తెలంగాణకి "లియో" వెయ్యి కోట్ల పెట్టుబడులు
posted on Sep 10, 2015 @ 3:09PM
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే నేపథ్యంలో సీఎం కేసీఆర్ చైనాలో బిజీబిజీ అయిపోయారు. ఇప్పటికే ఆయన పలు రకాల పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. నిన్న ఒక్కరోజే ఆయన 3 గంటల్లో 30 మీటింగులు నిర్వహించారంటేనే తెలుస్తోంది ఆయన ఎంత బిజీగా ఉన్నారో. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు నెలకొన్న పరిస్థితులు అందుకు అనువైన వసతుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ లియోగ్రూప్ ఆఫ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల గురించి వివరించాలని ఈనేపథ్యంలోనే తమ కంపెనీలను కూడా ఒకసారి సందర్శించాలని పలు కంపెనీల నుండి కేసీఆర్ బృందానికి ఆహ్వానాలు వచ్చాయి.