మూత్రం పోసినందుకు లక్ష జరిమానా..
మద్యం మత్తులో విమానంలో మూత్ర విసర్జన చేసి లక్ష రూపాయల ఫైన్ కట్టాడు ఓ ప్రయాణికుడు. జిను అబ్రహం అనే వ్యక్తి ఇండియా నుంచి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాడు. అయితే ప్రయాణంలో ఆయన మద్యం సేవించి బాగా ఊగిపోయాడు. అంతేకాదు తాగేసి సీట్లో నుండి లేచి గలాటా చేస్తుండగా సీట్లోకి వెళ్లి కూర్చోమని సిబ్బంది ఎంత కోరినా పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా.. విమానం మరో అరగంటలో ల్యాండ్ అవుతుందనగా ప్యాంటు తీసేసి.. విమానం ఫ్లోర్ మీద, సీటు మీద మూత్రం పోసేశాడు. దీంతో అతనిపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికి సంకెళ్లు వేసి.. సీట్ బెల్టులతో కుర్చీకి కట్టేశారు. తరువాత విమానం ల్యాండ్ అయిన తరువాత అతనిని కోర్టులో హాజరు పరచగా అతడికి 300 పౌండ్ల జరిమానా విధించింది. దాంతోపాటు పరిహారం కింద మరో 500 పౌండ్లు, ఖర్చుల కింద 185 పౌండ్లు, బాధితుల సర్‌చార్జిగా 30 పౌండ్లు.. అంటే దాదాపు లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పారు.
అయితే ఆ ప్రయాణికుడు మాత్రం తాను యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నానని, రెండు పెగ్గుల విస్కీ తీసుకున్నానని, ఏం చేశానో తనకు గుర్తులేదని అబ్రహం కోర్టులో చెప్పాడు.