రాహుల్ అపరిపక్వ రాజకీయాలు
- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
నేటి దేశ పార్లమెంటరీ వ్యవస్థలో శాసనవేదికలలో సభ్యులైన ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ పరిణామం పార్లమెంటరీ వ్యవస్థకే తీవ్రమైన అగ్నిపరీక్ష'' - గురుదాస్ గుప్తా (ప్రసిద్ధ పార్లమెంటేరియన్)
దేశ సంపదగా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రకటించిన రేడియోతరంగాలపై గుత్తాధిపత్యం చెలాయించడానికి దేశ, విదేశీ టెలికాం సంస్థలు పోటాపోటీలు పడుతూ భారతదేశ ఆర్ధికవ్యవస్థకు నష్టదాయకంగా పరిణమించి, స్వలాభాపేక్షతో లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేయడానికి సంబంధించిన భారీ కుంభకోణాన్ని "కాగ్''తో పాటు దేశం దృష్టికి తెచ్చినవాడు గురుదాస్ గుప్తా. ఇందులో ఇరుక్కున్న వాళ్ళు కేవలం బడాబడా కంపెనీలు మాత్రమేకాదు, ప్రధానమంత్రీ, ప్రధానమంత్రి కార్యాలయమూ, కేంద్రప్రభుత్వపు పెంపుడు కంపెనీగా బహిర్గతమైపోయిన అంబానీల "రిలయన్స్'' కూడా ఉన్నాయి; వీరికి తోడూ 2-జి స్కామ్ లో తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం, మాజీమంత్రి రాజా (డి.ఎం.కె), ఒక సిబీఐ ఉన్నతాధికారి కూడా ఉన్నారు!
అయితే ఈ కుంభకోణంలో అభియోగాల్ని విచారించే పేరిట నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అభియోగాల్ని ధృవీకరించగా, అదీ చాలదన్నట్టు "మంత్రుల పరిశీలనా సంఘాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినప్పుడు ఆ కమిటీ ముందుకు. అంతకుముందు పార్లమెంటరీ సంయుక్త సంఘం ముందుకువచ్చి ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తాను చేబుతాననీ, తనను పిలవాలనీ మాజీమంత్రి రాజా పదేపదే కోరారు. అయినా అతన్ని పిలవనేలేదు. అన్నీ "సర్దుకున్న తరువాత''నే ప్రధానమంత్రి కార్యాలయం గానీ, మన్మోహన్ సింగ్ గానీ అవసరమైతే "నేనూ సిబీఐ విచారణకు సిద్ధమే''నని 'దొంగలు పడిన ఆరునెలలకు' ఏవో మొత్తుకున్నట్టుగా ప్రకటనలు చేస్తూ వచ్చారు; చివరికి బొగ్గు కుంభకోణంలో వచ్చిన ఆరోపణల విషయంలో కూడా, రోజులకు రోజులు గడిచిపోయిన తరువాత, విదేశీ పర్యటనల తరువాత అంతా "సద్దుమణిగినట్టు'' కన్పించిన తరువాత విమాన ప్రయాణంలో మన్మోహన్ నేనూ విచారణకు సిద్ధమేనని ప్రకటించారు!
సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల ఫలితంగానే ప్రధానమంత్రి కార్యాలయానికీ "బొగ్గు'' తవ్వకాలలో ఉన్న కంపెనీల తాలూకూ కుంభకోణాలకూ ఉన్న సంబంధాన్ని సిబీఐ డైరెక్టర్ బయట పెట్టవలసి వచ్చింది. వీటన్నింటినీ గురుదాస్ గుప్తా బహిర్గతం చేశారు. అలాగే కాంగ్రెస్ - యు.పి.ఎ. ప్రభుత్వానికీ, "రిలయన్స్'' అంబానీలకూ కె.జి.గ్యాస్ తవ్వకాలు, "డి-6''బ్లాక్ లో ఉత్పత్తిని కృత్రిమంగా నియంత్రిస్తున్న [ఒప్పందాలకు విరుద్ధంగా] అంబానీల ఆగడాలకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా దేశప్రజల దృష్టికి తెచ్చినవాళ్ళు ప్రధానంగా ఇద్దరే ఇద్దరు - (1) ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2) గురుదాస్ గుప్తా!
ఈ పూర్వరంగంలో, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రేపటి ప్రధానమంత్రి పదవికోసం అర్రులుచాచి తన తల్లీ, కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధి అండతో, ఎదిగే క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా కాంగ్రెస్ అధిష్ఠానం "ప్రమోట్'' చేసిన రాహుల్ గాంధీ ఇటీవల తన రాజకీయ అపరిపక్వతను చాటుకొంటున్నాడు! ప్రధానమంత్రి పదవికి 2014 ఎన్నికల అనంతరం రావాలని ఆశపడుతున్న తొందర్లో రాహుల్, ఇటీవల ఆగమేఘాల మీద దొడ్డితోవన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్రతో వచ్చిన నేరచరితులైన పార్లమెంటు సభ్యులపై 'వేటు'ను తప్పించే ఆర్డినెన్సును బాహాటంగా "బుద్ధిలేని'' చర్యగా ఖండించాడు. అదీ ఎలా? అంతకుముందు సుప్రీంకోర్టు నేరచరితులైన లేజిస్లేటర్లు ప్రజాప్రనిధులుగా తగరనీ, వారంతా ఆరేళ్ళపాటు తిరిగి ఎన్నికలలో పాల్గొనరాదని చారిత్రాత్మకమైన తీర్పు చెప్పిన వెంటనే రాష్ట్రపతి లోపాయికారీగా క్యాబినెట్ చర్యతో విభేదిస్తూ నర్మగర్భంగా హెచ్చరించిన తరువాత ఆ విషయం తెలిసిన రాహుల్ గాంధీ 'మెరుపు'లా ఆ ఖ్యాతిని తాను కొట్టేసే దుడుకుతనంతో ఆర్డినెన్సు కాపీని ప్రదర్శనకోసం పత్రికలవారి ముందే చించేసి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఘోరంగా అవమానపరిచాడు!
అది చాలాక మన్మోహన్ ఏమనుకుంటారోనని తల్లీ, కొడుకులిద్దరూ విదేశపర్యటనలో ఉన్న మన్మోహన్ ను "దువ్వుతూ'' పుండుమీద కారంచల్లినట్టుగా 'వేరే, ఉద్దేశంతో అన్నవి కావు, పట్టించుకోవద్ద'ని బుజ్జగించడానికి ప్రయత్నించారు. సరిగ్గా ఆ అవమానానికి నిరసనగా మన్మోహన్ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసి, రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పదేళ్ళుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్న రాహుల్ తాను 50వ 'వడి'లో ప్రవేశించి, రేపటి ప్రధానమంత్రి పదవిని ఆశిస్తు, తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సందర్భంలో - పిల్లవాడి స్థాయికి మించి ఎదగలేకపోయాడని చెప్పి తీరాలి. ప్రకటనల్లో హుందాతనంగాని, వైజ్ఞానిక దృక్పధంగాని లేని వ్యక్తిగా లోకానికి రాహుల్ కనపడుతున్నాడని గుర్తుంచుకోవాలి; ఆ ప్రకటన ద్వారా రాహుల్ కాంగ్రెస్ లో ఎవడికివాడే "సూపర్ మాన్''గా ఫోజులు పెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రకటనలిచ్చు కోవచ్చునన్నలైసెన్సు ప్రకటించినట్టయింది.
మాజీమంత్రి శశిథారూ వెంటనే అంతమాటా అన్నాడు కూడా: "రాహుల్ అలా ప్రకటించిన తరువాత మా సొంత అభిప్రాయాల్ని మేమూ ప్రకటించుకోవచ్చునన్న ధైర్యం మాకొచ్చింద''న్నాడు! బహుశా తమ కుటుంబాల అక్రమాస్తుల రక్షణ కోసమే, లేదా అవినీతి పాలవుతున్న, లేదా గురుదాస్ గుప్తా అన్నట్టు "లెజిస్లేటర్ల రాజకీయ ప్రమాణాలు దిగజారి పోతున్నందు''ననే "సమాచారహక్కు చట్టం'' పరిథిలోకి కాంగ్రెస్ లాంటి (మిత్రపక్షాలు సహా) అవినీతికర రాజకీయ పక్షాలు రాకుండా జాగ్రత్తపడడం కోసమే తన పార్టీ ప్రభుత్వం ఎలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందో రాహుల్ కు తెలియదా? కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్, అనేక కుంభకోణాలతో, అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి 2014లో కూడా అధికారం కట్టపెట్టడానికి పన్నిన చిట్కా - కేవలం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రయోజనాల రక్షణ కోసం భావోద్రేకాల్ని రెచ్చగొట్టబోవటం. "ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంచితే, భారతీయ జనతాపార్టీ (బిజెపి) మాత్రం ప్రజల్ని విడగొడుతున్నద''ని రాహుల్ ప్రచార ఆరోపణ!
కాని 1947 నాటి రాజ్యాంగ నిర్ణయ సభా తీర్మాన స్ఫూర్తికే ఈ రెండుపక్షాలూ (కాంగ్రెస్, బిజెపి) వ్యతిరేకం. కులాతీతమైన లౌకిక వ్యవస్థకు (సెక్యులరిజం) దేశ రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, మతసంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని నాటి రాజ్యాంగ నిర్ణయసభ తీర్మానం! ఆ ప్రాతిపదికపైనే స్వతంత్ర భారతదేశంలో ఈ రెండుపార్టీలు ఎన్నికల సంఘం ముందు హామీపడ్డాయి. కాని ఆచరణలో దేశ మైనారిటీల మౌలిక ప్రయోజనాలను ఆచరణలో కాపాడకుండానే ఎన్నికలలో మాత్రం వారి వోట్ల ద్వారా లబ్ది పొందడం మాత్రమే ఈ రెండు పార్టీల లక్ష్యం! అందువల్ల ప్రజల్ని తమతమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం చీల్చుతూ ఉండటం ఈ రెండింటి వకాలికమైన లక్షణం. "విభజన రాజకీయాలు'' రెండింటి ఉమ్మడి ప్రయోజనాలకు, ఉనికికి అవసరం! ఈ తప్పుడు "విభజన సూత్రం'' దేశ విభజనతో పాటే ప్రాణం పోసుకుంది. విభజించి పాలించమనే ఇండియాలో బ్రిటీష సామ్రాజ్య పాలనతోనే అమలులోకి రాగా, విభజన రాజకీయాలనుంచి తాము ఎన్నికల ప్రయోజనాల కోసం దూరం కాకుడన్నది కాంగ్రెస్, బిజేపీ మౌలికమైన విధాన, వ్యూహాలని మరచిపోరాదు!
ప్రస్తుతం రానున్న ఎన్నికలకు మధ్యంతరంగా ఎన్నికలకు సిద్ధమైన కొన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్న రాహుల్ చేస్తున్న ప్రసంగాలు పిల్ల తరహాగా ఉన్నాయి. కాంగ్రెస్ లోని మహామహా కొమ్ములు తిరిగి ఉన్న వివిధ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులలో నూటికి 90 మందికి పైగా నెహ్రూ - ఇందిర కుటుంబానికి తమ ఆత్మగౌరవాన్ని కూడా మరిచిపోయి సోనియా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ కు ఆమె కుటుంబానికే విచక్షణా రహితంగా దాసోహమవడం వల్లనే మంచి యువతరం, యువరక్తం కాంగ్రెస్ వైపునకు మరలడంలేదు. మరలనందున నాయకత్వం చేస్తున్న పనేమిటి? సెంటిమెంట్ ను (మనోభావాల్ని) పోగొట్టుకోవటం; ఆ వరసలో రాహుల్ ఉచ్చరించిన సంప్రదాయమంత్రం - "నా నాయనమ్మను, నా తండ్రిని చంపేశారు. ఏదో ఒకరోజున నన్నూ చంపేస్తారు. అయినా నేను బాధపడ్డం లేదు, కంగారు పడ్డమూ లేదు అన్నాడు!''
కాని నాయనమ్మ హత్యగానీ నాన్న రాజీవ్'' హత్యకు గానీ దోహదపడిన పరిణామాలేవీ? ఏ పరిస్థితుల్లో ఆ ఘోరాలు జరిగాయి? చిరకాలంగా కాంగ్రెస్ కు సేవలందించిన బింద్రెన్ వాలా [శిక్కు]ను సాకింది కాంగ్రెస్ పెంచి పోషించింది కాంగ్రెస్. కాని పంజాబ్ ను కృత్రిమంగా విభజించిన తరువాత ఎదురైనా సమస్యల్లో ఒకటి బింద్రెన్ వాలా కాంగ్రెస్ కు దూరమయి పంజాబ్ శిక్కులకు ప్రత్యేక రాష్ట్రంగా 'ఖలిస్తాన్'ను ప్రకటించాలని ఉద్యమం ప్రారంభించాడు. అది హింసాత్మకంగా పరిణమించింది. పంజాబ్ విభజన ఎప్పుడైతే పంజాబ్ శాసనసభ ఆమోదం లేకుండా, శాసనసభను లెక్కజేయకుండా ఏకపక్షంగా రెండుగా పంజాబ్, హర్యానాలుగా చీల్చడానికి కాంగ్రెస్ ఎప్పుడు నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచీ పంజాబీల (శిక్కుల) ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అలాగే బిజెపి - ఎన్.డి.ఎ. ప్రభుత్వం హయాములో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లను కృత్రిమంగా విభజించి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలను ఏర్పరిచారు! వాటిని దేశ, విదేశీ బడా గుత్తా పెట్టుబడిదారులకు దోపిడీ కేంద్రంగా బిజెపి, కాంగ్రెస్ లు మార్చాయి!
రాజస్థాన్ ఎన్నికల పర్యటనలో మాట్లాడుతూ రాహుల్ "ప్రజలు సమైక్యంగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాని బిజెపియే రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని విడగొడుతుంద''ని ఆరోపించారు. కాని అవే రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కూడా పనిచేస్తుందన్న వాస్తవాన్ని రాహుల్ మభ్యపెట్టాడు. దేశం ఐక్యంగా ఉండాలని ఒక వైపున కోరుకుంటున్న రాహుల్, విభజించి-పాలించే బ్రిటీష రాజనీతికి తలొగ్గిన కాంగ్రెస్ అదే స్వప్రయోజనాల కోసం, తాను సాధికారికంగానే భాషకు ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వెన్నుదన్నుగా ఏర్పడిన తొలి కమీషన్ (ఫజల్ ఆలీ) సిఫారసులపైన ఏర్పడిన భాషా ప్రయుక్తంగా ఏర్పడిన తెలుగుజాతి తొలి రాష్ట్రమయిన "ఆంధ్రప్రదేశ్''ను నిట్టనిలువునా చీల్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు కంకణం కట్టుకున్నదో వివరించ గలగాలి!
ఇందిరాగాంధి పోలీసు - సైనిక సమూహాలతో "ఆపరేషన్ బ్లూస్టార్'' పేరిట దారుణమైన దాడులకు ఖలిస్తాన్ వాదుల మీద పాల్పడడం ద్వారా శిక్కులు అసహనంతో ఉగ్రవాదులుగా మారి ఎదురు మరొక దుస్సాహమైన దుర్మార్గానికి దిగింది. ఫలితంగా ఆమెను సొంత రక్షకులే హత్యగావించారు! దానికి ప్రతిగా ఢిల్లీలో ఇందిరాగాంధి హత్యతో ప్రత్యక్ష సంబంధం లేని 3000 మంది శిక్కులను హతమార్చడం జరిగింది. వేసిన విచారణ కమీషన్ లు కూడా ఈ ఘటనకు విస్తుపోయి, ఈ ప్రతీకార ఘటనలకు ఎవరు కారకులో, వారిని శిల్శించాలని పేర్లుసహా యిచ్చినా, శిక్కుల గాథ ముగియలేదు. ముగియలేదు కనుకనా, ఢిల్లీలో శిక్కులపై జరిగిన మారణకాండతో సోనియాకు గానీ, రాజీవ్ గాంధీకి గాని సంబంధం లేకపోయినా,ఇటీవల వైద్యచికిత్సల నిమిత్తం అమెరికా వెళ్ళిన తన తల్లి (సోనియా) అక్కడి ఖలిస్తాన్ శిక్కుసంస్థలు అమెరికా కోర్టుల ద్వారా ఆసుపత్రికి వెళ్ళి మరీ "సమాన్లు''జారీ చేయించాయి! అలాగే మాజీప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన దారుణ హత్యకూ, శ్రీలంకలో తమిళులపై శ్రీలంక ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధకాండకు అండగా భారత సైన్యం వెన్నుదన్నుగా వెళ్ళి నిలబడడానికీ సంబంధం ఉందని, శ్రీలంకలో మన సైనికజోక్యం లేకపోతే రాజీవ్ మనకి దక్కేవాడనీ పలువురు వ్యాఖ్యాతలు ఆ రోజుల్లో పేర్కొనడమూ కొత్తగాదు.
అందువల్ల మనం స్వతంత్రమైన విధానాలకు లక్ష్యాలకూ దూరమవుతున్న కారణంగానే అమెరికా విసిరిన "సంస్కరణల''వలలోకి మనం చిక్కుబడి పోయిన కారణంగానే, ఇరుగుపోరుగుతో సంబంధాలు 65ఏళ్ళ తర్వాత కూడా కుడుతపడకుండా ఉన్నందున కూడా - దేశానికి చిక్కు సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా గమనిస్తే మంచిది! అందువల్ల రాహుల్ అనవసర భయాలు తనలో పెట్టుకుని, సెంటిమెంట్ కోసం చౌకబారు ప్రకటనలు చేయకూడదు. హుందాతనం గల రాజకీయవేత్తగా ఆయన ఎదగాలని కోరుకుందాం! ఉన్మాదులకు తోడ్పడే "సెంటిమెంటల్ ఉప్పును'' అందించకూడదు! రాహుల్ చిరంజీవిగా ఉండాలన్న కోర్కె తప్ప మరొకటి దేశప్రజలకు ఉండదు గాక ఉండదు. నిజానికి గాంధీజీని చంపినవాడు నాధూరామ్ గాడ్సే అనే పరమ హిందూమతోన్మాది, నేటి బిజెపి పూర్వపు 'బ్రాండ్' అయిన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తే అయినా, గాంధీజీ ఆదర్శాలను అనుక్షణమూ 'పాతరేస్తున్న'వారు మాత్రం అవినీతి గోదాలోకి పీకమొయ్యా దిగిపోయిన నేటి కాంగ్రెస్ నాయకులేనని రాహుల్ గుర్తించితే, దేశ సమస్యలకు పరిష్కారం చూడగల్గవచ్చునేమో!