ఇక కాంగ్రెస్ పార్టీకి ‘జై హింద్’ చెప్పక తప్పదు
posted on Aug 12, 2015 @ 3:33PM
రాజకీయ పార్టీ అన్నాక స్వంత బాకా ఊదుకోవడానికి దానికో న్యూస్ పేపర్, ఓ న్యూస్ ఛానల్ ఇప్పుడు తప్పనిసరయి పోయాయి. ఈ విషయాన్ని పార్టీ పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గ్రహించగలిగిది పార్టీ పెట్టిన 130 సం.లకి గానీ ఆ జ్ఞానోదయం కాని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మనం ఎక్కవలసిన రైలు ఇంచుమించు ఒకట్టిన్నర శతాబ్దాలు లేటు ఇకనయినా ఓ ఛానల్ పెట్టుకోకపోతే శేషజీవితమంతా ప్రతిపక్ష బెంచీలకే పరిమితమయిపోయి పార్లమెంటుని స్తంభిస్తూ తృప్తిపడవలసి వస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటోంది.
అయితే కాంగ్రెస్ అధిష్టానం మేల్కోవడానికి 130 సం.లు పట్టిందేమో కానీ కేరళ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా కాలం క్రితమే మేల్కొని ‘జై హింద్ టీవి’ అనే న్యూస్ ఛానల్ నడిపించుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఛానల్ ని జాతీయ ఛానల్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి ఏకె అంధోని తెలిపారు. అందుకోసం జై హింద్ టీవీకి జాతీయ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసారు. త్వరలోనే ఆ ఛానల్లో సోనియా, రాహుల్ భజన కార్యక్రమాలు, స్తోత్రాలు, రాహుల్ గాంధీ మేధోసంపత్తికి అద్దం పట్టే ఆయన ప్రసంగాలు వగైరా దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి.
ఈరోజుల్లో కేవలం సాంప్రదాయ ఓటు బ్యాంకుని నమ్ముకొంటే ఎవరూ ఓట్లు వేయడంలేదని మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం ఎంతవసరమో ప్రత్యర్ధ రాజకీయ పార్టీల విమర్శలను, దుష్ప్రచారాన్ని త్రిప్పి కొట్టడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతరాన్ని క్యాచ్ చేయడానికి టీవీ ఛానల్ చాలా అవసరమని అయన అన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి ‘జై హింద్’ చెప్పేయడానికి ఛానల్ వచ్చేస్తోందని అందరూ గమనించ ప్రార్ధన.