బెయిల్ స్కామ్ కేసులో గాలికి 11 రోజులు రిమాండ్
posted on Sep 25, 2012 @ 3:21PM
బెయిల్ ఫర్ సేల్ స్కామ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు సంబంధించి పలు అంశాలపై కోర్టు విచారణ జరపి గాలి జనార్ధన్‌రెడ్డికి 11 రోజులు రిమాండ్ విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అయితే గాలిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరగా కోర్టు నిరకరించింది. బెంగళూర్ జైలులో ఉన్న గాలిని హైదరాబాదుకు తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కుటుంబసభ్యులతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్‌రెడ్డి కోరగా పది నిమిషాల సమయాన్ని కోర్టు కేటాయించింది. కనీసం అర్ధగంట సమయాన్ని ఇవ్వాలని గాలి తరపు న్యాయవాదులు కోరడంతో కోర్టు అంగీకరించింది. గాలి కేసు సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కోర్టుకు తరలివచ్చారు. బళ్లారి ఎమ్మెల్యే శ్రీరాములు, రాయచూర్ ఎంపీ ఫకీరప్ప కోర్టుకు వచ్చారు. వారిని చూసిన గాలి కోర్టులో కంటతడిపెట్టుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం గాలిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.