పవన్, కిరణ్ లది ఒకటే పార్టీ?

      రాజమండ్రి సభలో తాజా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ పేరును జై సమైక్యాంధ్రగా ప్రకటించారు. నోవాటెల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ నామకరణోత్సవం నిర్వహించారు. జనసేన పేరును అధికారికంగా ప్రకటించారు. కొత్తగా పెట్టిన ఈ రెండు పార్టీల పేర్లు ఇంగ్లీష్ షార్ట్ ఫార్మ్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (jsp), జనసేన పార్టీ (jsp) లుగా ఉచ్చరించాల్సినవే. తెలుగు పొట్టి పేర్లలో జైసపా, జైసేపా లుగా స్థిరపడి చిన్న తేడా రెండింటి మధ్య కనిపిస్తుంది. పేరులోనే కాకుండా తీరులోనూ ఈ రెండు పార్టీలకు చాలా పోలికలున్నాయి. కాంగ్రెస్ డిల్లీ పెద్దలపై ఆగ్రహంతోనూ, విభజన తీరును వ్యతిరేకిస్తూ  కిరణ్, పవన్ లు కొత్త పార్టీలను పెట్టారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర హక్కులు గురించి ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు, మార్చి నెలలోనే రెండు పార్టీలు ఆవిర్భవించాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని కిరణ్కుమార్ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అభిమానించడం కొసమెరుపు.

డిగ్గీకి విభజన వర్తించదా?

      ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు-2014 ను ఉభయ సభలు ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదముద్ర పడడం అయిపోయింది. వాటాలు, కోటాలు, పంపకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ల అపాయింటెడ్ తేదీ కూడా జూన్ 2 గా నిర్ణయించేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, విపక్షాలతో కుమ్మక్కు అవ్వాల్సి వచ్చినా రాజీ పడని కాంగ్రెస్.. ఇచ్చిన మాటకు కట్టుబడి విభజన చేసేసింది. తమ పార్టీకి కూడా రెండు కార్యవర్గాలను ప్రకటించేసింది.   తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పొన్నాల, అవశేష ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డితో ఇరుప్రాంతాలకు ఎన్నికల, పార్టీ కార్యవర్గాలను కూడా నియమించింది. పట్టు పట్టి రాష్ట్రాన్ని విడగొట్టిన డిగ్గీ రాజా మాత్రం రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా పనులు చక్కబెట్టేస్తున్నాడు. తెలంగాణలో హామీలు సీమాంధ్ర కు పనికి రావు. సీమాంధ్ర కంటి తుడుపు ప్యాకేజీ మాటలకు  తెలంగాణాలో ఓట్లు రాలవు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు ఇంచార్జ్ లను నియమిస్తే బాగుంటుందని సీమాంధ్ర  కాంగ్రెస్ లో మిగిలిన నాయకులు తమ ఆంతరంగిక చర్చల్లో ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి జైరాం రమేష్  చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూడ్చలేని నష్టాన్ని చేశాయని వాపోతున్నారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, ఒక పీసీసీని రెండుగా విభజించేశారు. మరి ఇంచార్జ్ గా ఒక్క డిగ్గీ రాజానే ఎందుకు కొనసాగిస్తున్నారో అర్ధం కావడం లేదని, తమ చేతలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు ప్రాంతాల నేతల్ని ఇరుకున పెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియమ్మా విభజన మాకే కాదు.. డిగ్గీరాజా లాంటి ఇంచార్జ్ లకు కూడా వర్తింపజేయమ్మ అని వేడుకుంటున్నారు.

జగన్ కు డీఎన్ఏ పరీక్ష?

      "రావుగారు మీరేం అనుకోనంటే ఒక మాటంటాను. మీకు కొంచెం.. నోటి దూల ఎక్కువే" ఢీ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న డిగ్గీ రాజా.. అదేనండి మన దిగ్విజయ్ సింగ్ గారు కూడా సేమ్ టు సేమ్ రావుగారి టైపే ..అలాగని ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది అనడు. అరిగిపోయిన రికార్డుల్లాగా కొన్నింటిని రిపీట్ చేస్తుంటాడంతే. అందులో మొదటిది అన్ని పార్టీలు అంగీకరించాకే రాష్ట్రాన్ని విభజించాం. రెండోది తెలంగాణా ఇస్తే తెరాస ను కాంగ్రెస్ లో కేసీయార్ విలీనం చేస్తామన్నారు. ముచ్చటైన మూడోది జగన్ ది కాంగ్రెస్ డీఎన్ఏ.   మొదటిది నిజమే, రెండోది నిజమే.. మూడోది కూడా దిగ్విజయ్ నిజమేనంటారు. ఎవరికైనా అనుమానం ఉంటే, కాంగ్రెస్ జెండాకు, వైసీపీ జెండాకు డీఎన్ఏ పరీక్ష చేసుకోమంటాడు. మరో వైపు పిల్ల కాంగ్రెస్, ఎన్నికల తరువాత తల్లి కాంగ్రెస్ లో కలిసి పోవడం ఖాయం అంటూ చంద్రబాబు వూరు వాడా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఊతం ఇచ్చేలా డీఎన్ఏ మాట మాననంటున్నాడు దిగ్విజయ్ సింగ్. కొట్టినా, తిట్టినా డిగ్గీరాజా డీఎన్ఏ మాట మీదే నిలబడినప్పుడు మాట తప్పని జగన్ కాంగ్రెస్ పెద్దలకు ఏం మాట ఇచ్చారోనని ప్రజలు గుసుగుసలాడుకుంటున్నారు. మడమ తిప్పని మహానేత తనయుడు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమై విశ్వసనీయత నిలుపుకోవాలని కోరుతున్నారు  వైసీపీ కార్యకర్తలు.  

కమలం వైపే జనాభిప్రాయం

      రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ హవా ఉంటుందని.. ఆ పార్టీ అత్యధికంగా 195 సీట్లు గెలుచుకుంటుందని తమ తాజా ఎన్నికల సర్వేలో వెల్లడయిందని ఎన్‌డీటీవీ తెలిపింది. హంసా రీసెర్చ్ గ్రూప్‌తో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం.. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 229 సీట్లు లభిస్తాయని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీకి 43 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. ఇక అధికార యూపీఏ సారథి కాంగ్రెస్ పార్టీ బలం సగానికి సగం పడిపోయి 106 సీట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. యూపీఏకు మొత్తంగా 129 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే చెప్తున్నట్లు వెల్లడించింది. వామపక్షాలతో కూడిన ప్రత్యామ్నాయ కూటమికి కేవలం 55 సీట్లు వస్తే, ఇతర పార్టీలన్నిటికీ కలిపి 130 సీట్లు వస్తాయని పేర్కొంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 350 నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా ప్రజలను సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వివరించింది.

తెలంగాణాలో టీఆర్‌ఎస్ పైచేయి

        తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా దెబ్బతింటుందని ఎన్‌డీటీవీ సర్వే చెబుతోంది. ఇక్కడ మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో 11 సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది. ఇది గతం కన్నా 9 సీట్లు ఎక్కువ. తెలంగాణా ప్రకటించిన కాంగ్రెస్‌కు కేవలం 5 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వే తెలిపింది. సీమాంధ్రలో కాంగ్రెస్ కు ఒక్కటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మట్టికరవనుందని ఎన్‌డీటీవీ సర్వే స్పష్టంచేస్తోంది. ప్రస్తుత లోక్‌సభలో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు 21 సీట్లు ఉంటే.. ఇప్పుడు ఒక్క సీటుకే పరిమితమవుతుందని సర్వే చెప్తోంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అలాగే.. టీడీపీ-బీజేపీ కూటమికి 9 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది.

ఎర్రబెల్లి ఏం చేస్తారో?

      తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజకీయ పయనంపై కొనసాగుతున్న చర్చకు ఒకటిరెండు రోజుల్లో తెరపడే అవకాశం కనపిస్తోంది. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎర్రబెల్లి ఆ పార్టీని వీడుతారా... అందులోనే కొనసాగుతారా అనే అంశంపై శనివారం స్పష్టత వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణా కమిటీ ఏర్పాటు చేసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ఉంటుందా లేదా అనే విషయం శనివారం తేలుతుందని ఎర్రబెల్లి అనుచరులు చెబుతున్నారు.   కానీ, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకోవద్దంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం పెట్టి మరీ దయాకర్‌ రావును కాంగ్రెస్‌ లోకి రానివ్వబోమని ప్రకటించారు. శుక్రవారం ఏకంగా నియోజకర్గంలోని ముఖ్యనేతలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ను, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి.. దయాకర్‌ రావును పార్టీలోకి తీసుకోవద్దని కోరారు.

హస్తానికి చెయ్యిచ్చిన నందీశ్వర్?

      కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి ‘చెయ్యి‘ ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడు. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్‌ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసి డీఎస్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డీఎస్ స్వయంగా ఫోన్ చేసినా రెండ్రోజుల నుంచి స్పందించడం లేదని సమాచారం.

బాబోయ్.. రేణుక మాకొద్దు

      ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందింది. రేణుకపై ఫిర్యాదు అనగానే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులే చేసి ఉంటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఈసారి ఆ అవకాశాన్ని ఇతర జిల్లాల నాయకులు తీసుకున్నారు. మేడమ్ మాకొద్దు అంటూ ఇతర జిల్లాలకు చెందిన ఎంపీలు పార్టీ అధినేత్రికి లేఖ రాశారు.   రానున్న సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటీవలే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంపీ రేణుకాచౌదరికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 23 మంది  సభ్యులున్న ఈ కమిటీలో రేణుకకు స్థానం కల్పించడాన్ని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లకు పొన్నం ప్రభాకర్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణా ఉద్యమాన్ని, ఈ ప్రాంత ప్రజల పోరాటాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేణుకకు తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఎలా స్థానం కల్పిస్తారని ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్ సమక్షంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది.

అమెరికా టు అమలాపురం.. ఆపై నామినేషన్

      రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఏకంగా అమెరికా నుంచి విమానంలో వచ్చి మరీ హాజరు వేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ సంఘటన జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పట్టణ మహిళా కన్వీనర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిట్టకవి వెంకటనర్సమాంబ (అమ్మాజీ) కొన్ని నెలల క్రితమే అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అమ్మాజీని 23వ వార్డు నుంచి పోటీ చేయించాలని పట్టణ పార్టీ శాఖ నిర్ణయించింది. ఈ సమాచారాన్ని ఆమెకు అందజేశారు. వాస్తవానికి అమ్మాజీ ఈనెల 18న స్వదేశానికి రావడానికి విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈలోపే పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో ఆగమేఘాల మీద ముందే విమానం ఎక్కాల్సి వచ్చింది. అలా వచ్చేసి, ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

కోర్టుకెళ్లిన నన్నపనేని.. వారంటు రద్దు

  టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి శుక్రవారం పర్చూరు కోర్టుకు హాజరయ్యాయి. 2009 జులై నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అక్రమంగా కేసు బనాయించారని పేర్కొంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. కమిటీ విచారణ చేపట్టే సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తనపై దాడి జరిగినట్లు నన్నపనేని రాజకుమారి కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పిటీషనర్‌గా ఉన్న రాజకుమారి విచారణకు హాజరై సాక్ష్యం చెప్పనందున న్యాయమూర్తి బెయిలబుల్ వారంటు జారీచేశారు. దీంతో శుక్రవారం ఆమె కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా వారంటు రద్దుకు పిటీషన్ వేయించి కోర్టులో సాక్ష్యం చెప్పారు. వాదనలు విన్న సీనియర్ సివిల్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు బెయిల్‌బుల్ వారంటు రద్దు చేస్తూ తీర్పుచెప్పారు.

సిక్కోలులో శిథిల హస్తం

  శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఏకంగా మూడు చోట్ల అత్యధిక వార్డుల్లో నామినేషన్లు వేయలేని దుస్థితిలో పడిపోయింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 91 వార్డులుండగా, వాటిలోని 31 వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. ఇచ్ఛాపురంలో 6 వార్డుల్లోను, పలాస-కాశీబుగ్గలో 9చోట్ల, ఆమదాలవలసలో మూడు వార్డుల్లోను, పాలకొండ నగర పంచాయతీలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. వీటిలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోవే. గతంలో ఇదే కాంగ్రెస్ తరపున వార్డు స్థానాల కోసం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో వివాదాలు, గొడవలు జరిగాయి. టికెట్ల కోసం దాదాపు కొట్టుకున్నారు.

పాలమూరుపై జైపాల్ కన్ను

  తెలంగాణా ఏర్పాటు తర్వాతి నుంచి కాస్త గట్టిగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సేఫ్ సీటుపై కన్నేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఎదురుగాలి వీస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలు తన గెలుపుపై ప్రభావం చూపుతాయనే ఆందోళనతోనే ఆయన సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు చేవెళ్లలో పర్యటించలేదని, మహబూబ్‌నగర్‌లో జైపాల్ వర్గం కొంతకాలంగా క్రియాశీలకంగా మారిందని అంటున్నారు. తన అనుచరుడైన ఉద్దమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకుంటున్న జైపాల్‌రెడ్డి... సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఇప్పించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తద్వారా అటు సబిత వర్గం మీద పైచేయి సాధించడంతో పాటు తన అనుయాయుడికి మేడ్చల్ టికెట్ ఇప్పించుకోవచ్చన్నది జైపాల్ ద్విముఖ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పలమనేరు తెరపైకి డీఏ శ్రీనివాస్

  పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో కొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్ పేరు దాదాపుగా ఖాయమని అనుకుంటుండగా, తాజాగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా చిత్తూరు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవులునాయుడు కుమారుడు డీఏ.శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.   ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి టీజీ.వెంకటేష్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్టు ఖరారైంది. ఈయన కూడా వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో రాయలసీమలోనే వారికి రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేనందున పలమనేరు నుంచి వేరే సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గానికి సంబంధించి సుమారు 25 వేల ఓట్లు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి టికెట్టు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.

గన్నవరానికి నెహ్రూ?

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేయటానికి సుముఖంగా ఉన్నారు. విజయవాడ నగరానికి దగ్గర్లో ఖాళీగా ఉన్న గన్నవరం నియోజకవర్గం నుంచి నెహ్రూను పోటీ చేయించటానికి సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం.   శనివారం నున్నలో విజయవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని నెహ్రూ ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న ముఖ్య కాంగ్రెస్ నాయకులను కూడా నున్నలో జరిగే సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో దిక్కు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కొండంత అండలా కనిపిస్తున్నారు.

కాసేపట్లో వేదికపైకి రానున్న పవన్

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో సభ వేదికపైకి వచ్చి కొత్త పార్టీ, విధి విధానాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే హైటెక్స్ కు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. వేదిక వద్ద జనసేన పార్టీకి సంబంధించిన విడియో గీతాలను ప్రదర్శిస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. కేవలం నాలుగు వేల మందికే పాస్ లు జారీ చేయడంతో..మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు.