గోమూత్రం గురించి సలహాలివ్వండి- మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి!

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఆవులంటే మహాప్రేమ. తన అధికారిక నివాసంలో కొన్ని ఆవులను పెంచడమే కాకుండా, త్వరలోనే ఒక గోశాలని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఆయన. అలాంటి శివరాజ్ సింగ్ ఈమధ్యనే ఒక రైతు సంఘంతో సమావేశం అయ్యారు. 'భారతీయ కిసాన్‌ సంఘ్‌' అనే ఈ రైతుల సంఘాన్ని కలుసుకున్న శివరాజ్‌సింగ్‌… గోమూత్రం గురించి ఏం చేయాలో ఆలోచించమని అడిగారు. వృధాగా పోతున్న గోమూత్రాన్ని, గోమయాన్ని అమ్ముకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సలహాసంఘం ద్వారా తనకి తెలియచేయమని చెప్పారు. దానికి సదరు రైతులు ప్రభుత్వమే ఎంతో కొంత చెల్లించి వీటిని కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని సూచించారట!!!

ముద్రగడ దీక్షపై అచ్చెన్నాయుడు.. అభిమానుల సంబరాలు..

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన డిమాండ్లకు గాను ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి.. ఆయనతో రాజకీయ నేతలు దీక్ష విరమణ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముద్రగడతో చర్చలు సానుకూలంగా జరిగాయని.. చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారని వెల్లడించారు. అంతేకాదు కాపులను బీసీల్లో చేర్చే విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది..వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరామని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడంతో కిర్లంపూడిలో ముద్రగడ నివాసం ఎదుట బాణా సంచా కాలుస్తూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రసాయనాల కంపెనీలో అగ్నిప్రమాదం… ఆరుగురి మృతి!

హైదరాబాదుకి అతి సమీపంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని మంకాళ్‌ పారిశ్రామికవాడలో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. హాసిత అనే రసాయనాల కర్మాగారంలో వేర్వేరు రసాయనాలను కలుపుతుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన నలుగురు కార్మికులతో సహా మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. హాసిత కర్మాగారానికి సరైన లైసెన్స్‌ కానీ ఇతరత్రా అనుమతులు కానీ లేవనీ… దాదాపు ఎనిమిది నెలల కిందటే వీరిని సంస్థను మూసివేయమని చెప్పినా కూడా అనధికారికంగా కర్మాగారాన్ని నడుపుతున్నారనీ తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యుడైన తీగల కృష్ణారెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నవారిని పరమామర్శించారు. మృతులు కుటుంబాలకు కనీసం 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యాన్ని హెచ్చరించారు!

ముద్రగడ దీక్ష విరమణ...

నాలుగురోజులుగా కిర్లంపూడిలో సాగుతున్న ఉద్రిక్తతకు తెరపడింది. ప్రభుత్వ ప్రతినిధులైన అచ్చెన్నాయుడు, కళావెంకట్రావులు ముద్రగడ పద్మానాభం దంపతులకు నిమ్మరసాన్ని అందించి దీక్షను విరమింపచేశారు. ముద్రగడ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన హామీలను అందించడంతో ఆయన దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, కాపు కార్పొరేషన్‌కు ఏటా వేయి కోట్లు అందించడమే కాకుండా... కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ వచ్చిన అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాపులను బీసీలలోకి చేర్చేందుకు ఏర్పాటు చేసిన మంజునాధ కమీషన్ కాలపరిమితిని కూడా వీలయినంతగా తగ్గించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో ముద్రగద దీక్షను విరమించారు. తుని సంఘటన సందర్భంగా నమోదైన కేసులు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తుని సంఘటలకు అకారణంగా ఎవరినీ బాధ్యులను చేయమనీ, దానికి సంబంధించి ఎలాంటి కఠినమైన కేసులనూ నమోదు చేయమని ప్రభుత్వం తరఫున ముద్రగడకు హామీ లభించినట్లు సమాచారం.

శవాన్ని ఇంట్లో దాచిపెట్టి పెళ్లి!

నవీన్‌, ఆర్జూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి నవీన్‌ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. పెద్దలకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడటం ఇష్టం లేని ఆ జంట ఇక ఎప్పటికీ కలవకూడదని నిర్ణయించుకుంది. ఇంతదాకా బాగానే ఉంది. కానీ నవీన్‌కి వేరొకరికతో వివాహం నిశ్చయం కావడంతో సమస్యలు మొదలయ్యాయి. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఆర్జూ పట్టుపట్టింది. తన పెళ్లి గురించి ఆర్జూని ఒప్పించడమో, ఆమె పెద్దలని హెచ్చరించడమో చేస్తే సరిపోయేదానికి వేరే నిర్ణయాన్ని తీసుకున్నాడు నవీన్‌. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆర్జూని గతవారం బయటకి తీసుకువచ్చాడు. మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. నవీన్‌ తనను పెళ్లి చేసకునే ఉద్దేశ్యంతోనే ఉన్నాడన్న సంతోషంలో ఉన్న ఆర్జూని... సజీవ దహనం చేశాడు! ఆమె శవాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టి, ఏమీ ఎరగనట్లు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. రోజులు గడిచినా ఆర్జూ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు. వెతుకులాటలో భాగంగా నవీన్‌ ఇంటిని చేరుకున్న పోలీసులకి అక్కడ ఆర్జూ శవం కనిపించింది. ఈ సంఘటన ఇటు ఆర్జూ ఇంట్లోనే కాదు, అటు కొత్త పెళ్లికూతురు ఇంట్లోనూ విషాదాన్ని నింపింది!

దాసరిగారూ... కిర్లంపూడికి వెళ్లొద్దు!

ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడికి ప్రముఖుల వలస మొదలైది. వీరి రాక వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. తమ ఆందోళనను పట్టించుకోకుండా ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తే తునిలో జరిగిన సంఘటనలే పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముద్రగడను కలుసుకునేందుకు బయల్దేరిని దాసరి ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. ఆయనను కలిసిన పోలీసులు కిర్లంపూడికి వెళ్లవద్దని ఆయనను కోరినట్లు సమాచారం. మరోపక్క దీక్ష మొదలై 70 గంటలు దాటిపోవడంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యం గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలను కూడా నిరాకరించడంతో... ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల తూర్పుగోదావరి జిల్లా అంతటా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పవన్‌ కళ్యాణ్ తన అన్నకంటే దారుణం... వర్మ

నిరంతర ప్రచార స్రవంతి రాంగోపాల్ వర్మకి ఈసారి పవన్‌ చక్కగా దొరికిపోయారు. తుని సంఘటన గురించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు నొప్పించక తానొవ్వక అన్న చందంగా సాగిపోయిన సంగతి తెలిసిందే! అసలే ఎప్పడెప్పుడు పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్‌ చేద్దామా అని కాచుకుని ఉండే వర్మకి ఈ సంఘటన వరంలా మారింది. అసలు పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన విషయాలు తనకన్నా అర్థమయ్యాయా అని తన ట్టిట్టర్‌లో ఎద్దేవా చేశారు వర్మ. పవన్‌ కళ్యాణ్‌ ఎవరివో చెప్పడు మాటలు విని ప్రభావితం అయ్యారనీ... అందుకే ఆయన మాటలలో నిజాయితీ లోపించిందని ఆరోపించారు. ఎంతో ఆర్భాటంగా రాజకీయాలలోకి దిగిన పవన్‌ తన అన్నకంటే దారుణమైన స్థితిలోకి జారిపోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. పైగా ఈ విషయంలో తనతో ఏకీభవించని పవన్‌ అభిమానులంతా నమ్మకద్రోహులంటూ చురకలు అంటించారు. మరి ఇంతకీ వర్మ చెప్పిన మాటల్లో నిజం ఉన్నట్లా లేనట్లా అంటే పవన్ ఉపన్యాసాన్ని మరోసారి వినాల్సిందే!

నేడు కిర్లంపూడికి చిరంజీవి...

తునికి ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తనున్నాయి. చిరంజీవి, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు... తదితర కాపు ప్రముఖులంతా నేడు కిర్లంపూడికి ప్రయాణం కడుతున్నారు. వీళ్ల రాకతో ఉద్యమంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని పోలీసు అధికారులు ఉద్విగ్నంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి, తన వర్గంవారి అంచనాలని అందుకోలేకపోయారన్న విమర్శను మూటగట్టుకున్నారు. మరి తిరిగి వారి నమ్మకాన్ని తిరిగి చూరగొనేందుకు చిరంజీవి సంచలనాత్మక ప్రకటన ఏదన్నా చేస్తారేమో! ఇక తన దగ్గర చాలా సంచలన విషయాలున్నాయంటూ తరచూ ఊరించే దాసరి, ఇవాళ కూడా తనదైన శైలిలో ప్రభుత్వం మీద విరుచుకుపడే అవకాశం ఉంది.

మేయర్ సెలక్షన్ కు నోటిఫికేషన్

హైదరాబాద్‌ మహా నగర మేయర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. మొత్తం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ బొజ్జ 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ హాల్‌కు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11న ఉదయం పది గంటలకు మేయర్‌ ఎన్నిక జరగనుంది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల్లో 24 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎమ్మెల్సీలు, పదిమంది రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలవడంతో, మేయర్‌ ఎవరు అన్నదానిమీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్ ను సొంతంగానే ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్న టిఆర్ఎస్, ఆ పీఠాన్ని ఎవరికి ఇవ్వబోతోంది..? బీసీ జనరల్‌కి ఇచ్చేలా ఉంటే ఎవరికి లభిస్తుంది..? మహిళలకు అవకాశం కల్సించలేదనే విమర్శలపాలవుతున్న గులాబీ దండు, మేయర్ పదవిని మహిళకు కేటాయిస్తే, ఆ స్థానం ఎవరిది..? ఇవీ ఇప్పుడు జోరుగా షికారు చేస్తున్న ప్రశ్నలు..పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడైన కేకే కుమార్తె విజయలక్ష్మికే ఎక్కువ ఛాన్స్ ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పదకొండో తారీఖు వరకూ వెయిట్ చేయక తప్పదు.

వంటపని కోసం 4000 దరఖాస్తులు!

ప్రభుత్వ ఉద్యోగం అంత సుఖం లేదన్నది ఇప్పటి యువత అభిప్రాయం. అందుకే ప్రభుత్వం ఏ ఉద్యోగం కోసం పిలుపునిచ్చినా… వేలు, లక్షలుగా జనం తరలి వస్తున్నారు. తాజాగా జార్ఖండ్  పోలీసు శాఖ వంటపని వారు కావాలంటూ ప్రకటన జారీచేసింది. ఆ ప్రకటనకి బదులుగా వేలమంది అభ్యర్థులు స్పందించారు. అందులో 4000 మందికి ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో నిన్న వంట పరీక్షలు కూడా జరిగాయి. ఇందులో ఎవరు బాగా వంట చేశాలో నిర్ణయించి ఆ నాలుగువేల మందిలోంచి 78 మందికి రాష్ట్రంలోని వివిధ పోలీసు శాఖలలో వంటవాడిగా ఉద్యోగాన్ని ఇవ్వనుంది అక్కడి ప్రభుత్వం. ‘ప్రభుత్వ ఉద్యోగం అంటే భవిష్యత్తు గురించి చింత ఉండదనీ, ఆడుతూ పాడుతూ నెలకో ఇరవై వేలు సంపాదించుకోవచ్చనీ’ అభ్యర్థులలో చాలామంది చెప్పుకు వచ్చారు.

పరిహారం చెల్లించనందుకు… రైలు ఇంజను జప్తు

ఎవరన్నా ప్రభుత్వానికి బాకీ పడితే వారి నుంచి అధికారులు ముక్కుపిండి మరీ రుణాన్ని వసూలు చేసుకుంటారు. కుదరని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారి ఆస్తులను జప్తు చేసుకుంటారు. కానీ ఏకంగా రైల్వే శాఖే ప్రజలకు బాకీని తీర్చకపోతే ఏం చేయాలి. అందుకనే కర్ణాటకలోని ఒక న్యాయస్థానం, రైల్వేవారి ఆస్తులైన రైలింజనును జప్తు చేసుకోవలసిందిగా ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకలోని చిత్రదుర్గ-రాయదుర్గల మధ్య రైల్వే లైనుని నిర్మించేందుకు రైల్వే శాఖ కొందరు రైతుల నుంచి భూమిని తీసుకుంది. అయితే ఇందుకోసం తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో 30 ఏళ్లుగా రైతులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేళకు గత నవంబరు నెలలో, కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చింది. వారికి వీలైనంత త్వరలో పరిహారాన్ని చెల్లించమని న్యాయస్థానం, రైల్వే శాఖను ఆదేశించింది. అయితే ఈ కోర్టు తీర్పుని కూడా రైల్వేవారు లెక్కచేయకపోవడంతో ‘హరిహర-చిత్రదుర్గ-బెంగళూరు’ మధ్య తిరిగే ప్యాసింజరు రైలుని జప్తు చేసుకోవల్సిందిగా కోర్టు ఆదేశించింది. అప్పుడు కానీ రైల్వే అధికారులు దిగారాలేదు. గత శుక్రవారం రైలు జప్తు కావడంతో ‘ఈసారి తప్పకుండా పరిహారాన్ని చెల్లిస్తాం. దయచేసి మా ఇంజనుని విడిచిపెట్టండి’ అంటూ కోర్టుని వేడుకున్నారు అధికారులు. కోర్టు దయతో తిరిగి ఇంజను కదిలింది! మరి ఈసారైనా రైతులకి పరిహారం లభిస్తుందో లేదో!

మళ్లీ టీఆర్ఎస్ వైపు చూస్తున్న దానం..?

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఆ పార్టీకి రాజకీయంగా ఎలాగూ తిరుగులేదు. ఇప్పుడు మిగిలిన పార్టీల పరిస్థితులో కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందునా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఒక పక్క తెలంగాణ వాదులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అన్న పేరు ఉన్నా అది ఎందుకు పనిరాకుండా పోయింది. గ్రేటర్లో కేవలం రెండంటే రెండు స్థానాలను దక్కించుకోగలిగింది. అందుకే తమ ఓటమికి బాధ్యత వహించి కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన దానం ఇప్పుడేం చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమందైతే దానం మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతారని అనుకుంటున్నారు. ఇప్పటికే దానం కాంగ్రెస్ తరపు కార్యక్రమాలు వేటిలో పాల్గొనడంలేదు. అంతేకాదు పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో కూడా ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది. ఇక ఇదే అదనుగా దానం కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దానం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

టీఆర్ఎస్ గెలుపు.. తెర వెనుక తుమ్మల..!

ఎంతో రసవత్తరంగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నగరంలోని ప్రజలంతా ఊరు పార్టీకే పట్టంగట్టారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించనంతగా 150 డివిజన్లలో 99 స్థానాలు గెలుపొంది.. మిగిలిన పార్టీలను పత్తా లేకుండా చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతానికి చెందిన వారు ఎలాగూ అధికార పార్టీకే ఓటు వేస్తారు. అది పక్కా.. అది అందరికి తెలిసిన రహస్యమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సీమాంధ్రుల ఓట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకే వెళ్లడం. అయితే సెటిలర్ల ఓట్లు పక్కా తమకే పడతాయనుకున్న మిగిలిన పార్టీలకు షాకిస్తూ ఆ ఓట్లను కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. మరి సెటిలర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపడానికి కారణం ఏంటి.. కేటీఆర్ మాటలకు సీమాంధ్ర ప్రజలు ఇంప్రెస్ అయ్యారా.. అంటే దీనంతటికి తెర వెనుక మరో వ్యక్తి ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆవ్యక్తి ఎవరో కాదు.. టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు మొదటి నుండి టీడీపీ పార్టీలోనే ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన అనంతరం.. ఆయన పార్టీ మారి కారెక్కవలసి వచ్చింది. ఇప్పుడు ఈ తుమ్మలతోనే సెటిలర్లపై మంత్రం వేయించారంట కేసీఆర్. నగరంలో అన్ని చోట్లా కేటీఆర్ ప్రచారం చేసినా సెటిలర్ల విషయంలో మాత్రం తుమ్మలని రంగంలోకి దించారంట. అది టీఆర్ఎస్ పార్టీకి ఫ్లస్ పాయింట్ అయింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే తుమ్మలకి సెటిలర్లలో మంచి పేరు.. మంచి పట్టు ఉంది. అంతేకాదు తుమ్మల మాటపై ఉన్న నమ్మకం.. తుమ్మల ఏంచెప్పినా సెటిలర్లు కాదనే నమ్మకం ఉంది. అందుకే సెటిలర్లపై తుమ్మల చేత బాణాలు వేయించారు కేసీఆర్. అంతేకాదు సెటిలర్లను తమకు అనుగుణంగా మార్చడంలో తుమ్మల నూరుశాతం విజయం సాధించినట్టు తెలుస్తోంది. దీనికి నిదర్శనం ఆ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ గెలవడమే. మొత్తానికి తెర ముందు కేటీఆర్.. తెర వెనుక తుమ్మల కలిసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. దీంతో కేసీఆర్ కూడా తుమ్మలకి ప్రత్యేకంగా అభినందనలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ లో తుమ్మలకి ప్రాధాన్యత పెరగడమే కాదు.. ఆయనకు ప్రమోషన్ కూడా ఉంటుందని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మేయర్ పదవికి ఎవరికో...?

గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి..ఫలితాలు కూడా వచ్చేశాయి.. తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలను క్లీన్ స్పీప్ చేసి 150 డివిజన్లకు గాను 99 స్థానాల్లో గెలుపు ఖైవసం చేసుకుంది. ఇక ఈనెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరూ అనేది ఎంపిక చేస్తామని పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మేయర్ పదవి ఎవరిని వరిస్తుంది అనేది ఉత్కంఠంగా మారింది. అంతేకాదు ఈ ఉత్కంఠం నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతన్నాయి. ఈసారి గ్రేటర్ మేయర్ పదవికి మహిళకు అవకాశం ఇస్తారా అని అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే కేకే కూతురు విజయలక్ష్మీ పేరు కూడా వినిపిస్తుంది. మరోవైపు సీమాంధ్ర వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని అనుకుంటున్నారు. మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే 11 తేదీ వరకూ ఆగాల్సిందే.

ఏం తోచకపోతే అసెంబ్లీ పెడతారా..! గవర్నర్ పై సుప్రీం ఫైర్..

అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా అసెంబ్లీ సమావేశాలపై తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. గవర్నర్ నిర్ణయం పై సుప్రీం కోర్టు కూడా ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా ఈ ఏడాది జనవరి 14న జరుగాల్సిన సమావేశాలను గత డిసెంబర్ 16కు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిని విచారించిన సుప్రీంకోర్టు  ముందస్తు తేదీ ప్రకారం సమావేశాలు జరిపితే ఏమి తేడా వచ్చేదని.. గవర్నర్‌కు ఏమీ తోచకపోతే సరదా కోసం సభను సమావేశ పరుస్తారా అని ప్రశ్నించారు. అనంతరం ఈకేసును సోమవారానికి వాయిదా వేశారు.

గాంధీ కుటుంబంపై మోడీ ఫైర్..

ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన గాంధీ కుటుంబ సభ్యులపై విమర్శల బాణాలు వదిలారు. పార్లమెంటులో కీలక చట్టాలను, సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని.. 2014 ఎన్నికల్లో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో అని అన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు నన్ను వ్యతిరేకించినా పార్లమెంటు మాత్రం తనపని తాను చేసుకుపోవాలని కోరుకుంటున్నారు. కానీ ఒక కుటుంబం మాత్రం మొండిగా వ్యవహరిస్తూ రాజ్యసభ పనిచేయకుండా అడ్డుకుంటున్నది అని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం మాట వినే ప్రభుత్వం అస్సాంలో ఏర్పడితే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు. ప్రసంగానికి ముందు స్థానిక సంప్రదాయిక భేరీని మోగించారు.