పఠాన్ కోట్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ లో దర్యాప్తు ముమ్మరం..

పంజాబ్ లోని పఠాన్‌కోట్‌ విమాన స్థావరంపై ఉగ్రదాడి కేసులో నిందితుడిగా ఉన్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్పీందర్ సింగ్ ను ఎన్ఐఏ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను సోమవారం దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించగా సల్వీందర్ సింగ్ మాత్రం విరుద్ధ సమాధానాలు చెప్పడంతో లైడిటెక్టర్ పరీక్షలకు పంపిచాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈవిచారణలో భాగంగానే సల్వీందర్ సింగ్‌ వద్ద వంట మనిషిగా ఉన్న మదన్ గోపాల్‌కూ ఎన్ఐఎ సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఈ నెల 13న హాజరు కావాలని చెప్పింది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ దాడిపై విచారణ చేపట్టేందుకు గాను పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐబీ, ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్ఐఏ, స్థానిక పోలీసులతో కలిపి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దర్యాప్తు బృందం మూడు జిల్లాల్లో ముమ్మర సోదాలు చేసి పదుల సంఖ్యలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ దర్యాప్తుకు సంబంధించిన నివేదికను కూడా భారత్ కు అందజేశారంట. అయితే ఉగ్రవాదులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు భారత్ తెలిపినా తమ దేశంలో రిజిష్టర్ కాలేదని ఆ నివేదికలో పాక్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

బస్సులో చంద్రబాబు నిద్ర.. సీక్రెట్ ఏంటీ..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో నిర్వహిస్తున్న ఐసీసీ సదస్సులో పాల్గొంటున్న సంగతి తెలసిందే. ఈ సదస్సు ద్వారా ఎంతోమంది పెట్టిబడిదారులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ఈ సదస్సు సందర్బంగా చంద్రబాబు చేస్తున్న ఒక పని గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. అదేంటంటే పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖ నగరిలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వైజాగ్ వచ్చిన బాబు.. గవర్నర్ బంగ్లా ఆవరణలో బస్సులో నిద్రపోవటం. దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుపై ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారని.. తన ప్రయాణాల నిమిత్తమైతేనేమి.. తన ఇల్లు... ఆఫీసు నిమిత్తమైతేనేమి ఎన్నో విమర్శలు చవిచూశారు. అందుకే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు ఈ సదస్సుకు వచ్చిన పారిశ్రామివేత్తల దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నారని.. దీని ద్వారా ఏపీ కోసం ఎంత కష్టపడుతున్నారన్న సంకేతాలు పంపినట్టు అవుతుందని ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇలా ఉంటే బాబు ఇలా చేయడం వల్ల  ఏపీ బ్రాండ్  ఇమేజ్ కు దెబ్బ తీసేలా ఉందన్న వాదన కూడా  వినిపిస్తోంది. మరి బాబు నిద్ర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో బాబుకే తెలియాలి.

చైనా మనకు స్ఫూర్తి.. యనమల

అభివృద్ధిలో చైనా మనకు స్ఫూర్తి అని ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్నసీఐఐ సదస్సు మూడోరోజు సందర్భంగా యనమల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి.. ఏపీ అభివృద్దికి పారిశ్రామికవేత్తలు తోడ్పాటు అందించాలని కోరారు. అంతేకాదు భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్‌, మైనింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంధన, తయారీ, రిటైల్‌, సీఆర్‌డీఏ, గృహ నిర్మాణ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు ముందుకొచ్చాయి.. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కేటీఆర్ సవాల్ వెనుక అసలు కారణం అదా..?

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు సవాళ్లు విసురుకోవడం సహజమే. అయితే అది గెలుపు పక్కా తమదని తెలిసిన నేతలు.. కచ్చితంగా గెలుస్తామనే భరోసా ఉన్నవాళ్లు చేస్తారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అలాంటి సవాళ్లే చేసి ప్రతిపక్షాలకు చెమట్లు పట్టిస్తున్నారు. తాజాగా కేటీఆర్ తాము గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతే తాను మంత్రి పదవి నుండి తప్పుకుంటానని.. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక ఓడిపోతే తమ పదవులకు రాజీనామా చేస్తారా అని బహిరంగంగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు కేటీఆర్ సవాల్ పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.   అయితే అసలు కేటీఆర్ సవాల్ విసరడం వెనుక మాత్రం వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రేటర్లో కచ్చితంగా తాము గెలుస్తామన్న ధీమా కేటీఆర్ విసిరిన సవాల్ కు ఒక కారణం కాగా.. మరొకటి ప్రతిపక్షాల స్థయిర్యాన్ని మానసికంగా దెబ్బతీసే సరికొత్త రాజకీయ క్రీడ అని భావిస్తున్నారు. అంతేకాదు తన సవాల్ ద్వారా గెలుపు విషయంలో ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసినట్లు అవుతుందని.. రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కేటీఆర్ సవాల్ కు టీడీపీ స్పందించిది.. కానీ కాంగ్రెస్.. బీజేపీలు స్పందించలేదు. గ్రేటర్ ఎమ్మెల్యే ల గెలుపు కాకుండా..పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని కోరింది. మొత్తానికి కేటీఆర్ బాగానే రివర్స్ గేమ్ ఆడుతున్నారు.. మరి కేటీఆర్ చెప్పినట్టు గెలుపు ఎవరిది అవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

చంద్రబాబుకు భద్రతను పెంచండి.. నిఘా విభాగం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత నిమిత్తం నిఘా విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు భద్రతను పెంచాలని.. సీఎం ప్రయాణించే హెలికాప్టర్, విమానాన్ని ప్రయాణానికి ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పలు సూచనలు చేస్తూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్ నుండి మకాం మార్చిన చంద్రబాబు లింగమనేని గెస్ట్ హౌస్ కృష్ణా నది ఒడ్డున ఉంటున్న సంగతి తెలిసిందే. దీని గురించి ప్రస్తావిస్తూ సీఎం కృష్ణా నది ఒడ్డున ఉన్నందున, నదిలో మెకనైజ్డ్ బోట్‌లో పోలీసులతో 24 గంటలు పహారా పెట్టాలని.. ఈ బోటులో గజ ఈతగాళ్లు, స్విమ్మింగ్ నెట్, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉండాలని తెలిపింది.

ఉగ్రదాడిపై షరీఫ్ ఆదేశాలు..

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై జరిగిన ఉగ్రదాడి పై సంయుక్త విచారణ బృందం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా  ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ బృందం సమావేశమయింది. మరోవైపు ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో), ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్), ఎంఐ (మిలటరీ) అధికారులతో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ పైన దాడి కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా భారత్ ఒత్తిడితో పాకిస్థాన్ చర్యలకు సిద్దమైందని అంటున్నారు.

నిజం బయటకు రాకుండా ఉండాలనే.. మమతా బీజేపీ ఫైర్..

బీజేపీ నేతలు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై గత ఆదివారం బెంగాల్‌లోని ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి వివరాలు తెలుసుకోవడానికి బీజేపీ నిర్ధారణ కమిటీ మాల్దా వెళ్లింది. అయితే వారిని పోలీసులు అక్కడే అడ్డగించి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో వారిని తిరిగి కోల్‌కతా పంపించేశారు. దీంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకు రాకుండా ఉండాలని మమతా బెనర్జీ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ ఘటనపై కేంద్రం ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని కోరగా.. అవి మత ఘర్షణలు కావని బీఎస్‌ఎఫ్‌కు స్థానిక ప్రజలకు మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమేనని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

రోజాకు చేదు అనుభవం.. రోజా గోబ్యాక్ అంటూ నినాదాలు..

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు ఆమె పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసిపి మండల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లగా టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. మంత్రి పీతల సుజాతను రోజా.. సుజాతకు వడ్డాణాలు, డబ్బుల పైన ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల పైన లేదని..ఆమెకు చంద్రబాబు భజన తప్ప ఇంకొకటి తెలియదని ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలో ఓ దళిత మంత్రిని అవమానపరిచేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలని టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు.  రోజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలు కూడా రావడంతో టీడీపీ.. వేసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు అక్కడకి వచ్చి పరిస్థితిని చక్కదిద్ది.. రోజాని వెనక్కి వెళ్లమని సూచించారు.  

సీఎం కావాలని కోరుకోలేదు.. నాకు మంత్రి పదవే ఎక్కువ.. కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ప్రతిపక్షాలకు ఓ సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు తమదేనని.. గ్రేటర్ ఎన్నికల్లో తాము కనుక ఓడిపోతే మంత్రి పదవి నుండి తప్పుకుంటా.. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక ఓడిపోతే వారు తప్పుకోవడానికి సిద్దమా అని అన్నారు. అంతేకాదు నాకు మంత్రి పదవే ఎక్కువ.. ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే మంత్రి పదవి వచ్చింది.. కలలో కూడా సీఎం కావాలని కోరుకోలేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పై కూడా నాలుగు విమర్శల బాణాలు వదిలారు. రామమందిరం కడతామని రాముడికే కమలం పార్టీ శఠగోపం పెట్టిందని.. అది భారతీయ జనతా పార్టీ కాదని భారతీయ జోక్ పార్టీ అని విమర్శించారు. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు. ఆయన అన్ని రాష్ట్రాలకు ప్రధాని అని, ఇంతవరకు తెలంగాణకు రాకపోవడం శోచనీయమన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. సెటిలర్లకు కేసీఆర్ గాలం

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ సెటిలర్ల దృష్టిని ఆకర్షించడానికి పలు వ్యూహాత్మక రచనలు చేస్తంది. ఇప్పటికే కేటీఆర్ సీమాంధ్రులను ఆకట్టుకోవడానికి వాక్చాతుర్యాన్ని వాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ మరో నిర్ణయం తీసుకొని వారికి గాలం వేసినట్టు కనిపిస్తుంది. అదేంటంటే.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పది నుంచి 12 మంది సెటిలర్లను పోటీకి దింపాలనే యోచన చేయడం. ఎందుకంటే గత 15 ఏళ్ల టిఆర్ఎస్ చరిత్రలో గ్రేటర్ ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని సెటిలర్లకు ఇవ్వనే లేదు. అలాంటిది ఇప్పుడు సెటిలర్లకు ఆ ఛాన్స్ ఇస్తుండటంతో సీమాంధ్రులకు బాగానే గాలం వేస్తున్నట్టు కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఇప్పటికే జీహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ దాదాపు 140 మంది సీమాంధ్ర సెటిలర్లు దరఖాస్తులు పెట్టుకున్నారట. దీంతో సీమాంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న డివిజన్లలో వారిని పోటీకి దింపాలని కెసిఆర్ భావిస్తున్నారు.

కేసీఆర్, బాబుల ఫ్రెండ్‌షిప్ పై రేవంత్ రెడ్డి..

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కేసీఆర్.. చంద్రబాబు ఇద్దరూ సన్నిహితంగా ఉన్న తాను మాత్రం ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటానని.. వారి ఫ్రెండ్‌షిప్ తన చేతులు కట్టేయలేదని అని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. కెసిఆర్ మిత్రుత్వం తెరాసపై రేవంత్ రెడ్డి చేయి కట్టేసినట్లయిందనే వాదనలు వినిపిస్తున్నాయని అడగ్గా ఆయన పైవిధంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కెసిఆర్ ఒకటి రెండుసార్లు కలిశారని, అలాంటప్పుడు మంత్రి కెటిఆర్ ప్రధాని పైన, బిజెపి పైన విమర్శలు చేయడం లేదా అని తిరిగి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని చెప్పారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి - బిజెపి గెలుపు ఖాయమని.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి పునర్వైభవం కోసం పాకులాడటం లేదని, ఇప్పటికి తమ పార్టీకి నగరంలో పట్టు ఉందని వ్యాఖ్యానించారు.

అలా చేస్తేనే పాక్-భారత్ ల మధ్య చర్చలు..

పంజాబ్ లో పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసందే. ఈనేపథ్యంలో భారత్-పాక్ ల మధ్య ఈ నెల 15 న జరగనున్న ద్వైపాక్షిక చర్చలు రద్దయ్యాయి. పఠాన్ కోట్ పై దాడి చేసిన సూత్రధారులపై పాకిస్థాన్ చర్యలు తీసుకునే వరకు చర్చలు జరగవని కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందిన తర్వాత చర్చలపై పునరాలోచిస్తామని.. అప్పటి వరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సంబంధించిన సాక్ష్యాలను భారత్ తమకు అందించిందని పాక్ విదేశాంగశాఖ సైతం అంగీకరించింది. సాక్ష్యాల ప్రకారం దోషులపై చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.

రెండో రోజు ప్రారంభమైన పార్టనర్ షిప్ సదస్సు..

విశాఖలో రెండో రోజు పార్టనర్ షిప్ సదస్సు ప్రారంభమైంది. ఈ రెంజో రోజు సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, జయంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పలు ఐటీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా నిన్న ప్రారంభమైన ఈ సదస్సులో దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొదటి రోజే 32 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 49 ఐటీ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోనుంది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశం నలు మూలల నుంచి 1100 మంది ప్రతినిధులు, 41 దేశాల నుంచి 315 మంది విదేశీ ప్రతినిధులు, ఇతరులతో సహా అందరూ కలిపి 1450 మంది పాల్గొన్నారన్నారు. ఆదివారం జరిగిన 32 ఒప్పందాల ఆచరణలోకి వస్తే మొత్తం 94,748 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. అంతేకాదు ప్రపంచంలో భారత్ కు ఉన్న అనుకూలతలు మరే దేశానికి కూడా లేవని.. భవిష్యత్ లో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోందని.. మోడీ ప్రభుత్వంలో భారత్ దూసుకెళ్తుందని..భారతీయులు సాంకేతిక అంశాల్లో ముందంజలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సిల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరీక్షలు..!

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉగ్రవాదుల దాడి కేసుపై ఎన్ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే  ఈ కేసులో నిందితుడిగా ఉన్న గురుదాస్ పూర్ ఎస్పీ సిల్వీందర్ సింగ్ ను ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో విచారించనున్నారు. అంతేకాదు సిల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఎన్ఐఏ విచారణలో సల్వీందర్ చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో ఎన్‌ఐఏ లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలుస్తుంది.

ముగిసిన రాహుల్ యూరప్ టూర్.. పార్టీ నేతలతో సమావేశం..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తాను యూరప్ పర్యటనలో ఉండగా జరిగిన పరిణామాలేమిటి అన్నదానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు నిమిత్తం దాదాపు రెండు నెలల వరకూ విశ్రాంతి తీసుకున్న సంగతి విదితమే. అయితే అప్పుడు అతని అజ్ఞాతంపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విమర్శల బాణాలు సంధించాయి. దీంతో ఈసారి కూడా అలానే జరుగుతుందని రాహుల్ ముందుగానే ఊహించుకొని ఉంటారు.. అందుకే డిసెంబర్ 28న తాను యూరప్ పర్యటనకు వెళ్తున్నట్టు ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. ఆయన కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకొన్నారు. మొత్తానికి రాహుల్ బానే ముందు జాగ్రత్త తీసుకున్నారు.

పార్టీ మారే నేతలు తెలియక జగన్ తికమక..!

వైసీపీ పార్టీ నుండి కర్నూలు జిల్లాకు చెందిన 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారతున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అధినేత జగన్ పార్టీ మారే యోచనలో ఉన్న నాయకులు ఎవరా అని ఆరా తీసుకునే పనిలో పడ్డారంట. అయితే ఎవరిని అడినా తాము పార్టీ మారడం లేదు అని చెబుతున్నారే తప్ప ఎవరూ కూడా పార్టీ మార్పుపై ఎలాంటి విషయం చెప్పడంలేదట. దీంతో జగన్ కు ఎవరు పార్టీ మారుతున్నారో తెలియక తికమకపడుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఏం చేయాలో తెలియక సొంత పార్టీ నేతలపైనే నిఘా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందట. ఇదిలా ఉండగా  జగన్ పార్టీకి చెందిన ఐదురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని… వారి రాకను వ్యతిరేకించవద్దని కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పర్యటనలో జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పడంతో అసలు కథ మొదలైంది. మరి చంద్రబాబు నిజంగానే అన్నారా.. లేక ఏదన్న రాజకీయ గేమ్ ప్లే చేశారా అన్నది ఇప్పుడు అందరి సందేహం.

పవన్ పై కవిత ఫైర్.. పవన్ కళ్యాణ్ కు ఎప్పుడో చుక్కలు చూపించారు..

నిజామాబాద్ ఎంపీ కవిత మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఫిలిం స్టార్ల ప్రచారం జనానికి ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే అని.. టీడీపీ-బీజేపీ వాళ్లు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తారంట.. పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని.. ఎన్నికలప్పుడు మేకప్ వేసుకుంటారు.. తరువాత పేకప్ చెబుతారని విమర్శించారు. ఆంధ్రావాళ్ల కోసం పవన్ కళ్యాణ్ తో పోటీ చేయిస్తామంటున్నారు.. మేకప్ వేసుకొని వచ్చి ప్రచారం చేసే వాళ్లని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అంతేకాదు తాము ఫుల్ టైమ్ పొలిటీషియమ్స్ అని.. వాళ్లు పార్ట్ టైమ్ పొలిటీషియమ్స్ అని ఎద్దేవ చేశారు.

మల్లాది విష్ణు అరెస్ట్ తో కాంగ్రెస్ లో విబేధాలు..?

కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణువు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో విజయవాడ కాంగ్రెస్ వర్గాల మధ్య విభేధాలు తలెత్తున్నట్టు కనిపిస్తుంది. మల్లాది విష్ణువును అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని అనుచరులు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ, సి. రామచంద్రయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో బలమైన నేతగా ఎదుగుతున్న మల్లాది విష్ణుపై కుట్రపూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారని రఘువీరా, కేవీపీని విష్ణు వర్గీయులు నిలదీశారు. దీంతో రఘువీరా అనుచరలకు.. మల్లాది అనుచరులకు మధ్య వివాదాలు తలెత్తాయి. పార్టీ సీనియర్లను మల్లాది విష్ణు వర్గీయులు రత్నభవన్‌లోనే బంధించారు. ఇదిలా ఉండగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడ సబ్‌జైలులో విష్ణును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణును వేధిస్తున్నారని..పార్టీ తరపున ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో..

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్‌మోహన్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఎస్సై జగన్‌మోహన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. పెద్దపల్లిలోని పోలీస్ క్యార్టర్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొన్న ఎస్సై జగన్‌మోహన్.. తాను చనిపోవడానికి గంట ముందు సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. సూసైడ్ నోట్ లో నా చావుకు ఎవరూ కారణం కాదని.. తన సోదరుడు కిరణ్ ఏసీబీ కేసు క్లియర్ చేయాలని కోరారు. అంతేకాదు తన భార్య జ్యోతిని క్షమించమని.. తన తల్లిని మంచిగా చూసుకోమని కూడా కోరినట్టు తెలుస్తోంది. ఇంకా సుల్తానా బాగ్ సీఐ, ఎస్సైలు నాకు మంచి స్నేహితులు..  సీఐ ప్రశాంత్ పై నేను ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. పెద్దపల్లి ప్రజలు, ఎమ్మెల్యే, ఎస్పీ నన్ను క్షమించాలి.. మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించొద్దని కోరాడు. కాగా కరీంనగర్ మండలం చర్లభూత్కూర్‌కు చెందిన జగన్‌మోహన్ 2007లో పోలీసుశాఖలో ఎస్సైగా చేరాడు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, నర్సాపూర్(జీ) ఎస్సైగా పని చేసిన తర్వాత కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎస్సైగా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పనిచేశాడు. 2015 జనవరి 14న పెద్దపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోటు స్వాదీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.