ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ ఎవరు బద్ధలుగొడతారో తెలుసా..?
క్రికెటర్ కు నిజమైన పరీక్ష టెస్ట్ మ్యాచ్. ఓపికతో, కంటికి, చేతికి సమన్వయంతో, గంటల తరబడి అలిసిపోకుండా క్రీజు లో నుంచుని, జాగ్రత్తగా గోడ కట్టినంత అందంగా ఇన్నింగ్స్ నిర్మించడమంటే మాటలు కాదు. అందుకే బ్యాట్స్ మెన్ గొప్పోడో కాదో నన్నది, టెస్ట్ మ్యాచ్ ల బట్టి నిర్ణయిస్తారు క్రికెట్ పండితులు. కానీ ఈ సూత్రాలు కొంత మందికి వర్తించవు. వివియన్ రిచర్డ్స్, క్రిస్ గేల్, ఎబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్ కల్లం, సెహ్వాగ్ లాంటి వాళ్లెవ్వరూ ఇలా గోడ కట్టినట్టు ఇన్నింగ్స్ నిర్మించరు. వీళ్లందరూ ఆత్మరక్షణ కంటే, ప్రత్యర్ధి గోడను బద్ధలుగొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే వీళ్లకు బౌలింగ్ చేయడానికి ప్రపంచంలోని ఏ బౌలర్ అయినా భయపడేవాడు, భయపడతాడు.
లేటెస్ట్ గా తన చివరి టెస్ట్ లో మెక్ కల్లమ్ వీర బాదుడు బాది, వివియన్ రిచర్డ్స్ మీదున్న రికార్డును తను లాగేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే శతకబాదాడు. రికార్డ్స్ ఉన్నవి బద్ధలవడానికే. మరి నెక్స్ట్ మెక్ కల్లమ్ రికార్డ్ ను బద్ధలు గొట్టే వీరుడెవరు..? ఇదే విషయాన్ని రైనాను అడిగితే, భారతీయుడే బద్ధలు గొట్టాలని కోరుకుంటున్నానన్నాడు. మరి మన టీంలో ఆ రికార్డ్ బద్ధలు గొట్టే అవకాశం ఎవరికుందో తెలుసా..?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్..ప్రస్తుతం ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో ఈ ముగ్గరికే ఆ రికార్డును కొట్టే అవకాశం ఉంది. రైనా టెస్టుల్లో లేడు. ఇప్పుడు అండర్ 19 మ్యాచ్ ల్లో ఇరగదీస్తున్న కుర్రాళ్లలో భవిష్యత్ టెస్ట్ ప్లేయర్ గా మారే ఎవరికైనా కూడా ఆ ఛాన్స్ లేకపోలేదు. టి 20 క్రికెట్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో, ఆ రికార్డు ఎంతో కాలం నిలిచి ఉండదనేది మాత్రం వాస్తవం.