అమితాబ్ కు తప్పిన ప్రమాదం..

మేక్‌ ఇన్‌ ఇండియా వీక్‌' పేరుతో ముంబైలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు, సహాయక బృందాలు అప్రమత్తమవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెనుప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాగా ముంబైలోని నదీతీరంలో ఉన్న గిర్‌గౌమ్ చౌపాటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే, అమితాబ్‌బచ్చన్‌, అమీర్‌ఖాన్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు హాజరయ్యారు. కాగా ఈ ప్రమాదం జరగడానికి ముందే బిగ్ బీ, హేమమాలిని షోలు జరిగాయి.. వీరికి ప్రమాదం తప్పిందని అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియడం లేదని నిర్వాహకులు చెపుతున్నారు.  

అప్పు తీర్చలేదని కత్తితో దాడి..

హైదరాబాద్ నగరంలో వడ్డీవ్యాపారుల ఆగడాలు మరోసారి బయటపడ్డాయి. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలో వెలుగు చూసింది వివరాల ప్రకారం.. నాచారంలో కుమార్ గౌడ్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. అతని దగ్గర గిరి అనే వ్యక్తి రూ 30 లక్షల మేర అప్పు తీసుకున్నాడు. అయితే గిరి నెల నెలా వడ్డీ కడుతున్నప్పటికీ తీసుకున్న మొత్తం ఒకేసారి చెల్లించాలని.. అసలు వడ్డీతో కలిపి మొత్తం ఇప్పుడు కోటి రూపాయలు చెల్లించాలని కుమార్ గౌడ్.. గిరిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుమార్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గిరిపై దాడి చేశాడు. ఈ దాడిలో గిరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గిరిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు సమాచారం అందుకున్న నాచారం పోలీసులు కుమార్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

టి20 సీరీస్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా

  శ్రీలంకతో జరుగుతున్న టి20 సీరీస్ ను ఇండియా 2-1తో సొంతం చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మూడో టి 20లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ధోనీ శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ కేవలం 82 పరుగులకే చాప చుట్టేసింది. లంక బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు దాటగలిగారంటే, ఇండియా బౌలింగ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీలంక ఇన్నింగ్స్ లో శానక 19 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశ్విన్ బౌలింగ్ లో రాణించి 8 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. తొలిఓవర్లోనే అశ్విన్ రెండు వికెట్లు తీయడం విశేషం.. బ్యాటింగ్ లో ఇండియా పెద్దగా ఇబ్బంది పడలేదు. శ్రీలంక బౌలింగ్ లో ఒకటి రెండు సార్లు తప్ప పిచ్ నుంచి సహకారం లభించకపోవడంతో శ్రీలంక బౌలర్లందరూ విఫలమయ్యారు. శిఖర్ ధావన్ 46 ( నాటౌట్ 46 బంతుల్లో ), అజ్యింక రహానే 22( నాటౌట్ 24), రోహిత్ శర్మ 13(13 బంతుల్లో) రాణించారు. ఈ మ్యాచ్ లో టీం ఇండియా తురుపుముక్కగా మారిన అశ్విన్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

' CCL 2016 ' విన్నర్స్ తెలుగు వారియర్స్

  ఉప్పల్ లో కర్నాటక బుల్ డోజర్స్ తో జరుగుతున్న సిసిఎల్ ఫైనల్ మ్యాచ్ లో తెలుగువారియర్స్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టి రెండో సారి సిసిఎల్ ట్రోఫీని దక్కించుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటక బుల్ డోజర్స్ 20 ఓవర్లలో 208 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని తెలుగువారియర్స్ ముందు పెట్టింది. ఏమాత్రం బెదురు లేకుండా మొదలైన తెలుగువారియర్స్ ఇన్నింగ్స్ లో సచిన్ జోషి సెంచరీతో కదం తొక్కాడు.  49 బంతుల్లోనే 114 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.   మొదటి వికెట్ కు ప్రిన్స్ తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదే తెలుగువారియర్స్ విజయానికి బాటలు పరిచింది. సచిన్ అవుటైన తర్వాత తెలుగువారియర్స్ జోరు కొనసాగింది. వన్ డౌన్ లో వచ్చిన అఖిల్ రెండు భారీ సిక్సర్లతో విజయానికి మరింత చేరువ చేశాడు. కర్నాటక బౌలర్స్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో, తెలుగువారియర్స్ మరో 14 బంతులు మిగిలుండగానే 9 వికెట్ల తేడాతో గెలిచింది..వెంకటేష్, నాగార్జున బంతి బంతికీ ఎంకరేజ్ మెంట్ ఇవ్వడం విశేషం..ప్రిన్స్ 43 బంతుల్లో 61 పరుగులతో, అఖిల్ 14 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా నిలిచారు..

టీం ఇండియా ఏం చేయబోతోంది..?

  శ్రీలంకతో జరుగుతున్న టి20 సీరీస్ లో మొదటి మ్యాచ్ ఘోరంగా ఓడిన టీం ఇండియా, రెండో మ్యాచ్ లో ఘనంగా గెలిచి లెక్క సరిచేసింది. మూడు మ్యాచ్ ల సీరీస్ లో రెండు దేశాలు చెరొకటి గెలవడంతో, వైజాగ్ లో జరగబోయే మూడో టి20 ఆసక్తికరంగా మారింది. మొదటి మ్యాచ్ ఓడిన తర్వాత, నెంబర్ వన్ ర్యాంక్ నుంచి మూడో ర్యాంకు కు పడిపోయింది టీంఇండియా. ఇప్పుడు మూడో మ్యాచ్ గనుక నెగ్గితే, తిరిగి నెంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంటుంది. ప్రయోగాలకు దూరం అని చెబుతూనే, రాంచీ మ్యాచ్ లో బుమ్రాను డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించి సక్సెస్ అయ్యాడు ధోనీ. మరి ఈసారి యువీని కాస్త ముందుగా పంపి మరో ప్రయోగం చేస్తాడా..? హార్ధిక్ ను హార్డ్ హిట్టర్ గా ఉపయోగించుకోబోతున్నాడా..? ఇవీ ఇప్పుడు అభిమానులకున్న ప్రశ్నలు. వైజాగ్ పూర్తి బ్యాటింగ్ వికెట్. భారీ స్కోర్లు నమోదు కావడానికి ఆస్కారం ఉంది. దీంతో బ్యాటింగ్ బలంగా ఉండే టీం ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. బౌలర్స్ తో పాటు బ్యాట్స్ మెన్ కూడా బాగానే రాణిస్తున్నా, టీం గా కలిసి ఆడటంలో శ్రీలంక విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో మూడో టి20 లో భారత్ ను లంకేయులు ఎలా అడ్డుకుంటారన్నది అందరూ ఎదురుచూస్తున్న అంశం.

టీడీపీ నాయకుల మధ్య విబేధాలు..

ఇప్పటికే తెలంగాణ టీడీపీ కష్టాల్లో ఉండే.. ఇక్కడ ఏపీలో కూడా టీడీపీ నాయకుల మధ్య విభేధాలతో తలనొప్పులు తయారవుతున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై మంత్రి పుల్లరావు వ్యాఖ్యలు సరికావని, పుల్లారావుతో సహా మంత్రులు ఎవరైనా అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని.. మంత్రి పుల్లారావు తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితే మంచిదని సూచించారు. సున్నితమైన అంశాన్ని మాటల ద్వారా జటిలం చేయడం సరికాదని హితవు పలికారు. మరి డొక్కా మాటలకు పుల్లారావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ముగిసిన ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్.. కానిస్టేబుల్ మృతి..

నారాయణ ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇప్పటికి 75 శాతం పోలింగ్ నమోదు అయినట్టు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు తెలుపుతున్నారు. 286 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.. ఈ నెల 16 న కౌంటింగ్ ను నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న వీరాసింగ్ అనే కానిస్టేబుల్ హఠాన్మరణం పొందాడు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో వీరాసింగ్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. కానిస్టేబుల్ మృతితో తోటి పోలీసులు, ఎన్నికల సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మరోసారి..

రాజకీయమంటేనే ఆట. ఎప్పుడు ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటుందో.. ఎప్పుడు విడిపోతుందో తెలియదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తుంది. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మరోసారి జత కలవనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పార్టీలకు ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండగా.. 2013లో తెగతెంపులు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు డీఎంకే, మరోసారి కాంగ్రెస్‌తో జతకట్టేందుకు యత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే కరుణానిధితో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ సమావేశమై శాసనసభ ఎన్నికలపై చర్చించారు.

ఎర్రబెల్లి లేఖ.. మొదటిసారేం కాదు.. ఏం జరుగుతుందో..?

తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 10 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ తమ పది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. అయితే అది జరగదని.. విలీనం సాధ్యం కాదని.. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విలీనం ప్రక్రియ అనేది కొత్తేమి కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో రెండు సార్లు కూడా ఇలానే జరిగింది అని అంటున్నారు. మొదటి సారి బిఎస్‌పికి చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టిఆర్‌ఎస్‌లోవిలీనం చేస్తున్నట్టు తీర్మానం చేసి స్పీకర్‌కు అందించారు... ఆ తరవాత శాసన మండలిలో టిడిపి సభ్యులు విలీనం అయ్యారు. ఇప్పుడు ఇది ముచ్చటగా మూడోసారి. అంతేకాదు శాసనసభకు..శాసన మండలికి నిబంధనల విషయంలో పెద్ద తేడా ఉండదు కాబట్టి వీరు కూడా విలీనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో స్పీకర్ మధుసూదనా చారి న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

నెల్సన్ మండేలా మనవడిపై అత్యాచారం కేసు..

పండిత పుత్ర పరమ సుంట అన్న సామెత వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత నెల్సన్ మండేలా మనవడికి బాగా వర్తిస్తుంది. నెల్సన్ మండేలా జాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. అలాంటి వ్యక్తికి మనువడైన ఎంబుసో మండేలా (24) అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. వివరాల ప్రకారం.. ఎంబుసో మండేలా జొహాన్నెస్బర్గ్ శివారల్లలోని గ్రీన్సైడ్ రెస్టారెంటులో 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో ఎంబుసో మండేలాను పోలీసులు అరెస్టు చేశారు.  ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న అతడు బెయిల్ దరఖాస్తు పెట్టుకోగా దానిపై మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. కాగా నెల్సన్ మండేలాకు మొత్తం 17 మంది మనవలుండగా, వాళ్లలో ఒకడే ఈ ఎంబుసో.

వేశ్యలపై కాదు.. రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టాలి..

సీపీఐ నారాయణ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా కేసీఆర్ పార్టీపై అలాంటి వ్యాఖ్యలే చేశారు. గతకొద్ది రోజుల నుండి తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో వలసల పర్వం సాగుతోంది. తాజాగా టీడీపీ నేతలు కూడా వరుసపెట్టి టీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో దీనిపై నారాయణ స్పందిస్తూ కేసీఆర్ ను విమర్సించారు. అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్ష్ కింద వైఎస్. రాజశేఖర్ రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు టీడీపీ నేతలను ఎలా తమ పార్టీలోకి తీసుకుంటున్నారు అని అన్నారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టాలని నారాయణ డిమాండు చేశారు. రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టేంతవరకు వ్యభిచారం చేసే వేశ్యలపై కేసులు పెట్టకూడదని సిపిఐ నాయకుడు నారాయణ అన్నారు.

రెండేళ్లుగా గ్యాంగ్ రేప్..

ఆడవాళ్లపై అరాచకాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో ఉదంతం బయటకి వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. తనపై సామూహిక అత్యాచారం చేస్తూన్నారంటూ ఒక ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కి చెందిన ఓ మహిళా టీచర్.. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి, అతని సోదరులు, మరో వ్యక్తి కలిసి రెండేళ్లుగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారని తన తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె తల్లి దండ్రులు వారి దగ్గరకి వెళ్లి చూడగా ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా, విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతుండగా తాను కోల్కొంటే కానీ వాంగూల్మం తీసుకొని నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

మోడీకి మన్మోహన్ సలహా..

మాజీ ప్రధాని మన్మోహన్ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ సలహా ఇచ్చారంట. అందేంటంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు కలిగి ఉండమని. మన్మోహన్ సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కావాలంటే సోనియా, రాహుల్‌గాంధీలతో సత్సంబంధాలు నెరపడం అవసరమని.. కాంగ్రెస్‌ పార్టీలో వారిద్దరూ అతి ముఖ్యమైన నేతలని.. వారితో కేంద్ర ప్రభుత్వం సంబంధాలు ఏర్పరచుకోకపోతే, కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని భావించడం కష్టమని మోడీకి చెప్పినట్లు ఆయన అన్నారు.