షారుఖ్ సినిమా స్ఫూర్తితో కిడ్నాప్!
1993లో షారుఖ్, జూహీచావ్లా, సన్నీడియోల్ నటీనటులుగా వచ్చిన ‘డర్’ సినిమా చాలామందికే గుర్తుండే ఉంటుంది. ఇందులో షారుఖ్ కథానాయికను రహస్యంగా ఆరాధిస్తుంటాడు. ఆమె తన ప్రేమని ఒప్పుకునే పరిస్థితులలో లేకపోవడంతో, ఆమెను కిడ్నాప్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని బలవంతపెడతాడు. గతవారం దేశంలోనే సంచలనం సృష్టించిన ఒక కిడ్నాప్ వెనుక ఇదే డర్ సినిమా ప్రేరణ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ పట్టణంలో జరిగిన ఈ సంఘటనలో దేవేందర్ కుమార్ అనే అల్లరిచిల్లరి కుర్రవాడు దీప్తి శర్మ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు తెలియకుండానే గత ఏడాది కాలంగా దీప్తిని వెంబడించేవాడట దేవేందర్. ఆఖరికి ఆమెకు ఇష్టమైన ఆహారం ఏమిటో కూడా దేవేందర్ తెలుసుకున్నాడు. చివరికి ఆమెను ఎలాగైనా కిడ్నాప్ చేసి తనతో ప్రేమలోకి దింపాలనుకున్నాడు దేవేందర్. దీప్తి రోజూ షేర్ ఆటోలో తిరుగుతుందని తెలిసి, ఒక రెండు షేర్ ఆటోలని కూడా కొనుగోలు చేశాడు. దీప్తి ఒక గొప్పింటి కూతురనీ, ఆమెను కిడ్నాప్ చేస్తే బోలెడు డబ్బు దొరుకుతుందని ప్రలోభ పెట్టి మరో ముగ్గురిని కూడా ఈ పథకంలోకి ఇరికించాడు.
ఒక రోజు తన పథకం ప్రకారం దీప్తిని షేర్ ఆటోలో కిడ్నాప్ చేయనే చేశాడు. కానీ దీప్తిని ఎవరో అపహరించారన్న విషయం బయటకి పొక్కడంతో ఘజియాబాద్ పోలీస్ యంత్రాంగం అంతా అప్పమత్తమైంది. రెండు రోజుల పాటు దీప్తిని అటూ ఇటూ తిప్పుతూ.... ఎక్కడికి వెళ్లినా కూడా పోలీసులే పోలీసులు కనిపించడంతో ఆమెను వదిలిపెట్టక తప్పలేదు దేవేందర్‌కు. దీప్తిని ఎత్తుకుపోయిన తరువాత భారీగా డబ్బులు కావాలంటూ ఫోన్లు చేయడం కానీ, ఆమెను హింసించడం కానీ చేయకపోవడంతో... పోలీసులకు ఈ కిడ్నాప్ ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. కానీ నిందితులు దొరికిన తరువాత వాళ్లు చెప్పిన మాటలతో అంతా అవాక్కవక తప్పలేదు! దేవేందర్ ఒక సైకో అని తేలడంతో, ఎలాంటి ప్రమాదం జరగకుండానే దీప్తి బయటపడినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మనకి తెలియకుండానే మనల్ని వెంటాడే కళ్లు కూడా ఉంటాయని దీప్తి ఘటనతో రుజువైంది. తస్మాత్ జాగ్రత్త!