కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. పన్నులే ఆదాయం.. చంద్రబాబు
posted on Jan 4, 2016 @ 2:29PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ఏర్పాటుచేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేస్తామని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదేనని..భవిష్యత్తులో కరెంటు కోతలుండవని, వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు రూ. 24 వేల కోట్లతో రైతుల రుణమాఫీ చేశాం.. డ్వాక్రా మహిళలకు రూ 10 వేల చొప్పున రుణాలిచ్చామని తెలిపారు. విభజన తరువాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. రాజధాని లేదు.. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయినా కానీ..అనేక సమస్యలు ఉన్నాయి.. అందుకే విజయవాడ నుండి పాలన చేస్తున్నామన్నారు. సరైన ఆదాయ వనరులు, నిధులులేని ఏపీకి ప్రజలు కట్టే పన్నులే ఆదాయమని, అటువంటిది పన్నులు చెల్లించడంలో అలక్ష్యం వహిస్తే ఎలాగని.. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ప్రజలు పన్ను కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.