  పెద్దలు సరే అన్నట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా అన్ని స్థాయిల్లో ఉన్న `రాజు`లను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లే బాధ్యత కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీసుకున్నారు. ఇక గ్రేట‌ర్లో ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో వారిని గులాబి గూటికి చేర్చేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారు. మొత్తానికి కేసీఆర్.. చంద్రబాబు సన్నిహితంగా ఉంటున్న వేళ కేటీఆర్ కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడం శుభపరిణామమే.

తెలుగు విద్యార్ధులు తమిళంలో రాయాల్సిందే..

తమిళనాడు ప్రభుత్వం నిర్భంధ తమిళ చట్టంలో భాగంగా తెలుగు విద్యార్ధులు తప్పనిసరిగా తమిళంలోనే పరీక్షలు రాయాలని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమిళరాష్ట్రంలో ఉన్న తెలుగు సంఘాలు కోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కూడా తెలుగు విద్యార్థులకు తెలుగులోనే పరీక్షలు రాయించాలని ఆదేశించింది కూడా. అయితే తమిళనాడు మాత్రం ఇప్పుడు అవన్నీ తోసి పుచ్చి.. పలు పాఠశాలల విద్యార్థులకు తమిళంలోనే పరీక్షలు రాయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.సబిత పేరుతో రాష్ట్రంలోని పలు పాఠశాలలకు లేఖలు కూడా పంపిచారు. ఆ లేఖల్లో సదరు విద్యార్థులు ఖచ్చితంగా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిందేనని సబిత స్పష్టం చేశారు. మరి ఈ లేఖలకు తెలుగుసంఘాలు ఎలా స్పందిస్తాయో..

దాడి చేసింది మేమే..

పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి ఉగ్రవాదులు.. భద్రతా దళాల మధ్య కాల్పులు జరగుతూనే ఉన్నాయి. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇప్పుడు పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రదాడి చేసింది తామేనంటూ.. పాకిస్థాన్ ప్రేరేపిత యూనైటెడ్ జిహాద్ కౌన్సిల్(యూజేసీ) ప్రకటించుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హైవే స్కాడ్‌తో అనుబంధం ఉన్న ఐక్య జిహాది మండలి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగినట్లు పేర్కొంది. మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.  

పాక్ కు భారత్ హెచ్చరికలు..

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇండియా పాక్ పై ఇక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేరథ్యంలోనే పాక్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో లష్కరే తోయిబా.. జోషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని.. తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారట. ఈ మేరకు పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారట. అంతేకాదు అవసరమైత్ భారతదేశ వాయుసేన సహకారాన్ని తీసుకొని ఉగ్రవాదులపై దాడులు చేయాలని సూచించారట. ఈ ఆదేశాలను పాక్ కనుక పట్టించుకోకపోతే భారత్-పాక్ మధ్య చర్చలు నిలిచిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. మరి భారత్ ఆదేశాలకు పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. పన్నులే ఆదాయం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ఏర్పాటుచేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేస్తామని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదేనని..భవిష్యత్తులో కరెంటు కోతలుండవని, వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు రూ. 24 వేల కోట్లతో రైతుల రుణమాఫీ చేశాం.. డ్వాక్రా మహిళలకు రూ 10 వేల చొప్పున రుణాలిచ్చామని తెలిపారు. విభజన తరువాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. రాజధాని లేదు.. హైదరాబాద్  10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయినా కానీ..అనేక సమస్యలు ఉన్నాయి.. అందుకే విజయవాడ నుండి పాలన చేస్తున్నామన్నారు. సరైన ఆదాయ వనరులు, నిధులులేని ఏపీకి ప్రజలు కట్టే పన్నులే ఆదాయమని, అటువంటిది పన్నులు చెల్లించడంలో అలక్ష్యం వహిస్తే ఎలాగని.. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ప్రజలు పన్ను కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

తుమ్మలపై కేసీఆర్ అదనపు బాధ్యత..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై ఓ భరువైన బాధ్యతను పెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 10 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అస్సలు పట్టులేని ఖమ్మం జిల్లాలో.. ఆ జిల్లా అభ్యర్ధిని గెలిపించడంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్రముఖ పాత్ర వహించినందుకు గాను కేసీఆర్ తుమ్మలను ప్రశంసించినట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలో భాగంగా సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండే స్థానాల్లో గెలుపు బాధ్య‌త‌ల‌ను కేసీఆర్ తుమ్మ‌ల‌కు అప్ప‌గించార‌ట‌. ముఖ్యంగా నగరంలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారట. ఇంక టీడీపీ నుంచి తెరాస‌లో చేరిన మాధ‌వ‌రం కృష్ణారావుతో కూడా తుమ్మ‌ల‌కు స‌న్నిహిత సంబంధాలు ఉండటంతో  కూక‌ట్‌ప‌ల్లి నియోక‌వ‌ర్గంలో ఎక్కువ డివిజ‌న్ల‌ను తెరాస ఖాతాలో వేసే బాధ్య‌త‌ను తుమ్మ‌ల తీసుకున్నార‌ట‌. మరి కేసీఆర్ పెట్టిన బాధ్యతను తుమ్మల కనుక నెరవేర్చితే.. తుమ్మలకు మంచి ప్రాధాన్య లభించడంతో పాటు కేబినెట్లో మంచి స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చంద్రబాబు నిర్ణయం.. వైసీపీ షాక్.. తెలుగు తమ్ముళ్లు హ్యాపీ..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీ నేతల సంగతి ఏమో కానీ టీడీపీ నేతలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారంట. అంతలా పార్టీ నేతలు సంతోషపడే పని చంద్రబాబు ఏం చేశారనుకుంటున్నారా.. నిధులు పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గంలో కూడా టీడీపీ ఇన్ ఛార్జ్ లకు  నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు ఇందులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే… వారికి నియోజకవర్గం పరిధిలో ఏదైనా బాధ్యతలు అప్పగించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చారంట. దీంతో ఒకవైపు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి నిర్ణయానికి ఖంగుతింటే.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న తమ నాయకులను ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఇలాంటి సరికొత్త నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మాత్రం తమ పార్టీ నేతలను దూరం చేసుకోకూడదని భావిస్తున్నట్టు అర్ధమవుతోంది.

గ్రేటర్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా టీఆర్ఎస్.. ఇన్‌చార్జ్ లకు ప్రచార కిట్

తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల సంగతేమో కాని టీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నగరంలో పెద్ద పెద్ద హోర్డింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యుహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కో డివిజన్ ఇన్‌చార్జీకి ప్రచార సామగ్రితో కూడిన కిట్‌ను అందజేస్తోందట అధికార పార్టీ. ఇంతకీ ఈ కిట్ లో ఏముందనుకుంటున్నారా.. ఈ కిట్‌లో డివిజన్ స్వరూపం, ఓట్లు, ఆ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు, ఇప్పటి వరకు ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తామేం చేయబోతున్నారు..  ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఇక ఈ వివరాల ఆధారంగా నేతలు ప్రచారం రంగంలోకి దిగుతారన్నమాట. అంతేకాదు దీనివల్ల క్యాడర్‌లో నెలకొనే గందరగోళాన్ని కూడా సులభంగా ఎదుర్కొనే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరి టీఆర్ఎస్ ఈ కిట్ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుద్దో చూడాలి.

భూకంప అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశా.. కేంద్రమంత్రి

ఈశాన్య భారతదేశంలో భూకంప చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూకంప అనుభవాన్ని తాను స్వయంగా చూసినట్టు చెబుతున్నారు కేంద్రమంత్రి నిర్మలారామన్. నిర్మలారామన్ ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటల్ని పరిశీలించేందుకు గాను పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడ ఆమె అనేక ప్రాంతాలు పర్యటించి పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అయితే అక్కడ ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో గది మొత్తం ఊగిపోయిన పరిస్థితులతో  ఆమె ఆందోళనతో బయటకు వచ్చారంట. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోయినా తాను మాత్రం భూప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని.. తాను బస చేసిన హోటల్ గది కంపించి పోయిందని.. అయితే.. తామంతా క్షేమంగా ఉన్నట్లుగా ఆమె ట్విట్టర్ లో తెలిపారు.

డైలమాలో పాక్-భారత్ ల ద్వైపాక్షిక చర్చలు..

ఈనెల 15 వ తేదీన పాక్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చలు జరుగుతాయో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. అయితే ఈ ఉగ్రవాదుల మూలాలు పాక్లోనే ఉన్నాయని.. ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. దీంతో పాక్-భారత్ మధ్య చర్చలు జరిగుతాయో లేదో అన్న డైలమా ఏర్పడింది. అంతేకాదు ఒకవైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని.. పాక్తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రానికి ఉగ్రవాదుల్ని హతమార్చారని.. ఆపరేషన్ ముగిసినట్లుగా కేంద్రం ప్రకటించినా.. ఇంకా కొంత మంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో దాక్కున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎయిర్ బేస్ దగ్గర భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఆర్మీ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మొత్తానికి భారీ వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాగా ఎయిర్ బేస్ లో ఇంకా ఎంతమంది ముష్కరులు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

టీఆర్ఎల్ లో చేరిన విజయరామారావు..

టీడీపీ నేత.. మాజీ మంత్రి విజయ రామారావు కొద్ది రోజుల క్రితం టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి మారబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  అయితే అప్పుడు విజయరామారావు తన చేరిక గురించి ఆలోచించి నిర్ణయం చెబుతానన్నారు.. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి.. పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారని.. దాంతో విజయరావు కూడా సందిగ్దంలో పడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు విజయరామారావు చేరికపై అనుమానాలు తీరిపోయినట్టే. ఎందుకంటే విజయరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విజయరామారావు టీఆర్ఎస్ లోకి చేరారు. కేసీఆర్ గులాబీ కండువాకప్పి విజయరామారావుని పార్టీలోకి ఆహ్వానించారు. కాగా విజయరామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.

వణికిన ఈశాన్యం.. ఆరుగురు మృతి

ఈశాన్య భారతదేశం భూకంపంతో వణికిపోయింది. బంగ్లాదేశ్, ఇంపాల్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లో ఉదయం 4.30 గంటలకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు, మల్టీ కాంప్లెక్స్ లు కూలిపోయాయి.  ఈ ఘటనకు ఆరుగురు మృతి చెందగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు సహాయక చర్యలకు గాను ఎన్టీఆర్ ఎఫ్ బృందాలుఇంపాల్ బయలుదేరాయి. ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భూకంపం గురించి ఆరా తీశారు. అసోం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇంపాల్ లోని భూకంప పరిస్థితి పై సమీక్షిస్తున్నారు.

ఆఫ్ఘానిస్తాన్ లో భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదుల దాడి

  ఈ కొత్త సంవత్సరంలో భారత్ లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మళ్ళీ నిన్న రెండవసారి దాడికి పాల్పడ్డారు. మొన్న జనవరి 1వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘానిస్తాన్ లో మజారీ షరీఫ్ నగరంలో ఉన్న భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. భద్రతాదళాలు వారి దాడిని తిప్పికొట్టాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.   సాధారణంగా ఉగ్రవాదులు మిలటరీ దుస్తులు ధరించి, కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటారు. లేదా బాంబులతో నింపిన వాహనంలో దూసుకువచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడుతుంటారు. కానీ ఈసారి మాత్రం పక్కనే ఉన్న మరో భవనంలోకి చొరబడి, దానిలో నుంచి కాల్పులు జరుపుతూ భారత కౌన్సిలేట్ భవనంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరినీ భద్రతాదళాలు వెంటనే కాల్చి చంపాయి. మిగిలిన ఇద్దరూ ఇంకా కాల్పులు జరుపుతున్నారు.   ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలియగానే కౌన్సిలేట్ భవనం లోపల ఉన్న దౌత్యాధికారులు, ఉద్యోగులు అందరినీ అదే భవనంలో ఒక సురక్షితమయిన ప్రాంతానికి తరలించారు. “భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదులు దాడులు చేసారు. అందరూ క్షేమంగా ఉన్నాము,” అని ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ జనరల్ బ్రజబాషి సర్కార్ ప్రకటించారు. ఉగ్రవాదుల దాడి సంగతి తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఉగ్రవాదులు దాకొన్న భవనాన్ని చుట్టు ముట్టాయి. ఆ భవనంలో దాకొన్న ఇద్దరు ఉగ్రవాదులకి భద్రతాదళాలకు మధ్య ఇంకా కాల్పులు జరుతున్నాయి. ఈ దాడికి పాల్పడినవారెవరో ఇంకా ప్రకటించుకోలేదు.   ప్రధాని నరేంద్ర మోడి కాబూల్, లాహోర్ పర్యటనల తరువాత మొదట పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై, మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడులు చేయడం గమనిస్తే, మోడీ ప్రారంభించిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించడానికే ఈ దాడులు జరుగుతున్నాయేమొన్నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికీ కూడా పనికిరాడు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కాకపోతే తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికీ కూడా అర్హుడు కాదని అన్నారు. ఈ సందర్బంగా ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావిస్తూ గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున కెటిఆర్ ప్రచారం చేస్తే టిడిపి నుంచి నేను వస్తానని.. టిఆర్ఎస్ నుంచి కెసిఆర్ వస్తే టిడిపి నుంచి చంద్రబాబు వస్తారన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపింది ఎన్టీఆరేనని.. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో కాకుండా గతంలో కేసీఆర్ ఆంధ్రా బిర్యానిని పేడ బిర్యాని అని విమర్శించగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిని గుర్తు చేస్తూ.. కేసీఆర్ ఆంధ్రా బిర్యాని పేడ బిర్యాని అన్నారు.. ఇప్పుడు అమరావతి వెళ్లి అదే పేడ బిర్యాని తిని వచ్చారు అని ఎద్దేవ చేశారు. మరి ఇద్దరు సీఎంలు సన్నిహితంగా మెలుగుతున్న వేళ.. రేవంత్ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రేవంత్ వ్యాఖ్యలకు కేసీఆర్.. కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కేజ్రీవాల్ రూల్ తో 4 లక్షల ఆదాయం..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యం నివారణకి సరి-బేసి విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ విధానం వల్ల అటు కాలుష్య నివారణతో పాటు.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది. అదెలాగంటే.. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై రూ. 2వేల రూపాయలు జరిమానా విధించమని కేజ్రీవాల్ తెలిపిన సంగతి విదితమే. నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా సరి-బేసి విధానాన్ని అమలు చేసిన తొలి రోజునే దాదాపు 200 పైన మంది ఈ నిబంధనను ఉల్లంఘించి పోలీసులకు బుక్కాయ్యారు. దీంతో వారి దగ్గర నుండి పోలీసులు 4 లక్షలకు పైగా జరిమానా వసూలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు మీటర్లు కూడా వేయకుండా ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు చాలా వచ్చాయి. దీంతో పోలీసు రవాణా శాఖ అధికారులు 76 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి జరిమానా వసూలు చేశారు.