అక్కాతమ్ముళ్లను కలిపిన ఫేస్ బుక్
టెక్నాలజీ వల్ల లాభాలు,నష్టాలూ రెండూ ఉంటాయి. ఉపయోగించుకునే తీరు బట్టి ఫలితం మారుతుంటుంది. తాజాగా, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఇద్దరు అక్కాతమ్ముళ్లను కలిపింది. కెనడాకు చెందిన షైలో విల్సన్ తల్లి తన చిన్న కొడుకును పుట్టగానే వేరొకరికి దత్తత ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్లు వేరే ప్లేస్ కు మారిపోవడంతో మళ్లీ కలవలేకపోయారు. ఇది జరిగిన పాతికేళ్లకు, షైలో విల్సన్ తన ఫేస్ బుక్ లో తమ్ముడి గురించి పోస్ట్ పెట్టింది. మాథ్యూ హ్యాండ్ ఫోర్డ్ అనే పేరుతో పెరిగిన ఆమె తమ్ముడు కూడా,తన సొంత కుటుంబం కోసం ఆరా తీస్తున్నాడు.
అనుకోకుండా, ఎవరో షేర్ చేయడంతో, తన అక్క పెట్టిన పోస్ట్ చూశాడు. నా తమ్ముడు ఫలానా హాస్పిటల్లో పుట్టాడు. తన పేరు మాథ్యూ అని అన్ని డిటెయిల్స్ తో ఆమె పెట్టిన పోస్ట్ చూసి మాథ్యూ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆమెకు మెసేజ్ చేసి, అడ్రస్ కనుక్కుని వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఊహ తెలియకముందే దత్తత వెళ్లిపోయిన మాథ్యూ, తన సొంత అక్కను, కుటుంబ సభ్యులను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. టెక్నాలజీని సవ్యంగా వాడుకుంటే, ఎంత అద్భుతమో ఈ అక్కాతమ్ముళ్లే ఉదాహరణ.