తుమ్మలపై కేసీఆర్ అదనపు బాధ్యత..
posted on Jan 4, 2016 @ 12:17PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుపై ఓ భరువైన బాధ్యతను పెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 10 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అస్సలు పట్టులేని ఖమ్మం జిల్లాలో.. ఆ జిల్లా అభ్యర్ధిని గెలిపించడంలో తుమ్మల నాగేశ్వరరావు ప్రముఖ పాత్ర వహించినందుకు గాను కేసీఆర్ తుమ్మలను ప్రశంసించినట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలో భాగంగా సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే స్థానాల్లో గెలుపు బాధ్యతలను కేసీఆర్ తుమ్మలకు అప్పగించారట. ముఖ్యంగా నగరంలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారట. ఇంక టీడీపీ నుంచి తెరాసలో చేరిన మాధవరం కృష్ణారావుతో కూడా తుమ్మలకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో కూకట్‌పల్లి నియోకవర్గంలో ఎక్కువ డివిజన్లను తెరాస ఖాతాలో వేసే బాధ్యతను తుమ్మల తీసుకున్నారట. మరి కేసీఆర్ పెట్టిన బాధ్యతను తుమ్మల కనుక నెరవేర్చితే.. తుమ్మలకు మంచి ప్రాధాన్య లభించడంతో పాటు కేబినెట్లో మంచి స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.