ఈ చిరుతపులికి కోరలు లేవు కాబట్టి సరిపోయింది!
గత ఆదివారం బెంగళూరులోని ఒక పాఠశాలలోకి ప్రవేశించిన చిరుతపులి ఆ రోజంతా అధికారులకి చెమటలు పట్టించింది. తన దారికి ఎదురువచ్చిన అధికారుల మీదా, పర్యావరణవేత్తల మీదా చిరుతపులి తీవ్రంగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ చిరుతకు ఒక కన్ను సరిగా కనిపించడం లేదనీ, కోరలు కూడా సరిగా లేవనీ తేలింది. లేకపోతే, చిరుత దాడికి గురైన వారు మృత్యువాత పడక తప్పేది కాదు. బెంగళూరు శివార్లలో ఉన్న మరాఠహళ్లి అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బెంగళూరులో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు పర్యావరణవేత్తలని కలచివేస్తున్నాయి. కేవలం చిరుతలే కాదు… ఏనుగులు, దేవాంగపిల్లులు, జింకలు, అరుదైన పక్షులు తరచూ బెంగళూరు పట్టణంలో ప్రవేశిస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకో, పట్టుకునేందుకు పట్టణవాసులు చేస్తున్న ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతున్నాయి. బెంగళూరు పట్టణం నిదానంగా విస్తరిస్తూ, తన చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు మేధావులు. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న అద్రంగి, ఉజ్జని వంటి అటవీ ప్రాంతాల నుంచి అప్పుడప్పుడూ పొరపాటున పట్టణంలో ప్రవేశిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టణవాసులు మాత్రం ఎప్పటిలాగే అటవీ జంతువులు తమ నివాస ప్రాంతాలలోకి చొచ్చుకువస్తున్నాయని వాపోతున్నారు! ఇంతకీ ఎవరు ఎవరి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నట్లు?