'శ్రీమంతుడు' చూస్తే చిన్నతనం గుర్తొచ్చింది.. వెంకయ్య
posted on Aug 12, 2015 @ 2:42PM
మహేశ్ బాబు నటించిన సినిమా శ్రీమంతుడు ఇప్పటికే రిలీజ్ అయి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ఒక్క మహేశ్ అభిమానులకే కాదు అటు రాజకీయ నాయకులకు కూడా నచ్చింది. కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడికి శ్రీమంతుడు సినిమా బాగా నచ్చిందంట. తెలుగు రాష్ట్రాల ఎంపీల కోసం గుంటూరు టీడీపీ ఎంపీ ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలను కూడా ‘శ్రీమంతుడు' ప్రత్యేక షోకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శ్రీమంతుడు సినిమా తనకు బాగా నచ్చిందని.. సినిమా చూస్తుంటే తనకు తన చిన్నతనం గుర్తొచ్చిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో వస్తున్న చిత్రాలలో ఎక్కువగా అశ్లీలత ఎక్కువగా ఉంటుందని.. కానీ శ్రీమంతుడిలో దానికి చోటివ్వకుండా చక్కగా విజ్ఞానం.. వినోదం ఉన్నాయని అన్నారు. ఈ సినిమా ద్వారా కన్నతల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని ఎవరూ మరవవద్దు అని చెప్పారని ప్రశంసించారు.