భారీ బందోబస్తుకి లాఠీలే గతి
posted on Sep 26, 2012 @ 1:50PM
ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడానికి లాఠీలే లేటెస్ట్ ఆయుధాలు. ఇదీ.. గణేష్ నిమజ్జనోత్సవంకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి బందోబస్తుకోసం హైదరాబాద్ కొచ్చిన ఖాకీల పరిస్థితి. గతంలో మూడుసార్లు ఉగ్రవాదులు నేరుగా బందోబస్తులో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుళ్లు ఇప్పటికీ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. గతంలో ఉగ్రవాదులు తెగబడ్డ ప్రాంతాలకు ఇప్పటికైనా కళ్లు తెరిచి భారీ ఆయుధాలను, సిబ్బందిని బందోబస్తుకోసం సమకూర్చాల్సిన పోలీస్ శాఖ ఇప్పటికీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేవలం చేతుల్లో లాఠీలు పట్టుకుని తిరుగుతూ గణేష్ నిమజ్జనంకోసం వచ్చిన ఆదనపు బందోబస్తు బలగాలు పహారా కాస్తున్నాయ్. మళ్లీ అవే స్థలాల్లో ఉగ్రవాదులు మరో సారికూడా కాల్పులు జరిపినా పట్టించుకునే దిక్కే లేదు. బైటి ప్రాంతాలనుంచి బందోబస్తుకోసం రాజధానికొచ్చిన పోలీసుల ప్రాణాలంటే సర్కారుకి లెక్కే లేదు. అంతా దైవాధీనం మోటార్ సర్వీస్ లా నడుస్తోంది. ఓ పక్క గణేష్ నిమజ్జనం, మరోపక్క బయోడైవర్సిటీ సదస్సు, మూడోవైపునుంచి తెలంగాణ మార్చ్ హడావుడి; ఎప్పుడేం జరుగుతుందోనని హైదరాబాద్ వాసులు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.