వరంగల్ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తప్పదు... కేసీఆర్ కు మావోయిస్టు పార్టీ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తీవ్రంగా స్పందించిన మావోయిస్టు పార్టీ... టీఆర్ఎస్ నేతల హెచ్చరిస్తూ ఓ లేఖను మీడియాకి పంపింది. ఖమ్మం-కరీంనగర్, వరంగల్ జిల్లాల మావోయిస్టు కార్యదర్శి దామోదర్ పేరుతో విడుదల చేసిన లేఖలో...టీఆర్ఎస్ నేతలను వదలబోమని హెచ్చరించారు. మంచినీళ్ల కోసం వచ్చిన శ్రుతిని, విద్యాసాగర్ రెడ్డిని పోలీసులు పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్ కౌంటర్ చేశారని, దీనికి ప్రతీకారం తప్పదని గులాబీ నేతలకు వార్నింగ్ పంపారు. వరంగల్ జిల్లా మంత్రులను, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులను వదలబోమని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల సిద్ధాంతమే...టీఆర్ఎస్ అజెండా, అధికారంలోకి వస్తే నక్సల్స్ అజెండాను అమలు చేస్తామన్న కేసీఆర్, ఇప్పుడు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యం పనిచేస్తూ, బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నాడని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఖమ్మం-కరీంనగర్, వరంగల్ జిల్లాల మావోయిస్టు కార్యదర్శి దామోదర్ హెచ్చరించారు.