పొలిటికల్ హీట్ పెంచిన జగన్ వ్యాఖ్యలు..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల చేరికపై సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ ను పెంచారు. ఆమధ్య వైసీపీ నేతలు టీడీపీ చేరుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాజాగా ఒక వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబును కలిసిన నేపథ్యంలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిపై స్పందించిన జగన్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ చేరడానికి ఎలాంటి ఆసక్తి చూపించడంలేదు.. ఇంకా చెప్పాలంటే టీటీడీ ఎమ్మెల్యేలో మాతో టచ్ లో ఉన్నారు అంటూ టీడీపీకి షాకిచ్చారు. అంతేకాదు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయండంటూ చంద్రబాబు కు సవాల్ కూడా విసిరారు. ఇంకా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరతామని చెప్పారు.

ముదిరి పాకాన పడుతున్న జెఎన్‌యూ వివాదం..

జెఎన్‌యూ వివాదం రోజు రోజుకి ముదిరి పోతుంది. ఈసారి ఈ వ్యవహారంపై ఎబివిపీ విద్యాసంఘాలు స్పందించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డాయి. జెఎన్‌యూ క్యాంపస్ లో దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరమని.. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని.. కేంద్ర వ్యవహారం శైలి నచ్చక రాజీనామా చేసినట్టు ఏబీవీపి తెలిపింది. మరోవైపు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందో. అయితే ఇప్పుడు ఈ కోసును ఉపసంహరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జెఎన్‌యూ ప్రాంగణంలో కన్హయ్య కుమార్‌ దేశ వ్యతిరేక నినాదాలేమీ చేసినట్లు ఆధారాలు లేవని హోం మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అతడిపై కేసును ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి.

ప్రత్యేక హోదా రాలేదని ఆత్మహత్య..

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. కృష్ణాజిల్లా గుడివాడలోని ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సిరిపురపు తులసీరాణి కుమారుడు ఉదయభాను అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రత్యేక హోదా రాలేదన్న మనస్థాపంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పూనుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఉదయభాను అవివాహితుడు. అతను రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయభాను ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్మార్టం నిమిత్తం  మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టీవీ నటుడు ఆత్మహత్య.. సహనటి అరెస్ట్

ఒడిసాలో టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేగింది. అయితే ఇతని ఆత్మహత్యలో భాగంగా నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇద్దరి మధ్య వచ్చిన అర్ధిక విభేధాలే కారణని చెబుతున్నారు పోలీసులు. వివరాల ప్రకారం టీవీ నటులు జెస్పీ, చందన్ ఫిబ్రవరి 6న ఏర్పాటుచేసిన ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి చందన్ రాలేదు. అదే కార్యక్రమానికి రాజా రావడంతో చంద్రన్ ప్లేస్ లో అతనిని షోలో పాల్గొనాలని కోరగా అతని ఒప్పుకున్నాడు. అయితే పార్టీ నిర్వాహకులు షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించడంతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో జేస్సీ అతనిని అవహేళనగా మాట్లాడేసరికి తీవ్ర మనస్థాపానికి గురై రాజా ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో జెస్సీని పోలీసులు అరెస్ట్ చేశారు.

జాట్‌ రిజర్వేషన్..నాలుగో రోజుకి చేరిన ఉద్యమం

  హర్యానాలో తమకు రిజర్వేషన్లని కల్పించమంటూ జాట్ వర్గంవారు చేస్తున్న ఉద్యమం ఇవాల్టికి నాలుగోరోజుకి చేరుకుంది. రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలైన రోహ్‌తక్, సోన్‌పేట్ వంటి ప్రాంతాలలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఆందోళనకారుల రాష్ట్ర రహదారులని సైతం నిర్బంధించడంతో రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. రైళ్లు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హర్యానా ముఖ్యమంత్రి ‘మనోహర్‌లాల్ ఖట్టర్‌’ జాట్‌లను చర్చలకు ఆహ్వానించినప్పటికి కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉండటం విశేషం. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే జాట్‌ వర్గం వారు తమకి రిజర్వేషన్లని కల్పించమని ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఈ ఉద్యమాలు హింసాత్మకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి హర్యానాలో 47 శాతం వరకూ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం 50 శాతం వరకూ రిజర్వేషన్లను పొడిగించవచ్చు. కాబట్టి మిగిలిన 3 శాతం రిజర్వేషన్లను జాట్‌ వర్గానికి కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ జాట్ నేతలు మాత్రం కంటితుడుపు ప్రకటనలు కాకుండా స్పష్టమైన హామీలను ఇస్తేనే తాము ఉద్యమాన్ని విరమిస్తామని పట్టుదలతో ఉన్నారు.

మరో పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్.. ఏడ్చేశాడా..?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అసహంపై వ్యాఖ్యలు చేసి పలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి భారత ప్రభుత్వం తొలగించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మరో పథకానికి అమీర్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. భాజపా నేతృత్వంలో నడుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం అమీర్ ఖాన్ ను జల్ యుక్త షివర్ పథకానికి బ్రాండ్ నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రారంభోపన్యాసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అమీర్ ఖాన్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ వార్త విన్న అమీర్ ఖాన్ మాత్రం భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.  బ్రాండ్ అంబాసిడర్ గా నియమించగానే అమీర్ కళ్లు చమర్చినట్లు చెప్పుకుంటున్నారు.

తల్లిదండ్రుల ఎదుటే కొట్టి చంపారు..

కేరళలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇంట్లోనే కొట్టి చంపేశారు. వివరాల ప్రకారం.. 27 ఏళ్ల సుజిత్ కేరళ, కన్నూరు జిల్లా పాపినిసేరిలో ఉంటున్నాడు. అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అయితే గత కొద్ది రోజులుగా కేరళలో ఆర్ఎస్ఎస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సుజిత్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో చొరబడి.. తన తల్లిదండ్రులు ఎదుటే అతనిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అడ్డుకోబోయిన అతని తల్లి దండ్రులను కూడా గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన సుజిత్ ను ఆస్పత్రికి తరలించబోయే లోపులోనే మరణించాడు. సీపీఎం కార్యకర్తలే అతన్ని చంపినట్లు సుజిత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సీఎంకు రిస్ట్ వాచ్ తిప్పలు..

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తను ధరించే రిస్ట్  వాచ్ వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానిని వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అసలు సీఎం గారు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం విపపక్షాల పోరు తట్టుకోలేకేనట. గత కొన్ని రోజులుగా ఆయన రూ.70 లక్షల విలువ చేసే గడియారాన్ని ధరిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకుగాను ఆయనపై విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నారు. రూ.70 లక్షల విలువ చేసే వాచ్‌ను సీఎం సిద్ధరామయ్య తన ఆస్తుల్లో చూపకుండానే అఫిడవిట్‌ను దాఖలు చేశారంటూ.. పలు విమర్శలు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం తన రిస్ట్ వాచ్ ను వేలం వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

డీకే అరుణకు టీఆర్ఎస్ గాలం..?

ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పలువురు నేతలను అధికార పార్టీని తమ పార్టీలోకి తీసుకుంది. ఈనేపథ్యంలోనే దాదాపు తెలంగాణలోని టీడీపీ ఖాళీ అయిపోయినట్టే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ చూపు కాంగ్రెస్ పార్టీపై పడినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పాలమూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణకు గాలం వేసినట్టు సమాచారం. అంతేకాదు ఆమె కూడా త్వరలో టీఆర్ఎస్  లో చేరుతున్నట్టు అప్పుడే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే డీకే అరుణ మాత్రం ఆ వార్తలను ఖండించింది. తాను పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం జరుగుతోందనీ.. ఎట్టి పరిస్థితిల్లో తాను పార్టీ మారేది లేదని.. ఇది టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రభుత్వం కలలుగంటోందని, అది ఎన్నటికీ సాధ్యం కాదన్నారు.

విరాట్ కోహ్లీకి మళ్లీ కోపమొచ్చింది..

భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాస్త కోపం ఎక్కువని అది అందరికి తెలిసిందే. గతంలో కూడా ఆయన మీడియా పై ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మీడియాపై కోపడ్డాడు కోహ్లీ. అయితే అప్పటికి.. ఇప్పటికీ చిన్న తేడా ఏంటంటే.. అప్పుడు అనుష్క శర్మతో కలిసి ఉండేవాడు.. ఇప్పుడు లేడు.. అదే తేడా.. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన ప్రశ్న అడిగే సరికే కోహ్లీ కోపడ్డాడు. కోహ్లి - అనుష్క శర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లిని.. ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్‌లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారని ఓ విలేకరి ప్రశ్నించాడు.. దానికి విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందిస్తూ.. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తానని, ఇస్తేగిస్తే మా కుటుంబంలో ఎవరికైనా ఇస్తా లేకపోతే.. జట్టు సహచరులకు ఇస్తానని అన్నారు. అంతేకాదు ఎవరికిస్తే మీకెందుకని మండిపడ్డాడు. అక్కడితో ఆగకుండా.. అసలు జరిగే కార్యక్రమం గురించి అడగకుండా.. ఇలాంటి ప్రశ్నలు అడిగి ఎందుకు విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

28 ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ డిగ్రీ పట్టా..

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 28 ఏళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టాను పొందాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హన్స్‌రాజ్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ తన డిగ్రీ పట్టాను మాత్రం తీసుకోలేదు. అయితే షూటింగ్ లో భాగంగా తాజాగా ఢిల్లీ వెళ్లిన షారుఖ్ కాలేజ్ కు వెళ్లి తన డిగ్రీ పట్టాను తీసుకున్నారు. ఈ సందర్బంగా షారుఖ్ కు పట్టా అందజేసిన కాలేజ్ ఫ్రిన్సిపాల్ రమాశర్మ మాట్లాడుతూ.. షారుఖ్‌ఖాన్‌కు చాలా ఏళ్ల తర్వాత డిగ్రీని అందించడం చాలా సంతోషంగా ఉందని.. షారుఖ్ డిగ్రీని ఎన్నో ఏళ్లుగా తాము భద్రంగా ఉంచామని తెలిపారు. అంతేకాదు షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ తమ కాలేజీలో చదివినందుకు చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.

జర్నలిస్టులపై దాడికి నిరసనగా మార్చ్..

పాటియాలా హౌస్‌ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు జర్నలిస్టులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి గాను ఇప్పుడు జర్నలిస్టులపై న్యాయవాదులు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు మార్చ్ నిర్వహించారు. ఢిల్లీ ప్రెస్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ జాతీయ పత్రికలు, టీవీ చానళ్లకు చెందిన సీనియర్ ఎడిటర్లు, వందలసంఖ్యలో జర్నలిస్టులు ఈ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్ట్ లపై దాడి చేసిన న్యాయవాదుల లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బార్ కౌన్సిల్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించారు ఇదిలా ఉండగా దీనిపై మాట్లాడేందుకు గాను జర్నలిస్టుల బృందం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా వారు న్యాయస్థానం సాక్షిగా ఓ జర్నలిస్టులపై న్యాయవాదులు దాడికి పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని.. జర్నలిస్టులపై దాడిచేసినవారిపై తక్షణమే కేసులు నమోదు చేయాల్సిందిగా రాజ్‌నాథ్‌కు వినతిపత్రం అందించారు.

నా జోలికొస్తే అలానే ఉంటుంది..బీజేపీ ఎమ్మెల్యే

జెఎన్ యూ వ్యవహారంలో భాగంగా పాటియాలా హౌస్‌ కోర్టు ప్రాంగణంలో బీజేపీ ఢిల్లీ శాసనసభ్యుడు ఓపీ శర్మ వామపక్ష కార్యకర్తను కొట్టిన సంగతి తెలిసిందే.  జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్యాకుమార్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే తాను చేసిన దానిని సమర్ధించుకుంటున్నారు ఆ నేత. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తుంటే అభ్యంతరం తెలిపానని.. దానిని తనపై దాడి చేశారని..నా తలకు దెబ్బ కూడా తగిలిందని అన్నారు. వారు దాడి చేసినందుకే ఎదురుదాడికి దిగానని.. అంతేకాదు నన్ను కొడుతుంటే నేను తిరిగి కొట్టొద్దా..? అంటూ ఎదురు ప్రశ్నించారు. నన్ను ఎవరైనా కొడితే ప్రతిస్పందన అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.