నేటి నుంచి విశాఖ ఉత్సవాలు ప్రారంభం
ప్రతీ ఏట మూడు రోజులపాటు విశాఖ ఉత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖనగరంలోని ఎం.జి.ఎం.పార్కులో పుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. విశాఖలో ప్రముఖ పర్యాటక ఆకర్షణలయిన రామకృష్ణా బీచ్, భీమిలి బీచ్, కైలాసగిరి పార్క్, ఉడా పార్క్, జాతర పార్క్ లలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి జానపద, నృత్య, నాటక కళాకారులు వచ్చి ఈ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో రామకృష్ణ బీచ్ వద్ద జరిగే కార్యక్రమాలను, అక్కడి కోలాహలాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అలాగే జిల్లా నలుమూలల నుంచి వచ్చే జానపద కళాకారులు మధురవాడ సమీపంలో గల జాతర పార్కులో ఇచ్చే అత్యద్భుతమయిన ప్రదర్శనలు చూడటానికి దూర దూర ప్రాంతాల నుంచి బారీగా ప్రజలు తరలివస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఉత్సవాల ముగింపు రోజున వచ్చి పాల్గొంటారు.