ప్రణబ్‌కి ఒబామా గ్రీటింగ్ కార్డు

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్ కార్డు పంపించారు. ఈ గ్రీటింగ్ కార్డులో ప్రణబ్ ముఖర్జీకి ఒబామా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. హాలిడే సీజన్ సంతోషంగా గడపాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రీటింగ్ కార్డులో ఒబామాతోపాటు ఆయన భార్య మిషెల్ ఒబామా, కూతుళ్ళు మలియా, సాషాల సంతకాలు వున్నాయి. అలాగే వారి కుటుంబంలో భాగమైన పెంపుడు కుక్కలు బో, సన్నీల పాదముద్రలు కూడా వేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఒబామా కుటుంబం పంపుతున్న గ్రీటింగ్ కార్డులలో ఈ రెండు కుక్కల పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి.

క్షమాపణలా? నేను చెప్పనంతే!

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం డీడీసీఏ అవకతవకలపై జరిపిన విచారణలో జైట్లీ పేరు లేకపోవడం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ దాదాపు బిచ్చం ఎత్తుకుంటున్న స్థాయిలో దేబిరిస్తేందని, అది జరగని పని అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా వున్న సమయంలో డీడీసీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఆరోపించింది. దానిమీద దర్యాప్తు కమిషన్ కూడా వేసింది. కేజ్రీవాల్ ఈ విషయమై జైట్లీ మీద విమర్శలు గుప్పించడంతో జైట్లీ ఆయన మీద పరువునష్టం దావా వేశారు. అవకతవకల విషయం మీద ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేయించిన అనంతరం వచ్చిన నివేదికల్లో ఎక్కడా అరుణ్ జైట్లీ పేరు లేదు. దాంతో కేజ్రీవాల్ తనకు క్షమాపణ చెప్పాలని జైట్లీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పర్మిషనిస్తాం... కుమ్మించుకోండి....

  దేశంలోని పలు ప్రాంతంలో పశువులతో నిర్వహించే జల్లికట్టు లాంటి సంప్రదాయ క్రీడలకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. క్రూరంగా, జంతువులకు హానికరంగా ఉండనంత వరకు సంప్రదాయం నిర్వహించే క్రీడలను తాము గౌరవిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. తమిళనాడులోని జల్లికట్టు, మహారాష్ట్రలోని ఎడ్లపందేలు, కర్ణాటకలో నిర్వహించే కంబల, పంజాబ్‌లో జరిపే ఎడ్లపందేలు కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయని, వాటిని తామూ గౌరవిస్తామని ఆయన అన్నారు. అయితే జంతువుల పట్ల ఎలాంటి క్రూరత్వం వుండకూడదని ఆయన స్పష్టంచేశారు. రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి ఈ విషయంలో ఆదేశాలు వచ్చే అవకాశం వుందని జవదేకర్ తెలిపారు.

మహా ఇల్లాలు... గొప్ప కూతురు...

  ఓ మహా ఇల్లాలు.. ఓ గొప్ప కూతురి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే గుండె అరచేతిలో పెట్టుకుని చదవండి. వారణాసిలో రాజేష్ సింగ్ అనే వ్యక్తికి అపర్ణ అనే భార్య, దివ్యాన్షి అనే కూతురు వున్నారు. ఈ తల్లీకూతుళ్ళు దుబారా ఖర్చు చేస్తున్నారన్న ఉద్దేశంతో రాజేష్ సింగ్ వాళ్ళకి డబ్బు అందుబాటులో లేకుండా చేశాడు. చేతిలో డబ్బులు ఆడకపోతూ వుండటంతో ఆ తల్లీకూతుళ్ళకి పిచ్చెక్కినంత పనైంది. తమకు బోలెడంత ఆస్తి వుంది.. కానీ తమ చేతిలో పైసా కూడా పడటం లేదు. ఆస్తి మొత్తం రాజేష్ సింగ్ అదుపులోనే వుంది. మరి ఆ ఆస్తి మొత్తం తమ సొంతం కావాలంటే ఒక్కటే మార్గం వుంది. మనసు రాయి చేసుకుని ఆయన్ని చంపేయడం ఒక్కటే మార్గమని ఆ తల్లీకూతుళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ఆ ఇల్లాలు తీవ్రంగా ఆలోచించింది. కూతురు దివ్యాన్షీ ప్రియుడు హర్షవర్ధన్‌ని, అతని స్నేహితుడు మహేంద్రను రంగంలోకి దించింది. వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ప్లాన్ చేసి డిసెంబర్ 17న రాజేష్ సింగ్‌ని మర్డర్ చేశారు. ఆ తర్వాత తల్లీకూతుళ్ళు దేవుడులాంటి మనిషిని ఎవరో గిట్టనివాళ్ళు పొట్టన పెట్టుకున్నారంటూ ఆస్కార్ లెవల్లో నటించేశారు. మన పోలీసులు తక్కువోళ్ళేమీ కాదు కదా... వాళ్ళకి తమదైన శైలిలో సత్కారం చేసి అసలు విషయాన్ని రాబట్టి ఆ ఇద్దర్నీ, మర్డర్ చేసిన ఇద్దర్నీ అరెస్టు చేసి జైల్లో వేశారు.

గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది..!!

  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం కాబోతుంది. మరో మూడు రోజులలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. జి.హెచ్.ఎమ్.సి. కమిషనర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.ఎన్నికల సందర్బంగా సుమారు ఎనభై వేల మంది పోలీసులను ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల తుది జాబితాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గ్రామాలలో ఓటింగ్ శాతం పెరుగుతున్నా, నగరాలలో పెరగడం లేదని,ఈ పరిస్థితి మారాలని ,అందరూ ఒటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని నాగిరెడ్డి అన్నారు.హైకోర్టు సూచన మేరకు గడువు లోపే ఎన్నికలు పూర్తి అవుతాయని అన్నారు.

దానం నాగేందర్ పై పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి

  ఈరోజు కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ నేడు ఉప్పల్ లో పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేయడానికి తన అనుచరులతో కలిసి వచ్చేరు. కానీ ఉప్పల్ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది కనుక అక్కడ అప్పటికే జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ తన అనుచరులతో వచ్చి పార్టీ జెండా ఎగురవేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా కొద్ది సేపటికే దానం నాగేందర్ అక్కడికి చేరుకొన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ గౌడ్ అనుచరులు, నగర అధ్యక్షుడయిన దానం నాగేందర్ తమ జిల్లా పరిధిలోకి ప్రవేశించి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని కనుక తక్షణమే వెనక్కి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. ఆ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ‘దానం నాగేందర్ గో బ్యాక్’ అంటూ మల్లేష్ గౌడ్ అనుచరులు నినాదాలు చేసారు. అయినా దానం నాగేందర్వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా మల్లేష్ గౌడ్ ఎగురవేసిన పార్టీ జెండాను క్రిందకు దింపి మళ్ళీ తను ఎగురవేశారు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన మల్లేష్ గౌడ్ అనుచరులు దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇరు వర్గాల ఘర్షణతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది. నగర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పార్టీని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే విషయం గురించి ఆలోచించకుండా, తన పరిధిని అతిక్రమించి జిల్లాలో ప్రవేశించి ఇటువంటి అనవసరమయిన వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని మల్లేష్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు.

అప్పుడే ఎక్కువ ఆశించడం సరికాదు: పాక్

  భారత ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటన తరువాత ఇరు దేశాల మధ్య మళ్ళీ సానుకూలవాతావరణం ఏర్పడింది. జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో ఇరుదేశాల విదేశాంగ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిపేందుకు వారు అంగీకరించారు. మారిన ఈ పరిస్థితులను చూసి ఇరుదేశాల ప్రజలలలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. భారత్-పాక్ మధ్య నెలకొన్న సమస్యలన్నీ వెంటనే కాకపోయినా ఒకటొకటిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. కానీ అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరికాదని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తాజ్ అజీజ్ అన్నారు.   ఆయన ‘రేడియో పాకిస్తాన్’తో మాట్లాడుతూ “విదేశాంగ ప్రధాన కార్యదర్శుల మొదటి సమావేశంతోనే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరి కాదు. మొదట రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి సరిహద్దుల వద్ద ప్రశాంతత నెలకొనేలా చేయడం ద్వారా ఇరుదేశాలలో సరిహద్దు గ్రామాలలో నివసించేప్రజలకు ప్రశాంతత సమకూర్చాలని భావిస్తున్నాము,” అని తెలిపారు. అంటే జనవరిలో జరుగబోయే విదేశాంగ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ‘సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ’ ప్రధాన అజెండాగా ఉండబోతోందని భావించవచ్చును.

కొత్త భవనంలో పార్లమెంట్

  కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతిని ఇచ్చారు. భారత దేశానికి అధునాతన సాంకేతిక సదుపాయాలతో కొత్త పార్లమెంటు భవనం అవసరం వుందని సూచిస్తూ స్పీకర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడికి ఒక లేఖరాశారు. 88 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రస్తుత పార్లమెంట్ భవనం ప్రస్తుత అవసరాలను తీర్చలేకపోతోందని, అలాగే ఇప్పుడున్న భవనం పురాతనం కావడం వల్ల ఏవైనా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం వుందన్న భయాలు సభ్యుల్లో వున్నాయని ఆమె పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం అవసరం అనడానికి తగ పలు కారణాలను స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు. 2026 తర్వాత లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం వుందని, అప్పుడు ఇప్పుడున్న పార్లమెంట్ భవనం సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎక్కడ నిర్మిస్తే బావుంటుందో కూడా ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

చండీయాగం సంపూర్ణం

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వైభవంగా నిర్వహించిన అయుత మహా చండీయాగం ఆదివారం సాయంత్రం ముగిసింది. మఠాధిపతులు, మాన్యులు, సామాన్య ప్రజానీకం సమక్షంలో కేసీఆర్ తలపెట్టిన యాగం ఐదు రోజులపాటు వైభవంగా జరిగింది. రెండు వేల మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. యాగంలో చివరి క్రతువైన పూర్ణాహుతితో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు యాగం పరిపూర్ణమైంది. యాగం జరిగిన ఐదు రోజులూ ఎర్రవల్లి పరిసరాలు వేదఘోషతో ప్రతిధ్వనించాయి. యాగం చూసేందుకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరూ సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. ఈ యాగాన్ని తిలకించేందుకు అనేకమంది ప్రముఖులూ తరలి రావడం విశేషం.

కేసీఆర్ చండీయాగంలో పాల్గొన్న చంద్రబాబు

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తు్న్న ఆయుత మహా చండీయాగం ఐదోరోజు కొనసాగుతోంది. ఈ యాగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. విజయవాడ నుంచి చంద్రబాబు కనకదుర్గమ్మ అమ్మవారి చీర, కుంకుమ, ప్రసాదం తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు తదితరులు చంద్రబాబుతో కలసి చండీయాగానికి వచ్చారు. యాగశాల వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.  

గుర్రమెక్కిన లాలూ పెద్ద కొడుకు!

  లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ గుర్రం ఎక్కాడు. అవును నిజంగా గుర్రమే. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి నితీష్ కుమార్ ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, మరియు అడవులు పర్యావరణ శాఖామంత్రి అయిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నాలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి అందరూ గుర్రాలు ఉపయోగించాలని పిలుపు నిచ్చేందుకు స్వయంగా గుర్రం ఎక్కి రోడ్ల మీద షికారు చేసాడు. కాలుష్య నివారణ కోసం మంత్రిగారే గుర్రం ఎక్కినప్పుడు అతని భద్రతాధికారులు పోలీస్ వాహనాలలో ఆయన వెంట సాగలేరు కనుక వారు కూడా గుర్రాలు ఎక్కారు. ముందు వెనుక రెండు డజన్ల గుర్రాల మీద భద్రతాధికారులు అనుసరిస్తుంటే, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కిరీటం లేని రాజుగారిలాగ ముందుకు కదిలారు. ఆ సంగతి తెలుసుకొన్న మీడియా గుర్రాలు లేకపోయినా ఆయన వెంట పరుగులు తీస్తూ చకచకా ఫోటోలు తీసుకొంది.   కాలుష్యం నివారించదానికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరినీ సైకిల్స్ వాడమని సూచిస్తుంటే, ఆరోగ్య మంత్రిగారు మాత్రం గుర్రాలు వాడమని సూచిస్తున్నారు. అందుకు జనాలు ఒప్పుకొంటే గుర్రాలు కొనుకోవడానికి బ్యాంకుల నుండి రుణాలు కూడా ఇప్పిస్తారేమో?ఆ తరువాత వాటిని మేపడానికి గడ్డి అవసరం ఉంటుంది కనుక దాని కోసం తమ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ని సంప్రదించమంటారేమో?

భారీ మనిషి కన్నుమూత

  ప్రపంచంలోనే అతి పెద్ద భారీ శరీరం వున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మోరినో (38) శుక్రవారం మెక్సికోలో మరణించాడు. గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 450 కిలోల బరువుండే ఆండ్రెస్ రెండు నెలల క్రితం బరువు తగ్గడానికి శస్త్ర చికిత్స చేయించున్నాడు. త్వరలో తాను మూడు వందల కిలోల బరువు తగ్గి 150 కిలోలకు చేరుకుంటానని అందరికీ చెప్పేవాడు. అయితే ఈలోపే మరణించాడు. మొదటి ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం మామూలుగానే వుందని, అయితే క్రిస్మస్ రోజున అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.