తెలంగాణ నేతలు చేసేది ఫారిన్ స్టడీ టూర్లా..? లేక విహారయాత్రలా..?
సామాన్య వ్యక్తులుగా ఉన్నప్పుడు టూర్లకు వెళతారో లేదో కానీ.. రాజకీయాల్లో ఒక పదవిలో ఉన్నప్పుడు మాత్రం నాయకులు టూర్ల మీద టూర్ల వెళుతుంటారు. అయితే దానికి స్టడీ టూర్లు అనే ముసుగు తగిలించి వెళుతుంటారు. సాధారణంగా రాజకీయ నేతలు కానీ..అధికారులు కానీ స్టీడీ టూర్లు పేరిట విదేశాలు వెళుతుంటారు. ఎందుకంటే అక్కడి దేశాల్లో ఉపయోగించే వినూత్న పద్దతులను తెలుసుకొని ఇక్కడ మన ప్రాంతంలో వాటిని అమలుపరచి రాష్ట్రాన్ని అభివృద్ధి పంథాలో నడిపించడానికి చూస్తారు. కానీ మన రాజకీయ నేతలు..అందునా తెలంగాణ రాజకీయ నేతలు, అధికారులు చేసే స్టడీ టూర్లలో ఎంత మాత్రం మేటర్ లేదనిపిస్తుంది. ఎందుకంటే వారు చేసే టూర్లలో.. స్టడీ సంగతేమో కానీ.. విహార యాత్రలను మాత్రం తలపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రభుత్వం కోట్లకు కోట్లు ఈ స్టడీ టూర్ల పేరుతో ఖర్చుపెడుతున్నా.. వాటి వల్ల వచ్చే ఫలితమేదైనా ఉందా అంటే.. అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వారు స్టడీ టూర్లు పేరిట విదేశాలు వెళ్లడమే కాని అక్కడ వారు పాల్గొన్న వర్క్ షాపులకు సంబంధించి కానీ.. విదేశీ అధికారులతో వారి జరిపిన మంతనాలు గురించి కానీ ఎలాంటి రిపోర్టు ఉండదు. గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ.. అంతేకాదు మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ఒక నేత తన సర్వీసులో దాదాపు 90 దేశాలు తిరిగొచ్చినా.. దానికి సంబంధించిన ఒక రిపోర్టు కూడా లేకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అదే పరిస్థితి.. ఎంతో మంది అధికారులు, తెలంగాణ మంత్రులు విదేశీపర్యటనలు చేసినవారే. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గాను అనేక విదేశాలు తిరిగారు.. ఇక తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఆర్ధికసంస్కరణలు, పన్నుల వ్యవస్థను ఆయన అధ్యయనం చేయడం కోసం వెళ్లారు. ఇంక పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రి కల్చరల్ ఎగ్జిబిషన్ కోసంకు గాను ఇశ్రాయేల్.. జూపల్లి కృష్ణారావు.. బయో ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కాను ఫిలథెల్పియా, యుఎస్ .. ఎస్ కే జోషి అస్ట్రేలియా, స్పెయిన్, జీహెచ్ ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్ రెడ్డి ఫ్రాన్స్ వంటి విదేశాలు చుట్టినా.. వీరందరిలో ఏ ఒక్కరూ వారు చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను సమర్పించిన వారు లేరు.
అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ టూర్ల విషయంలో కాస్త ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓ తెలంగాణ అధికారి తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిక సంబంధించిన నివేదికలు ఏం అందిచాల్సిన అవసరం లేదని కొంత మంది నేతలు కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. అయితే ఎక్కడో ఎప్పుడో.. ఇద్దరు ముగ్గురు అధికారులు వారు చేసిన టూర్లకు సంబంధించి నివేదికలు సమర్పించినా అవి మాత్రం స్టోర్ రూంలో భద్రంగా ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అధికారి వి నరేందర్ రావు సింగపూర్, హాంగ్ కాంగ్ వెళ్లి అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్లానింగ్ గురించి అద్యయనం చేసి దానికి సంబంధించిన నివేదికను ఈ ఏడాది ఫిభ్రవరి నెలలో అందించినా దానిని స్టడీ చేయడానికి మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇంత వరకూ తీరిక దొరకలేదు. మరోవైపు మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కూడా అనేక విమర్శలు చేస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విదేశీ పర్యటనలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా నాయకులు మాత్రం ఎంచక్కా స్టడీ టూర్లు పేరిట విహారయాత్రలు చేస్తూనే ఉన్నారు. అన్నింటిలో చాలా నిఖ్చచ్చిగా ఉండే కేసీఆర్ మరి ఈ యాత్రల విషయంలో ఎందుకు ఆలోచించట్లేదో.. లేక ఉమ్మడి రాష్ట్రంలో మా నేతలకు వెళ్లే ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు వెళ్తున్నారు.. పోనిలే అని ఊరుకుంటున్నారా అని అనుకుంటున్నారు. మరి ఈ యాత్రలకు బ్రేక్ పడేదెప్పుడో చూడాలి.