టీడీపీకి కేటీఆర్ మద్దతు.. టీడీపీతో ఉండండి
posted on Jan 5, 2016 @ 10:14AM
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు పంథాలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలుపొందాలని పావులు కదుపుతుంది. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. అటు టీఆర్ఎస్ కు ఓటు వేయమని చెబుతూనే.. టీడీపీకి కూడా మద్దతు పలుకుతున్నారంట కేసీఆర్ తనయుడు కేటీఆర్.. కేటీఆర్ ఏంటీ.. టీడీపీకి మద్దతు పలకడమేంటీ అనుకుంటున్నారా.. అదేంటంటే.. గ్రేటర్ లో సెటిలర్లు ఎక్కువ కాబట్టి.. వారిని తమ వైపు ఆకర్షించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సెటిలయిన రాజులను తమ వైపు తిప్పుకునే భాగంలో.. విభజన తరువాత సీమాంధ్రులు ఇక్కడ ఉంటే మా ప్రభుత్వానికి మద్దతివ్వండి.. ఏపీలో ఉంటే అక్కడ టీడీపీకి మద్దతు ఇవ్వండి అని ఓ కొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారంట. అంతేకాదు కేటీఆర్ ప్రతిపాదనకు కొంతమంది పెద్దలు సరే అన్నట్లు కూడా సమాచారం.
ఇదిలా ఉండగా అన్ని స్థాయిల్లో ఉన్న `రాజు`లను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లే బాధ్యత కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీసుకున్నారు. ఇక గ్రేటర్లో ఉన్న కమ్మ సామాజికవర్గం విషయానికి వస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారిని గులాబి గూటికి చేర్చేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారు. మొత్తానికి కేసీఆర్.. చంద్రబాబు సన్నిహితంగా ఉంటున్న వేళ కేటీఆర్ కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడం శుభపరిణామమే.