cm chandrababu

చంద్రబాబుపై కేసు అంత ఈజీ కాదు..

రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి అటు తెలంగాణకు కాని ఇటు ఆంధ్రాకు కాని ఎదో విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎన్ని గొడవలు, వివాదాలు జరిగినా అవన్నీ ఇప్పుడు  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు వివాదం కింద దిగదుడుపే. రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల ఒక్కసారిగా ఇరు రాష్ట్రాలలోని రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని విశ్వ ప్రయత్నమే చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి అనే చిన్న పిచ్చుక ద్వారా చంద్రబాబు పై బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు పై ఒక్కో బ్రహ్మస్త్రాన్ని వదులుతుంది. మొదటి బ్రహ్మస్త్రంగా.. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన సంభాషణలు అంటూ ఓ న్యూస్ ఛానల్ లో కూడా విడుదల చేసింది. కానీ అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కలిసిరాలేదు. ఎందుకంటే బయటకు వచ్చిన ఆ సంభాషణల వీడియోలో చంద్రబాబు ఎక్కడా డబ్బు గురించి కానీ ఓటు గురించి కానీ ప్రస్తావించింది లేదు. అసలు చంద్రబాబు స్టీఫెన్ సన్ తో సంభాషించలేదని.. ఎక్కడెక్కడో చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ తీసుకొచ్చి గుదిగుచ్చి వీడియో చేసి తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని టీడీపీ నేతలు మొత్తుకుంటున్నారు. రెండోదిగా రేవంత్ రెడ్డి బాస్ ఉచ్చారణ... ఏసీబీ అధికారులు ఈ కోణంలో కూడా గట్టి ప్రయత్నమే చేశారు.. రేవంత్ రెడ్డి స్టీఫేన్ సన్ తో మాట్లాడినప్పుడు 'బాస్' అని ఉచ్ఛరించగా ఆ 'బాస్' ఎవరూ అనే తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బాస్ అని మాత్రమే చెప్పాడు కాబట్టి ఆ బాస్ చంద్రబాబే అని గ్యారెంటీ లేదు.. సో ఈ రకంగా కూడా చంద్రబాబు పై కేసు పెట్టడం అంత ఈజీ కాదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబుకు పూర్తి మద్ధతు ఇవ్వడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంది. కేసీఆర్ ఏమన్నా నీతిపరుడా. ఆయన చేసిన భాగోతం మాకు తెలుసు అని కేంద్రమంత్రులు మండిపడుతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం.. అంతేకాక స్టింగ్ ఆపరేషన్ చేసేముందు ఎన్నికల కమిషన్ కు ముందుగానే చెప్పి చేయాలి. కానీ అలాకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి నిబంధనలేమి పాటించకుండా కేవలం టీడీపీ మీద అక్కసుతో తామే ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పరిస్థితికి తెచ్చుకుంది. దీంతో ఎటు చూసినా ఈ కేసు ద్వారా చంద్రబాబును ఇరికించాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురు కావడం ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబును కేసులో ఇరికించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.

highcourt

జెన్‌కో ఉద్యోగుల కేటాయింపు నిలిపివేయండి.. హైకోర్టు

తెలంగాణ జెన్‌కో, ట్రాన్ప్‌కోలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల బదిలీ పై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఉద్యోగుల బదిలీల కేటాయింపు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో కోర్టుకు మళ్లీ తమ వాదనలు వినిపిస్తామని.. విభజన చట్టానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నాం తప్పా.. వారి మీద మాకేం కోపం కాని.. వ్యతిరేకత కాని లేదని టీ సర్కార్ తెలిపింది. మరోవైపు అసలు ఉద్యోగుల విభజన అనేది ఒక కమిటీ వేసి, ఆప్షన్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్టు బదిలి అంటే కుదరదని ఏపీ స్థానికత ఉద్యోగులు తెలిపారు.

jitendra singh tomar

జితేందర్ సింగ్ తోమర్ పై బహిష్కరణ వేటు

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ సర్టిఫికేట్ల వివాదంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని పార్టీ నుండి బహిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పై పార్టీ నేతలు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ తోమర్ పార్టీకి చాలా అన్యాయం చేశాడని, నమ్మి అతనిని పార్టీలోకి తీసుకొని పదవి ఇచ్చినందుకు పార్టీకే దెబ్బతీయాలని చూశాడని అందుకే పార్టీనుండి బహిష్కరించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో తోమర్ పై ఉదాశీనత చూపదలుచుకోలేదని.. తోమర్ చేసిన పనికి కేజ్రీవాల్ తీవ్ర కలత చెందారని తెలిపారు. ఇదిలాఉండగా నకిలీ పట్టాలు ఆరోపణలో తోమర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

somireddy chandramohan reddy

కేసీఆర్ భాష మార్చుకోవాలి.. సోమిరెడ్డి

తెదేపా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం కేసీఆర్, జగన్ ల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయి ఎన్నికుట్రలు చేసినా చంద్రబాబుని కాని, టీడీపీని కానీ ఏం చేయలేరని విమర్శించారు. కేసీఆర్ ఒక అవినీతిపరుడు, ఆయన ఇంకో అవినీతి పరుడితో చేతులు కలిపాడు అని ఎద్దేవ చేశారు. హైదరాబాద్ తన సొంతం అయినట్టు సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు. కాగా.. పాలమూరు ప్రాజెక్టుకు మేమేమి వ్యతిరేకం కాదని కానీ ప్రాజెక్టు నిర్మించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తీసుకోవాలని సూచించారు.

chandrababu Phone Tapping

చంద్రబాబు టెర్రరిస్టా? అశోకగజపతిరాజు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో విడుదలైన చంద్రబాబు సంభాషణల వీడియోపై కేంద్ర పౌరవిమానయానమంత్రి అశోకగజపతిరాజు స్పందించారు. చంద్రబాబు ఏమైనా నక్సలైటా? టెర్రరిస్టా? అతని వాయిస్ రికార్డ్ చేయడానికి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ పనికి రెండు రాష్ట్రాల్లో విభేధాలు తలెత్తడమే కాకుండా భవిష్యత్ రాజకీయాలకు చాలా నష్టమని అన్నారు. అసలు చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సినంత అవసరం తెలంగాణ ప్రభుత్వాని ఏముందని మండిపడ్డారు. ముందు ఈ విషయంపై స్పందించని తెలంగాణ ప్రభుత్వం తరువాత ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెపుతోంది కానీ.. టీఆర్ఎస్ సర్కార్ మాట ఎవరూ నమ్మడం లేదని... దీనికి సంబంధించిన ఆధారాలు ఏపీ పోలీసు అధికారుల కేంద్రానికి సమర్పించారని తెలిపారు.

revanth reddy

ఫోరెన్సిక్ ల్యాబ్ కు రేవంత్ ఆడియో, వీడియో రికార్డులు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో చేసిన సంభాషణలకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది. దీనితో పాటు రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, సెబాస్టియన్, ఉదయసింహల ఫోన్లు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటికే ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న గొంతును ఏసీబీ అధికారులు గుర్తించారు. అయినా ఇందుకు సంబంధించిన నివేదిక ఫోరెనిక్స్ ల్యాబ్ నుండి రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నివేదిక కూడా వచ్చిన తరువాత ఏసీబీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

chandrababu

గవర్నర్ కు క్లాస్ పీకిన కేంద్రం!

తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని.. తనతో పాటు 120 మంది నేతల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని, గవర్నర్ కూడా ఈ విషయంలో ఏ పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలను సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోం కార్యదర్శి గోయల్‌కు సమర్పించారు. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై స్పందించి విచారణను చేపట్టడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రల గవర్నర్ కు క్లాస్ పీకారని సమాచారం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా, సజావుగా పనిచేసే వాతావరణం కల్పించాలని, రెండు రాష్ట్రాల సీఎంలు ఎవరి పని వారు చేసుకునేలా చూడాలని కేంద్రం గవర్నర్ కు ఆదేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

revanth reddy

రేవంత్ కేసు.. ఎంపీ ఖాతా నుండి డబ్బు డ్రా?

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తెచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలుసుకునే పనిలో పడింది ఏసీబీ. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తీసుకొచ్చిన డబ్బు నోట్లపై బ్యాంకు లేబుల్స్ లేకపోవడంతో నోట్లపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఆ డబ్బు ఓ చిన్న బ్యాంకు ద్వారా డ్రా చేశారన్న విషయం తెలుసుకున్నారు. అయితే ఆడబ్బు చంద్రబాబుకు అతి సన్నిహితుడైన ఓ ఎంపీ ఖాతా నుండి డ్రా చేసినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 4.5 కోట్ల డబ్బుల గురించి దర్యాప్తు చేపట్టారు ఏసీబీ అధికారులు. మరోవైపు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడేటప్పుడు బాస్ అని అన్న నేపథ్యంలో అసలు ఆ బాస్ ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు గట్టి ప్రయత్న చేస్తుంది ఏసీబీ. దీనికి సంబంధించి రేవంత్ కస్టడీలో ఉన్నప్పుడు విచారించగా రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఏసీబీ రేవంత్ గతంలో మాట్లాడిన వీడియోలు ఏ ఏ సందర్భాలలో బాస్ అని మాట్లాడాడు.. ఎవరిని ఉద్దేశించి బాస్ అనే పదం ఉపయోగించాడో తెలుసుకునే పనిలో పడింది. మొదటి దర్యాప్తులో చేపట్టిన సమాచారంతో చంద్రబాబుకు, ఇతర మంత్రులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు చేస్తోంది.

Deputy Chief Minister K E Krishnamurthy

ఆంధ్రావాళ్లను తిట్టకుండా ఉండగలవా.. కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆంధ్రావాళ్లని తిట్టకపోతే కేసీఆర్ కు నిద్రపట్టదని.. ఒక నెల రోజులు ఆంధ్రావాళ్లను తిట్టకుండా ఉండగలవా? అని కేసీఆర్ ని ప్రశ్నించారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఇప్పుడే వెళ్లిపోవాలని కేసీఆర్ అంటున్నాడు.. కేసీఆర్ కనుకు తన వైఖరి మార్చుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాజ్యాంగంపై అవగాహన లేకపోతే ఇలానే మాట్లాడతారని వ్యాఖ్యానించారు. అసలు తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కేసీఆర్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ, ట్రైబ్యునల్ అనుమతి లేదని.. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం.. దానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.

cm chandrababu

కేసీఆర్ అతి చేస్తున్నాడు.. జీజేపీ నేతలు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని కేసీఆర్ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈవ్యవహారంపై కేంద్ర మంత్రుల చంద్రబాబుకు పూర్తి మద్ధతు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏమి నీతిపరుడు కాదని.. అతను చేసిన భాగోతం తమకు తెలుసనీ బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు విషయంలో కేసీఆర్ చాలా ఎక్కవ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయించిన కేసీఆర్.. తను ఎక్కడెక్కడ నిఘా పెట్టించాడో.. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయించాడో తెలుసుకోవడం పెద్ద పనేమి కాదని కేంద్ర భావిస్తుంది. చంద్రబాబే జీజేపీకి నమ్మకమైన మిత్రపక్షమని, అందుకే చంద్రబాబుకు మద్ధతు ఇవ్వడమే సరైనదని జీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, బీజేపీ కలిసుంటేనే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమని.. అలా అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీజేపీకి తిరుగుండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Motkupalli Narasimhulu

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మొత్కుపల్లి?

  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చెలరేగిన తాజా యుద్దంలో నరసింహన్ పదవికి ఎసరు తెచ్చేలా కనబడుతోంది. తెలంగాణాకు చెందిన తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుని గవర్నర్ గా నియమించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తానని ఇదివరకే హామీ ఇచ్చి ఉన్నారు కనుక ఒకవేళ ప్రస్తుత గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం మార్చాలనుకొన్నా లేదా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేగా గవర్నర్ ని నియమించాలనుకొన్నా మొదట మొత్కుపల్లికే ఆ అవకాశం దక్కవచ్చని తెదేపా నేతలు భావిస్తున్నారు.   ఒకవేళ మొత్కుపల్లిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తే, రాష్ట్ర రాజకీయాలలో తెదేపాకే మేలు కలుగుతుంది. రాష్ర్టంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వద్దకు వెళ్లి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిత్యం ఏదో ఒక పిర్యాదు చేస్తూనే ఉంటారు. ఒకవేళ మొత్కుపల్లిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తే జగన్మోహన్ రెడ్డి ఇక పిర్యాదులు చేసే ఆలోచన కూడా చేయకపోవచ్చును. ఒకవేళ చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. అదే విధంగా మోత్కుపల్లి ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నియమితులయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తులను ఆయన త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ ప్రస్తుత గవర్నర్ ని మార్చే అవకాశం ఉంటే, మోత్కుపల్లికే ఆ అవకాశం దక్కేలా చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేయవచ్చును.

gali vs kcr

జీతగాడుగా ఉన్న కేసీఆర్ స్టింగ్ ఆపరేషన్ చేస్తాడా... గాలి

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. నోటుకు ఓటు కేసులో స్టింగ్ ఆపరేషన్ చేసిన కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినోడే అని.. ఆవిషయం ఆయన మర్చిపోయినట్టు ఉన్నారని తిట్టిపోశారు. అసలు చంద్రబాబు దగ్గర జీతగాడుగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్లు సంపాదించారని విమర్శించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్ ఇప్పుడు నీతుల గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

revanth reddy

ముగిసిన రేవంత్ బెయిల్ గడువు.. రెండు గంటల ముందే జైలుకు

రేవంత్ రెడ్డి కూతురి నిశ్చితార్ధానికి గాను రేవంత్ కు ఇచ్చిన బెయిల్ గడువు ముగిసింది. రేవంత్ రెడ్డికి ఇంకా రెండు గంటలు సమయం ఉన్నప్పటికీ నగరం నుండి జైలు దూరంగా ఉండటం వలన.. ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అవుతుందని.. ఇచ్చిన గడువులోనే జైలుకు వెళ్లేందుకు ఆయన ముందే బయల్దేరారు. ఉదయం నుండి కూతురి నిశ్చితార్ధ కార్యక్రమంలో ఉన్న ఆయన చుట్టూ నిఘా ఉన్నా కూడా ముఖంలో ఎటువంటి భయం, ఆందోళన లేకుండా అందరిని చక్కగా నవ్వుకుంటూ పలకరించారు. తరువాత ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడ కొంతమంది కుటుంబసభ్యులు, నాయకులతో గడిపారు. అయితే సరిగ్గా నాలుగు గంటలకు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జైలుకు తరలించే వాహనంలోకి ఎక్కారు. ఆ వెంటనే ఎస్కార్ట్ సిబ్బందితో ఆయన చర్లపల్లి జైలుకు బయల్దేరారు.

AAP MLA Somnath Bharti

మరో వివాదంలో ఆప్

ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఆమధ్య లెప్టినెంట్ గవర్నర్ విషయంలో కొన్ని రోజుల పాటు వివాదాలు జరుగుతూ వచ్చాయి. అది ఎలాగూ ఒక కొలిక్కి వచ్చింది. మళ్లీ రెండురోజుల క్రితం నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో న్యాయశాఖమంత్రి జితేంద్రసింగ్ తోమర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారం ఇంకా ముగియకముందే మళ్లీ మరో వివాదంలో చిక్కుకుంది ఆప్ సర్కార్. ఎమ్మెల్యే సోమ్ నాధ్ భారతతిపై కేసు నమోదయింది. సోమ్ నాధ్ భారతి భార్య గృహసింహ కేసు కింద అతనిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నన్ను నా పిల్లలని నాభర్త టార్చర్ చేస్తున్నడని.. ఫిజికల్ గా.. మెంటల్ గా టార్చర్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

somireddy chandramohan reddy

మా కథ కాదు.. టీఆర్ఎస్ కథ ముగిసింది.. సోమిరెడ్డి

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ సర్కార్ పై, నేతలపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల తెదేపాకి కాని.. చంద్రబాబుకి కాని ఏ నష్టం రాదని మా కథ ముగిసిపోయిందని అనుకుంటున్నారేమో.. మాకథ కాదు టీఆర్ఎస్ కథే ముగిసిందని విమర్శించారు. టీఆర్ఎస్ నేతల్లా చంద్రబాబు అబద్ధం చెప్పలేదని.. చేసిన తప్పును సమర్ధించుకోవడానికే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పై కక్ష్య సాధించేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నిందని.. ఎదురుదాడి చేయలేక ఇలా దొంగదారిలో రేవంత్ ను ఇరికించారని అన్నారు. అందుకే రేవంత్ కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారనివ్యాఖ్యానిచారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేంద్రం

  ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయంపై సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే . సీఎం, మంత్రులు సహా మొత్తం 120 మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చంద్రబాబు మోడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు సమాచారం. అయితే ఏ శాఖ విచారణ చేపట్టాలి అనే విషయంపై త్వరలో స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ లేదా టెలీ కమ్యూనికేషన్లశాఖ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రధానికి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేసింది.

అంగరంగ వైభోగంగా రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్ధం

  తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ వివాహ నిశ్చితార్ధ వేడుక ఎటువంటి అవాంతరాలు లేకుండా అంగరంగ వైభోగంగా పూర్తయింది. హైదరాబాద్ యన్. కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ వేడుకకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 700మందిని మాత్రమే ఆహ్వానించగా, సినీ, రాజకీయ, పారిశ్రామిక, మీడియా రంగాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రముఖులు ఎటువంటి ఆహ్వానం లేకపోయినా తమంతట తామే తరలివచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించడం చాలా విశేషం. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ తదితరులు కుటుంబ సమేతంగా వచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించారు.   అదే విధంగా అనేకమంది కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన స్నేహితుడయిన రేవంత్ రెడ్డికి తను అండగా ఉంటానని, ఆయన నిరాపరధి అని తను నమ్ముతున్నానని అన్నారు. త్వరలోనే ఆయన తెలంగాణా ప్రభుత్వం పెట్టిన ఈ కేసుల నుండి బయటపడతారనే నమ్మకం తనకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు దంపతులు రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో దిగారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు తదితరులు ఆయనను ఆప్యాయంగా కౌగలించుకొన్నారు.   ఎసిబి అధికారులు ఆయనకు సమీపంలోనే తచ్చాడుతూ ఆయన ప్రతీ కదలికను, మాటను జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తుండటంతో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్దాన్ని ఎంతో సంతోషంగా చేస్తున్నప్పటికీ, ఆయన తిరిగి జైలుకి వెళ్లి పోవలసిన సమయం దగ్గర పడుతుండటంతో ఆయన కుటుంబ సభ్యులలో ఆందోళన కొట్టవచ్చినట్లు కనబడింది. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరినీ స్వయంగా ఆహ్వానించి మర్యాదలు చేసారు. కాకపోతే కోర్టు ఆంక్షలు మూలంగా ఆయన అందరితో క్లుప్తంగా పలకరింపులతోనే సరిపెట్టు కోవలసివచ్చింది. ఎటువంటి ఆహ్వానం లేకపోయినప్పటికీ అనేకమంది ప్రముఖులు వచ్చి తామందరం ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా ఉన్నామనే బలమయిన సంకేతం ఇవ్వగలిగారు.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రమాదం తృటిలో తప్పింది. వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన నిన్న రాత్రి బెంగుళూరు నుండి కావలికి బయలుదేరగా... ఇంతలో పెళ్లకూరు మండలం శిరసనంబేడు వద్దకు రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, వైఎస్ఆర్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బీదా రమేష్‌ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరుజిల్లా అపోలో ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీనితోపాటు కరివెనలో పైలాన్ ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిబొట్టు కోసం పాలమూరు తపిస్తోందని..నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. అంతేకాక పదిహేను రోజులకొకసారి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురవుతున్న తండావాసులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత కేసీఆర్ సాయంత్రం 6 గంటలకు భూత్పూర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.