థర్డ్ అంపైర్ ను బూతులు తిట్టిన కుర్ర బౌలర్
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎంత నోటిదురుసో క్రికెట్ ప్రపంచానికి తెలియంది కాదు. తాజాగా, దాన్ని నిరూపిస్తూ మరో సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ కు మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్, థర్డ్ ఎంపైర్ ను బూతులు తిట్టాడు. నాలుగో రోజు ఆటలో బౌలింగ్ కు వచ్చిన హేజిల్ వుడ్ న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కు యార్కర్ వేశాడు. నేరుగా కాలికి తగిలినట్టుగా అనిపించడంతో, ఎంపైర్ కు అప్పీల్ చేశారు. అందుకు ఎంపైర్ నాటౌట్ ప్రకటించడంతో, రివ్యూ అడిగాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్. రివ్యూలో స్పష్టంగా బంతి బ్యాట్ ను తాకి వెళ్తోందని తేలింది. దీంతో థర్డ్ ఎంపైర్ కూడా నాటౌట్ ఇచ్చాడు. అది చూసి హాజిల్ వుడ్ ఫీల్డ్ అంపైర్ వద్దకు వచ్చి, హూ ద ... ఈజ్ థర్డ్ అంపైర్ అంటూ బూతులు తిట్టాడు.
ఇది స్టంప్ మైక్ లో రికార్డ్ అవడంతో, కామెంటేటర్లు, టీవీ చూసేవాళ్లు ఖంగు తిన్నారు. ఈ సంఘటనతో మ్యాచ్ రిఫరీ హేజిల్ వుడ్ కు, కెప్టెన్ స్మిత్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించాడు. ఎంపైర్ నిర్ణయాన్ని పదే పదే ప్రశ్నించడంతో స్మిత్ కు కూడా కోత పడింది. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 370 చేస్తే, ఆస్ట్రేలియా 505 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 335 పరుగులకు ఆలౌట్ అయి ఆస్ట్రేలియాకు 201 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇవ్వగలిగింది. చివరి రోజైన రేపు, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా మ్యాచ్ గెలవడం లాంఛనమే..రిటైర్ మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్ కు ఇదే చివరి మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే..ఈ మ్యాచ్ గెలిస్తే, ఆస్ట్రేలియా టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.