ఏపీ.. లక్ష కోట్ల పెట్టుబడి.. 50,000 ఉద్యోగాలు
posted on Aug 11, 2015 @ 12:33PM
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్ధికంగా వెనుకబడిన ఏపీ ఇంకా ఎంతో అభివృద్ది సాధించాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు మన రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా ఇప్పుడు మరో ధనిక దేశమైన దుబాయ్ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీలోని నెల్లూరు లేదా ప్రకాశం జిల్లాలో భారీ పెట్రో రిఫైనరీ, కెమికల్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలని దుబాయ్ లోని ఓ కంపెనీ ఆసక్తి ఆసక్తి చూపిస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అయితే ముడి చమురు ఎగుమతి, దిగుమతుల కోసం దుబాయ్ కంపెనీ సొంత పోర్టు కూడా కావాలని భావిస్తుండటంతో నెల్లూరు జిల్లాలోని సముద్రతీరానికి దగ్గరలో 3,000 ఎకరాలు కావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
అయితే ఇప్పటికే అనేక పరిశ్రమల ఏర్పాటుకు అక్కడ భూములు కేటాయించడంతో దానికి మినహాయింపుగా ప్రకాశం జిల్లాలోని భూములను సైతం పరిశీలించాలని కంపెనీని కోరడంతో కంపెనీ కూడా ఇందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 50,000 ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. మాములుగా అయితే ఏ రాష్ట్రంలో అయినా కంపెనీ పెట్టాలంటే కంపెనీలు పన్ను రాయితీలతో పాటు భూములను సైతం రాయితీ ధరపై ఇవ్వాలని కోరుతున్నాయి.. కానీ దుబాయ్ కంపెనీ మాత్రం మార్కెట్ ధర చెల్లించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈప్రాజెక్ట్ కనుక ఏపీలో అమలైతే దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ప్రాజెక్టు అవుతుంది.