డైలమాలో పాక్-భారత్ ల ద్వైపాక్షిక చర్చలు..
posted on Jan 4, 2016 @ 10:02AM
ఈనెల 15 వ తేదీన పాక్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చలు జరుగుతాయో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. అయితే ఈ ఉగ్రవాదుల మూలాలు పాక్లోనే ఉన్నాయని.. ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. దీంతో పాక్-భారత్ మధ్య చర్చలు జరిగుతాయో లేదో అన్న డైలమా ఏర్పడింది. అంతేకాదు ఒకవైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని.. పాక్తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా శనివారం సాయంత్రానికి ఉగ్రవాదుల్ని హతమార్చారని.. ఆపరేషన్ ముగిసినట్లుగా కేంద్రం ప్రకటించినా.. ఇంకా కొంత మంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో దాక్కున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎయిర్ బేస్ దగ్గర భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఆర్మీ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మొత్తానికి భారీ వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాగా ఎయిర్ బేస్ లో ఇంకా ఎంతమంది ముష్కరులు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.