కేరళలో మద్యనిషేదానికి సుప్రీం ఒకే
కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త మద్యం పాలసీ దెబ్బకి ఆ రాష్ట్రంలో మద్యం వ్యాపారులు, సంస్థలు అన్నీ దెబ్బతిన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్న బార్లలో తప్ప బయట మద్యం బార్లలో ఎక్కడా మద్యం అమ్మరాదని ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మొదట రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ వారి పిటిషన్ తిరస్కరించబడటంతో సుప్రీం కోర్టు వెళ్ళారు. ఈసారి వారి తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహాత్గీతో సహా పలువురు ఉద్దండులయిన న్యాయవాదులు వాదించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జస్టిస్ విక్రంజిత్ సేన్, జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం కూడా మద్యనిషేధం అమలుచేయాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ వారి పిటిషన్ కొట్టివేసింది. మద్యనిషేధం కారణంగా నష్టపోయే మద్యం వ్యాపారులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం వివిధ మద్యం ఉత్పత్తి సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంపీ డిస్టిలరీస్ షేర్లు-3.20 శాతం, పింకాన్ స్పిరిట్-3.05 శాతం, తిలక్ నగర్ ఇండస్ట్రీస్-2.75 శాతం, యునైటడ్ స్పిరిట్స్-2.69 శాతం, యునైటడ్ బ్రూవరీస్-0.71 శాతం నష్టపోయాయి.
దేశ వ్యాప్తంగా చూసినట్లయితే మద్యపానంలో కేరళ వాటా 14.9 శాతంగా ఉంటోంది. గత మూడు దశాబ్దాలలో కేరళ రాష్ట్రంలో మద్యం విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 1985 ఆర్ధిక సం.లో రూ.55.46 కోట్లు మాత్రమే ఉన్న మద్యం అమ్మకాలు 2013-14సం. ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ. 9353.74 కోట్లకి చేరుకొన్నాయి. కేరళ రాష్ట్రంలో రోజుకి రూ.30 కోట్లు విలువయిన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో ఆ ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొన్న తరువాత మద్యపానం 20.27 శాతం పడిపోయింది. తత్ఫలితంగా రూ.4,000 కోట్ల ఆదాయం కోల్పోయింది. రాష్ట్రంలో 700 బార్లు మూతపడ్డాయి. వాటిపైనే ఆధారపడిన అనేక వందల మంది రోడ్డున పడ్డారు. మద్యం వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.
కేరళ రాష్ట్రం ప్రధానంగా పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంది. అక్కడికి దేశ విదేశాల నుండి పర్యాటకులు బారీ సంఖ్యలో వస్తుంటారు. ఆ కారణంగానే అక్కడ మద్యం వ్యాపారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన పర్యాటక రంగంపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చును.