వేధింపులు తాళలేక.. దేశాన్నే విడిచి వెళ్లిపోయింది..

ఆడవాళ్లకు ఎక్కడున్నా లైంగిక వేధింపులు ఉంటాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అవి మాత్రం కామన్ అయిపోయాయి. మన దేశంలోనే కాదు ఎక్కడికి వెళ్లినా ఆడవాళ్లపై అరాచకాలు మాత్రం ఆగవు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ లైంగిక వేధింపులు తాళలేక దేశమే విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. షీనా షిరాని అనే ఆమె ఇరాక్ దేశంలోని ప్రెస్ టీవీ అనే ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేసేది. అయితే ఆ ఛానల్ డైరెక్టర్, తన బాస్ హమీద్ రజా ఇమాదీ ఆమెను లైంగికంగా వేధించేవారు అంటూ.. తనకు పంపిన మెసేజ్ లు, వాయిస్ మెయిల్స్ ను, ఫోన్ రికార్డింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాదు పలు సంస్థలు, ప్రజలు ఆమెకు మద్దతు పలుకుతుండటమే కాకుండా.. టీవీ ఛానల్ సదరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసింది.

చిందేశాడు.. సస్పెండ్ అయ్యాడు..

సినిమా హీరో డ్యాన్స్ చేసినా ఇంత రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియదు కానీ.. ఈయన డ్యాన్స్ కు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే.. హీరో డ్యాన్స్ చేస్తే విజిల్స్ వస్తాయి..కానీ ఇక్కడ అతను డ్యాన్స్ చేసినందుకు ఉద్యోగం పోయింది. ఇంతకీ ఆ అతను ఎవరనుకుంటున్నారా..వివరాలు.. ఆనందంతో చిందేసి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ఓ జైలర్. తమిళనాడులోని సేలం జిల్లా.. అత్తూరులో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్ శంకర్ రిపబ్లిక్ డే రోజు పరేడ్స్ లో పాల్గొన్న ఆయన తన సహోద్యోగి రూంలో డ్యాన్సే చేశాడు. తాను డ్యాన్స్ చేస్తూ పక్క వారిని కూడా సంతోషపరిచాడు. అంతా బానే ఉన్నా.. ఈలోపు అతను చేసిన డ్యాన్స్ ను వీడియో తీసిన వారు దానికి సోషల్ మీడియాలో పాస్టే చేశారు. అంతే అది అలా అలా పాకి ఆఖరికి ఉన్నతాధికారుల వకరూ వెళ్లింది. దీంతో ఆయనను కోయంబత్తూరుకు బదిలీ చేసి విచారణ జరిపి సస్పెండ్ చేశారు.

ఆయన్ని కూడా వదలవా వర్మా..?

వివాదాస్పద వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఎవరిమీదైనా సరే నిర్మొహమాటంగా..తనకి ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాడు. అయితే ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలోనే విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ను కూడా వదల్లేదు. ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నారు. ఈయన వ్యవహార శైలిపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. అమెరికా చరిత్రలోనే ఇంత కలర్‌ఫుల్ అధ్యక్ష అభ్యర్థి, బహిరంగంగా మాట్లాడే వ్యక్తి మరొకరు ఉన్నారని తాను అనుకోవడం లేదని.. బాల్ థాకరే, కేసీఆర్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు ముగ్గురు ఒకే వ్యక్తిగా మారితే.. అతనే డొనాల్డ్ ట్రంప్ అని, డొనాల్డ్ అమెరికా అధ్యక్షుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ వర్మ ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్టు చేశారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ అమెరికా వాళ్లను కూడా వదలట్లేదు.

షేర్‌ ఆటోలో కిడ్నాప్‌!

బహుశా ఇలాంటి కథని మన సినిమావాళ్లు కూడా ఊహించి ఉండరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక కిడ్నాప్‌ ఉదంతం, ప్రమాదం ఎన్ని రకాలుగా పొంచి ఉంటుందో వెల్లడిస్తోంది. గత బుధవారం స్నాప్‌డీల్‌ సంస్థకు చెందిన దీప్తి శర్మ ఘజియాబాద్‌ లోని తన కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరారు. ఒక లోకల్‌ మెట్రో స్టేషన్‌లో దిగిన దీప్తి తన ఇంటికి వెళ్లేందుకు ఎప్పటిలాగే షేర్‌ ఆటోను ఎక్కారు. ఆ ఆటోలో దీప్తితో పాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఎంతసేపు గడిచినా ఆటో దీప్తి ఇంటివైపు కాకుండా ఎటెటో తిరగడం మొదలుపెట్టింది. విషయం ఏమిటని అడగబోయిన దీప్తి బ్యాగ్‌ని, మొబైల్‌ ఫోన్‌ని దుండగులు లాగేసుకున్నారు. ఆ సమయంలో దీప్తి తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండటంతో, ఆమె అరుపులు కాస్తా స్నేహితురాలికి వినిపించాయి. మరోవైపు దీప్తితో ఉన్న మరో ప్రయాణికురాలిని కత్తి చూపించి దింపేశారు దుండగులు. ఆటోలో డ్రైవరుతో సహా ఉన్న మిగతా ముగ్గురూ దీప్తిని కిడ్నాప్ చేసేందుకు సిద్ధపడిపోయారు. కానీ దీప్తి ప్రమాదంలో ఉందని తెలియడంతో ఆ రాత్రి బందోబస్తుని కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ తనిఖీలను నిర్వహించడం మొదలుపెట్టారు. ఘజియాబాద్ పట్టణంలోనే కాకుండా జిల్లాలోని పోలీసు యంత్రాంగం అంతా అలర్ట్‌ అయిపోయింది. జిల్లాలో ఎంతదూరం ప్రయాణించినా తమ కోసమే ఎదురుచూస్తున్న పోలీసులు కనిపించడంతో కిడ్నాపర్లకు ఏం చేయాలో తోచలేదు. రెండు రోజుల పాటు ఎక్కడికి వెళ్లినా కూడా పోలీసులే కనిపిస్తున్నారు. దాంతో ఇక లాభం లేదనుకుంటూ ఆమెను వదిలిపెట్టేసి పరారయ్యారు. పనిలో పనిగా ఆమె తిరిగి తన ఇంటిని చేరుకునేందుకు టికెట్‌ కోసం కాసిని డబ్బులు కూడా చేతిలో పెట్టారు. ప్రస్తుతం ఇల్లు చేరుకున్న దీప్తి గురించి మరింత సమాచారం రావలసి ఉంది. అసలు ఆమె చెప్పిన సమాచారం నిజమైనదా కాదా అని కూడా రూఢి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

చంద్రబాబు అస్తమించే సూర్యుడు..

వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారిన చంద్రబాబు మోసం చేశారని ఆమె అన్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.. ఇక ఆపార్టీకి మిగిలేది ఇద్దరు మాత్రమే అని ఎద్దేవ చేశారు. మా పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదు.. టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోంది..భయపెట్టి పార్టీల్కోకి లాక్కోవాలని చూస్తున్నారు..అయినా కూడా ఎవరూ చంద్రబాబు దగ్గరకు వెళ్లడం లేదని అన్నారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడు అని విమర్శించారు.

తమిళనాడులో బయటపడుతున్న ఉల్కాశకలాలు

గత వారం తమిళనాడులోని వెల్లూరులోని ఒక కళాశాల మీద ఉల్క పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక బస్సు డ్రైవరు కూడా మరణించడం సంచలనం సృష్టించింది. ఉల్కాపాతం వల్ల మనుషుల చనిపోయిన సంఘటనలు ఆధునిక చరిత్రలో చాలా అరుదు. అందుకని తమిళనాట ఉన్న శాస్త్రవేత్తలంతా ఇప్పడు వెల్లూరుకి చేరుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకుల తరువాత ఇప్పడు భూగర్భ శాస్త్రవేత్తలు కూడా వెల్లూరు కళాశాలని సందర్శించారు. ఈ సందర్భంగా నిన్న కళాశాలకి చేరుకున్న జియొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు, కళాశాల ఆవరణలో ఉన్న మరో రాయిని కూడా ఉల్కా శకలంగా గుర్తించారు. 60 గ్రాముల బరువున్న ఈ రాయి ఆయస్కాంత శక్తిని కలిగి ఉందనీ, ఇదేమీ సాధారణ రాయి కాదనీ ఆయన తేల్చారు. ఫిబ్రవరి 6న ఇక్కడ జరిగిన ఉల్కాపాతం వల్ల ఇలాంటి శకలాలు చుట్టుపక్కల చాలానే కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వీటిని వట్టి చేతులతో ముట్టుకోవడం అంత సురక్షితం కాదు కాబట్టి, ఏది రాయో ఏది అంతరిక్ష శకలమో తెలియక విద్యార్థులంతా తలలు పట్టుకుంటున్నారు.

నేషనల్ హెరాల్డ్..సోనియా, రాహుల్ కు ఊరట..

నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసు వ్యవహారంలో కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు వారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది. సోనియా, రాహుల్ తో పాటు మరో ఐదుగురికి కూడా సుప్రీం మినహాయించింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీకి 14రోజుల రిమాండ్..

హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సీతాపతి నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై విధివిధానాల రూపకల్పన.. అగ్రిగోల్డ్ ఎండీ, ఛైర్మన్ అరెస్ట్ పై ఈ కమిటీ చర్చించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఆస్తుల విలువ వివరాలను కోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావు, ఎండీ శేషునారాయణలను సీఐడీ అధికారులు ఏలూరు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈనేపథ్యంలో వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించి.. అనంతరం జైలుకు తరలించనున్నారు.

టీ టీడీపీ.. అనుకున్నదే జరిగింది..

తెలంగాణ టీడీపీకి అనుకున్నదే జరిగింది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అలా టీఆర్ఎస్ లోకి చేరారో లేదో.. మరో ఎమ్మెల్యే కూడా వారి దారిలోనే టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నిన్ననే టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అయితే ఇదేమి అంత షాకింగ్ న్యూసేం కాకపోవచ్చు. ఎందుకంటే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి చేరుతూనే తనతో పాటు ఇంకా కొంతమంది నేతలు వస్తారు అని ముందే హింట్ ఇవ్వడంతో అందరూ ఆతరువాత ఎవరు టీడీపీని విడతారా అని ఆసక్తిగా చూశారు. ఇక అందరి ఎదురుచూపులకు తెర దించుతూ రాజేందర్ రెడ్డి కారెక్కేశారు. కాగా ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీఆర్ఎస్ లోకి చేరారు. ఇంకా ఐదుమంది మాత్రమే ఉన్నారు. మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామంటూ.. టీడీఎల్పీని నేతగా మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు టీఆర్ఎస్ లో విలీనమవుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

మోడీతో కేసీఆర్ బేటీ...

సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భేటీ అయిన సందర్భాలు చాలా తక్కువ. రాష్ట్ర విభజన తరువాత అయితే కేసీఆర్ కేంద్రానికి కాస్త దూరంగా ఉన్నారనే చెప్పొచ్చు. ఇక ప్రధాని మోడీ కూడా కేసీఆర్ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ కోరినా ఆయనకు కలిసే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చాలా కాలం తరువాత కేసీఆర్ మోడీతో ఈరోజు భేటీ కానున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం సీఎం నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ర్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు తదితర అంశాల గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించాలని ఆహ్వానించడంతోపాటు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని కేసీఆర్ ఆహ్వానించనున్నారు.