రైల్వే జీఎంపై జేసీ ఫైర్.. టీడీపీ ఎంపీల బాయ్ కట్..
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు టీడీపీ ఎంపీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో రవీంద్ర గుప్తా.. టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుప్తా రైల్వేకు సంబంధించి పలు సూచనలు చేయాలంటూ కోరారు. అయితే ఈ సమావేశానికి హాజరైన జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా రవీంద్ర గుప్తాపై ఫైర్ అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లకు నిధులు కేటాయించలేనప్పుడు, కొత్త రైళ్లను కేటాయించనప్పుడు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేనప్పుడు ఈ సమావేశాలెందుకని ప్రశ్నించారు. దీంతో జేసీ, రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో వాగ్వాదానికి దిగారు. ఎంపీలు అక్కడి నుండి వాకౌట్ చేశారు.
మరోవైపు ఈ విషయంపై ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రైల్వే అధికారుల సమావేశాన్ని టీడీపీ అధికారులు బహిష్కరించలేదని అన్నారు. పైరవీలు చేస్తే తప్ప రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రావని.. వరదలు, తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖలో రైల్వే జోన్ ఎందుకు.. రాజధాని, గుంటూరు ప్రాంతాల్లో రైల్వే జోనులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు.