జగన్ కు పోలీసులు రెడ్‌కార్పెట్‌: సోమిరెడ్డి

      బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్‌ను పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్థుడు జగన్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. జగన్‌కు గవర్నర్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విమర్శించారు.   పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారని, ఇలా చేస్తే సాక్షుల భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు బలహీనమతోందన్నారు. కాంగ్రెస్, జగన్, కేసీఆర్ ఒక టీం అని, అందుకే జగన్‌ను కేసీఆర్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ మంచి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని సోమిరెడ్డి తెలిపారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందన్నారు. జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాహుల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక రాహుల్ ప్రధాని పదవి చేపట్టేందుకు భయపడ్డారని సోమిరెడ్ది ఎద్దేవా చేశారు.  

బ్లాక్ బెర్రీని కాపాడిన హైదరాబాదీ

  ప్రపంచ ప్రసిద్ది చెందిన బ్లాక్ బెర్రీ మొబైల్ ఫోన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆ ఫోన్ తయారీ సంస్థ పీకల్లోతు ఆర్ధిక సమస్యలలో కూరుకుపోవడంతో వందలాది ఉద్యోగులను తొలగించే పరిస్థితి కూడా ఏర్పడింది.   కష్టాలలో మునిగున్న బ్లాక్ బెర్రీని హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు చెందిన పూర్వ విద్యార్ధి ప్రేమ్ వత్స ఆదుకొన్నారు. ప్రస్తుతం కెనడా దేశంలో స్థిరపడిన ఆయన ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ అనే సంస్థకు ముఖ్యకార్యనిర్వకుడు (సీ.ఈ.ఓ) మరియు అధిపతిగా ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ బెర్రీ సంస్థలో ఆయన సంస్థ ప్రధాన షేర్ హోల్డర్ కూడా. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు కష్టకాలంలోఉండటంతో ఆయన ఆ సంస్థను కొనుగోలు చేసారు. ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ మరియు బ్లాక్ బెర్రీ సంస్థలు ఈ ఒప్పందంపై ఇటీవలే సంతకాలు చేసారు.   ఒక భారతీయుడు బ్లాక్ బెర్రీ వంటి ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒక ప్రముఖ సంస్థను ఆదుకొని దాని బాధ్యతలు స్వీకరించడం ప్రజలందరికీ గర్వ కారణం. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బోర్డు సభ్యులలో ఒకరయిన ఫయీజ్ ఖాన్ ఇందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. ఈ డిశంబర్ నెలలో జరగనున్న తమ కళాశాల 90వవార్షికోత్సవ వేడుకలకు హాజరవనున్న ప్రేమ్ వత్స రాక కోసం తామంతా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని అన్నారు.   ప్రేమ్ వత్స తండ్రి యంసీ. వత్స గతంలో అదే కళాశాలలో వైస్ ప్రినిసిపాల్ గా, ప్రినిసిపాల్ గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత కుటుంబముతో సహా కెనడా వెళ్లి స్థిర పడిపోయారు. ప్రేమ్ వత్ససోదరి ఒకామె హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని వివాహమాడారు. కానీ వారు కూడా ఆ తరువాత కెనడాకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు.

జగన్ తో సచివాలయ సీమంధ్ర ఉద్యోగుల సమావేశం

  దాదాపు రెండు నెలలుగా మహోదృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకతో మరో కొత్త మలుపు తిరుగనున్నాయా? అంటే అవుననే చెప్పవచ్చును. దాదాపు నెల రోజులుగా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కొద్ది సేపటి క్రితమే అతను నివసించే లోటస్ పాండ్ వద్దకు చేరుకొన్నట్లు తాజా సమాచారం. వారు తమ ఉద్యమానికి, సమ్మెకి అతని మద్దతు కోరేందుకు వెళ్ళినట్లు సమాచారం.   ఇంతవరకు వైకాపాతో సహా అన్ని రాజకీయ పార్టీలను దూరంగా ఉంచిన సీమాంద్రా ఉద్యోగులు, మొట్ట మొదటిసారిగా వారంతట వారే జగన్ మద్దతు కోరుతూ అతనిని కలవలనుకోవడంతో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త మలుపు తీసుకోబోతోందని స్పష్టం చేస్తోంది.   ఈ విషయం గురించి సచివాలయ ఉద్యోగులు ముందుగానే ఏపీయన్జీవోల నేతల చర్చించి వారి అనుమతితోనే జగన్ కలిసేందుకు వెళ్లి ఉంటారని భావించవలసి ఉంటుంది. అదే జరిగితే, త్వరలో ఉద్యమం ఉద్యోగుల చేతిలోంచి వైకాపా చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ముందుగా తెదేపా నష్టబోవచ్చును.   ఒకవేళ సచివాలయ ఉద్యోగులు ఏపీ ఎన్జీవో నేతలను సంప్రదించకుండా జగన్మోహన్ రెడ్డిని కలిసిన పక్షంలో అది ఉద్యోగులలో చీలికలు తేవడం ఖాయం. వీటిలో ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడుతుంది.   ఏపీ యన్జీవోలు వైకాపా సారధ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయదలిస్తే, రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి విజయవకాశాలు మెరుగవుతాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితిలోఉంటే అప్పుడు వైకాపా మద్దతు స్వీకరించవచ్చును. వైకాపా అద్వర్యంలో మరికొంత కాలం సమైక్య ఉద్యమాలు సాగిన తరువాత ఎన్నికల గంట కొట్టి, ఉద్యమాలకు ఫుల్ స్టాప్ పెట్టించడం ద్వారా కాంగ్రెస్ తన ఈ వ్యూహం బహు చక్కగా అమలు చేయగలదు.   అలా కాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ యన్జీవోలలో చీలికలు వచ్చినట్లయితే, ఇంతవరకు వారి సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావం వలన తెలంగాణా ఏర్పాటుపై అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్ అధిష్టానం ఇక చకచకా రాష్ట్ర విభజన చేసి రెండు ప్రాంతాలలో తనకనుకూలంగా పావులు కదపవచ్చును.   కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి విడుదల ద్వారా ఆశిస్తున్నఅనేక రాజకీయ ప్రయోజనాల్లో బహుశః ఇది కూడా ఒకటి  అయ్యి ఉండవచ్చును.

జగన్ కు తెలంగాణ సెగ

      జగన్ ఇలా విడుదలై బయటకు రాగానే ఆయనకు తెలంగాణ సెగ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాకుత్ పురా నియోజకవర్గ కన్వీనర్ మైల్ కోల్ మహేందర్ యాదవ్ తెలంగాణ విషయంలో జగన్ వైఖరి తెలపాలంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయడం, దీక్ష చేయడానికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ వస్తున్న సమయంలో తెలంగాణ నినాదాలు మొదలు కావడంతో మాజీ ఎమ్మెల్సీ రెహమన్, ఇతర నేతలు ఆగ్రహంతో దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఏసీపీ జోక్యం చేసుకుని మహేందర్ యాదవ్ ను అక్కడి నుండి పంపించారు. దీంతో తెలుగుతల్లి విగ్రహం వద్దకు వెళ్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని భావించి దానిని మానుకున్నారు. ఇక నగరంలో కూడా తెలంగాణ వాదులు నిరసన తెలుపుతారని పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

బలప్రదర్శనలా సాగిన జగన్‌ ప్రయాణం

  16 మాసాల తరువాత జైళు నుంచి బయటికి వచ్చిన జగన్‌ తొలి అడుగు నుంచే తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. 23 సాయంత్రం బెయిల్‌ ఇస్తున్నట్టుగా కోర్టు ప్రకటించిన దగ్గరనుంచి హడావిడి ప్రాంభించిన జగన్‌ వర్గం నిన్న ఉదయం నుంచి మరింత హడావిడి చేసింది. ఉదయం నుంచే చంచల్‌గూడ జైళు దగ్గర గుమికూడిన జగన్‌ పార్టీ కార్యకర్తలు రాజకీయ సభను తలపించారు. కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా జైళు వద్ద చేరి జగన్‌ రాకకోసం ఎదురు చూశారు. సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో జగన్‌ అభిమానలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జైళు నుంచి బయటికి వచ్చారు. జగన్‌ జైళు నుంచి బయటి వచ్చిన దగ్గర నుంచే మొదలైంది అసలు కథ, ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి తీసుకోక పోయిన ప్రతి కూడలిలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తే జగన్‌ కాన్వాయ్‌ ఊరేగింపులా సాగింది. సాయంత్ర వేల కావడంతో ప్రతి చోట భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే ప్రదర్శనకు అనుమతి లేకపోయినా ఎక్కడ పోలీసులు జగన్‌ కాన్వాయ్‌ని త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా బలప్రదర్శనకు సహకరించారు. ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఖైరాతాబాధ్‌ చేరుకున్న జగన్‌ కాన్వాయ్‌ ట్రాఫిక్‌కు మరింత ఆటంకం కలింగించింది. దీంతో పంజాగుట్టలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాల వేయలన్న జగన్‌ను వారించి తాజ్‌కృష్ణ మీదుగా లోటస్‌పాండ్‌ తరలించారు.

ఢిల్లీ లో సమైక్యపోరాటం

  సచివాలయ సీమాంద్ర ఉద్యోగులు ఢిల్లీ వెళ్లనున్నారు. తమ ఆకాంక్షను అధిష్టానానికి తెలియ జేయటానికి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను విరమించుకోవాలని వారు కేంద్రాన్ని కోరనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26 న కొవ్వత్తుల ప్రదర్శన, 27న జంతర్‌ మంతర్‌ వద్ద దర్నా జరుపుతారు. తరువాత పలువురు జాతీయ నేతలతో సమావేశమయి రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతానికి కలిగే అన్యాయాలను వివరించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన సచివాల సీమాంద్ర ఉద్యోగలు ఫోరం చైర్మన్‌ మురళీ కృష్ణ, ఇప్పటికి వారి ఢిల్లీ పర్యటనకు సంభందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

ఎవరూ జైలులో ఉండాలని కాంగ్రెస్ కోరుకోదు: చాకో

   బెయిలుపై విడుదల అయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత వరకు ఇంటికి కూడా చేరుకోలేదు. కానీ  కాంగ్రెస్స్ పార్టీలో అప్పుడే ప్రతిస్పందనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎవరూ జైలులో ఉండాలని కోరుకోదని అన్నారు.   "ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది గనుక అప్పటిలోగా తేలాల్సిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. అందువలన పొత్తుల గురించి ఇప్పటి నుండే మాట్లాడటం అనవసరం. జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యాడు. అతనిని ఆ సంతోషం పూర్తిగా అనుభవించనీయండి. అతని విడుదలపై వస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు,” అని అన్నారు.   దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేలే కోరుకొంటున్నదని, అదేవిధంగా పొత్తులకి అవకాశం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అలా కాకుంటే పొత్తుల ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పేవారు. కాంగ్రెస్-వైకాపాలు ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి మాట్లాడకపోయినా ఎన్నికలు దగ్గరపడేలోగా అందుకు తగిన సానుకూల వాతావరణం కల్పించుకోవచ్చును.

ప్రజాప్రతినిధులకు జైలు నుండి ఎన్నికలలో పోటీ సౌలభ్యం

  క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన ప్రజాప్రతినిధులు జైలు నుండి ఎన్నికలలో పాల్గొనడానికి వీలులేదని సుప్రీంకోర్టు జూలై 10న చెప్పిన తీర్పుతో రాజకీయ నేతలలో కలకలం మొదలయింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోర్టు తీర్పును తప్పు పట్టాయి. కోర్టు తీర్పును రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్లును సెప్టెంబర్ 6న పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రోజు దానిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలుపుతూ సంతకం చేసారు. అందువల్ల యంపీలు, యం.యల్యే.లు క్రిమినల్ కేసులో జైలుకి వెళ్ళినా దర్జాగా జైలు నుండే ఎన్నికలలో పోటీ చేసుకోవచ్చును.

జగన్ రిలీజ్: ఇంటి నుంచే..

      485 రోజుల సుధీర్ఘ జైలు జీవితం తరువాత విడుదలయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు విధించిన షరతుల మేరకు హైదరాబాద్ లోని ఇళ్లు, పార్టీ కార్యాలయం నుండి కార్యక్రమాలు వేగవంతం చేస్తారని తెలుస్తోంది. జగన్ రాకతో తమకు ఇబ్బంది తప్పిందని, విధిలేని పరిస్థితుల్లోనే తాము ఇంటి నుండి బయటకు రావాల్సి వచ్చిందని వైఎస్ విజయమ్మ అన్నారు.     గత ఏడాదికి పైగా ఇబ్బందుల్లో ఉన్న పార్టీని మరింత ఉదృతంగా ముందుకు తీసుకుకెళ్లేందుకు జగన్ హైదరాబాద్ నుండి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. రేపు ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం అవుతారని సమాచారం. ఎన్నికలకు ఎంతో దూరం లేని నేపథ్యంలో ఇక సమయాన్ని వృదా చేయడానికి సిద్దంగా లేరని అంటున్నారు.

బెయిల్ పైనే కాక షరతులుపై కూడా కుట్రలు జరిగాయిట

  జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని కొందరు ఆరోపిస్తుంటే, అతనిని బెయిలులో షరతుల వెనుక కూడా రాజకీయం ఉందని మరొకరి వాదన. ఇప్పుడు కేవలం సీమాంద్రాకే పరిమితమయిన అతని పార్టీ చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలలో గానీ, రానున్నఎన్నికలకు అక్కడ పార్టీని బలపరచుకొనేందుకు గానీ జగన్ స్వయంగా పర్యటించేందుకు వీలులేకుండా చేసేందుకే కొందరు తెర వెనుక కుట్రలు చేసి బెయిలులో ఆవిధమయిన షరతులు విదింపజేసారని వైకాపా సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. ఇది పార్టీ విజయావకాశాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కానీ, జగన్ జైల్లో ఉండే కంటే, కనీసం హైదరాబాదులో ఉన్నందున పార్టీకి చాలా మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

జైలు నుంచి వైఎస్ జగన్ విడుదల

        వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.16 నెల‌లుగా చంచ‌ల్‌గూడ జైళులో ఉంటున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఎట్టకేల‌కు బెయిల్ రావడంతో బయటకి వచ్చారు. జగన్ కు సోమవారమే సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పూచీకత్తులు సమర్పించడానికి సమయం లేకపోవడంతో, మంగళవారం ఉదయం జగన్ లాయర్లు ఆ పని పూర్తి చేశారు. జగన్‌కు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలు పూచీకత్తులు ఇచ్చారు. జగన్ వ్యక్తిగత పూచీకత్తు తీసుకున్న కోర్టు జైలు నుండి విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వు కాపీలను జగన్ లాయర్లు చంచల్ గూడ అధికారులకు సమర్పించడంతో మధ్యాహ్నం జగన్ జైలు నుండి బయటకు వచ్చారు. ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా తొమ్మిది సార్లు బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన జ‌గ‌న్ చివ‌ర‌కు అనుకున్నది సాదించాడు.

జగన్ తో కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ ?

  జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు అవడంతో రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనం కలిగిస్తోంది. అతని విడుదలతో రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయనే అంశంపై చాలా లోతుగా విశ్లేషణ జరుగుతోంది. వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఎన్నికల పొత్తులకు సిద్దపడినందునే నేడు అతనికి బెయిలుకు మంజూరయిందని వాదనలు వినిపిస్తున్నాయి.   ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విడుదలతో కేవలం తెదేపా మాత్రమే చాలా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ నేతలలో కూడా చాలా కలవరం ఉంది. ముఖ్యంగా అధిష్టానం నిర్ణయాన్నిసవాలు చేస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలపై జగన్ విడుదల ప్రభావం ఉంటుందా లేదా?అనే ప్రశ్న తలెత్తుతోంది.   “సమయం చూసి అందరూ ఒకేసారి రాజీనామాలు చేద్దామని” ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు చెప్పినట్లు అమలాపురం యంపీ హర్షకుమార్ ఈ రోజు మరో మారు స్పష్టం చేసారు. అంటే శాసనసభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన రోజునే ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఒక తీవ్ర నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపబోతోందనే సంగతిని ముందుగా గ్రహించినందునే రాష్ట్రవిభజన అంశాన్నిఅడ్డుపెట్టుకొని పార్టీని వీడిపోతామని సవాలు విసురుతున్నారా? లేక నిజంగానే విభజనను వ్యతిరేఖిస్తూ ఆవిధంగా వ్యవహరిస్తున్నారా? అనే సంగతి వారి తదుపరి ప్రతిక్రియలను బట్టి తేలిపోతుంది.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే జగన్ బాబును రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడమే తమ ఏకైక లక్ష్యమని విజయమ్మతో సహా వైకాపా నేతలందరూ చాలా స్పష్టంగా చెపుతున్నారు. ఇంతకాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనను కాదని ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంకనెత్తుకోదలిస్తే, మరి ఆయన అధిష్టానం పట్ల అదే విదేయత కనబరుస్తారా లేక మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కలిసి వేరే కుంపటి పెట్టుకొని కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీస్తారా? అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని సవాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఉపేక్షిస్తుందా లేక కేంద్రంలో అధికారం చేజిక్కించుకొనేందుకు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి, పార్టీకి అత్యంత విధేయుడు, విశ్వసనీయుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కనపెడుతుందా?వంటి అనేక ధర్మ సందేహాలకు సమాధానాలు ఎన్నికల ప్రకటన వెలువడక ముందే తేలిపోవచ్చును.

జగన్ కు పూచీకత్తు ఇచ్చిన అవినాశ్ రెడ్డి

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కోసం న్యాయవాదులు రెండు పూచీకత్తులను సిబిఐ కోర్ట్ కి అందజేశారు. జగన్‌కు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలు పూచీకత్తులు ఇచ్చారు. సీబీఐ కోర్టు పూచీకత్తులను పరిశీలించిన తర్వాత జైలుకు రిలీజ్ ఉత్తర్వులను పంపించనుంది.   ఈ రోజు జగన్ విడుదల సంధర్బంగా జైలు వద్దకు వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు జైలు వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముళ్లకంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 16 నెలల అనంతరం చంచల్‌గూడ జైలు నుండి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయనను భారీ ర్యాలీతో పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నారు.

జగన్ బెయిల్ పై సిబిఐ హడావుడి: రేవంత్

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసులో దొంగ, పోలీస్ ఒకటయ్యారని ఆయన ఆరోపించారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.     ఇదే కేసులో నిందుతుడిగా వున్న నిమ్మగడ్డ ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన బెయిల్ ఇవ్వలేదని..అలాంటిది భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు.

ముఖ్యమంత్రి తుది వరకు చేసే పోరు దేని కోసం

  అమలాపురం యంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమను రాజీనామాలకు తొందర పడవద్దని, సమయం రాగానే అందరూ కలిసి ఒకేసారి రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకొందామని చెప్పారని తెలిపారు. అంటే నేటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అంశంపై పావులు కదిపేందుకు సిద్దంగానే ఉన్నారని అర్ధం అవుతోంది.   కాంగ్రెస్ అధిష్టానం ఇంత ఖరాఖండిగా రాష్ట్ర విభజనపై వెనకడుగువేసే ప్రసక్తే లేదని చెప్పిన తరువాత కూడా ముఖ్యమంత్రి విభజనను అడ్డుకొనేందుకు తుదివరకు పోరాడాలని భావించడం చూస్తే, ఆయనకీ వేరే ఇతర కారణాలు, ఆలోచనలు కూడా ఉండి ఉండవచ్చును. ఆయన పదవిలో కొనసాగుతూ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి హోదాలో సీమాంద్రాకు కొత్తగా మేలు చేసిన దాఖలాలు కూడా ఏమీ లేవు. అదేవిధంగా రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ఆయన కొత్తగా చేసిన ప్రయత్నం కూడా ఏమీ లేదు.   ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో రాజీనామా చేయడం వలన ప్రజలపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చుననే ఆలోచనతోనే, బహుశః ఆయన సరయిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. శాసనసభలోతెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన తరువాత దానిపై మీడియా సాక్షిగా వీరోచితంగా వాదనలు చేసి, బిల్లుని వ్యతిరేఖిస్తూ రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకొన్నట్లయితే అది ప్రజలపై మరింత ప్రభావం చూపుతుందని ఆయన ఆలోచన కావచ్చును. తద్వారా ఆయన సీమాంధ్ర ప్రజలలో తన రేటింగ్ మరింత పెంచుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనమూ కనబడటం లేదు.   ఏమయినప్పటికీ, తెలంగాణా ఏర్పాటు తధ్యమని మాత్రం స్పష్టం అవుతోంది. అందువలన ఇంత వరకు సమైక్యాంధ్ర కోసం ‘తుదివరకు పోరాడిన’ ఈ కాంగ్రెస్ నేతలందరూ ఇక హైదరాబాద్, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు వగైరాల పంపకాలపై పోరాడుతామని ప్రజలకి చెప్పబోతున్నారు.

కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలలో మలుపు

      సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొందరు ఎంపీలు రాజీనామాకు సిద్దపడితే మరికొందరు వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు ఉదయం 11 గంటలకు స్పీకర్ మీరాకుమార్ అపాయింట్‌మెంట్ లభించింది. ఎంపీలు లగడపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్, ఎస్పీవైరెడ్డి, రాయపాటి, అనంత, హర్షకుమార్, మాగుంట స్పీకర్‌ను కలవనున్నారు. సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలు ఆమోదింపజేయాలని స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు.     ఇప్పుడు అందులో కొందరు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజులు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డిలు రాజీనామాలకే మొగ్గు చూపుతున్నారు. హర్ష కుమార్, సాయి ప్రతాప్, ఎస్పీవై రెడ్డిలు రాజీనామాలపై తర్జన భర్జన పడుతున్నారట.     మరోవైపు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం ఉదయం పాట్నాకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఈనెల 28 లేదా 30న రావాలని స్పీకర్ సూచించారు.  

జగన్ బెయిల్ తో సీమాంద్రలో సంబరాలు

      వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు మంజూరు కావడంతో పెద్దఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కడపలో పార్టీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ భారీగా బాణసంచా కాల్చారు. కోటిరెడ్డి సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించి టపాసులు పేల్చారు. కలెక్టరేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో వేడుకలతోపాటు రంగులు చల్లుకున్నారు. మండల కేంద్రాల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.     కర్నూలు జిల్లా కేంద్రంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. డప్పులు మోగిస్తూ ర్యాలీగా వెళ్లి ఎస్‌వీ కాంప్లెక్స్‌వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జగన్‌కు జేజేలు కొడుతూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున బాణసంచా పేల్చి, రంగులు చల్లుకుంటూ ర్యాలీలు నిర్వహించారు.   తిరుపతిలో వైఎస్ విగ్రహంవద్ద సంబరాలతోపాటు రంగులు చల్లుకున్నారు. పలమనేరులో జాతీయ రహదారిపై బహిరంగ సభ, పీలేరులోనూ క్రాస్‌రోడ్డుపై సంబరాల వల్ల వాహనాల రాకపోకలకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో పలుచోట్ల కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల్లో రంగులు చల్లుకుంటూ 'జై జగన్' నినాదాలు చేశారు. విజయవాడలో గుణదల మేరీ మాత గుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.  

జగన్ బెయిల్ వెనుక 'హస్తం'

      ప్రస్థుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌గ‌న్‌కు బెయిల్ రావడం ప్రాదాన్యం సంత‌రించుకుంది. అయితే జ‌గ‌న్‌కు బెయిల్ రావ‌డం వెనుక కాంగ్రెస్ 'హ‌స్తం' ఉంది అన్న ఆరోప‌ణ కూడా ఉంది. తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి ఏర్పాండింది ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర రాజీనామాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకుంటే అక్కడ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టవ‌చ్చని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌తో తెలంగాణ ప్రాంతంలో కూడా వీలైన‌న్ని ఎక్కువ స్ధానాలు గెలుచుకోని మ‌రోసారి యుపిఏ ప్రభుత్వాని ఏర్పాటు చేసేదిశ‌గా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. సిబిఐ ఎంక్వయిరీలో వేగం త‌గ్గడం, దాదాపు ఎనిమిది కేసుల్లో క్విడ్‌ప్రోకో జ‌రిగిన‌ట్టుగా ఆదారాలు లేవ‌ని సిబిఐ కోర్టుకు తెల‌ప‌టం లాంటి ప‌రిణామాలలో జ‌గ‌న్ బెయిల్‌కు మార్గం సుగ‌మం అయింది. ప్రస్తుతం కాంగ్రెస్, వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ల మ‌ద్య కుదిరిన ఒప్పందాల‌ను ఇరు పార్టీలు అంగీక‌రించ‌క‌పోయినా , ఎల‌క్షన్స్ స‌మ‌యానికి స‌మీక‌ర‌ణాలు అలాగే మారే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.