దొరవారు చివరికి చేతులూపుకుంటూ వస్తారా?
posted on Sep 26, 2012 @ 1:58PM
తెలంగాణ విషయంలో ఓ ప్రకటన చేయిస్తానంటూ బీరాలు పలికి హస్తినలో మకాం వేసిన వలసదొర పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నామనో, లేక తెలంగాణ ఇస్తామనో సూచన ప్రాయంగా ఓ ప్రకటన చేస్తే చాలు టీఆర్ ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానంటూ దొరవారు బేరం పెట్టినా ఆయన వైపు చూసేవాళ్లే కరువయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. వాయలార్ రవిని రెండుసార్లు కలిసినా ఈ విషయంలో పెద్దగా ప్రయోజనమేమీ కనిపించకపోగా.. అసలు తెలంగాణ అంటే ఏంటి అన్నట్టుగా ఆయన ఫోజివ్వడంతో వలసదొరవారి ఫీజులెగిరిపోయాయని గట్టి ప్రచారమే జరుగుతోంది. దింపుడు కళ్లం ఆశనుకూడా పరీక్షించుకున్నాక తిరుగు ప్రయాణమవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకటన చేస్తే తెలంగాణ మార్చ్ ని వాయిదా వేయిస్తా అంటూ పెట్టిన మరో బేరం కూడా అస్సలు పారలేదట. ఈ నెలాఖరు వరకు కాదుకదా వచ్చే ఏడాది నెలాఖరు వరకూ కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేసి ప్రయత్నించినా కూడా ఇప్పట్లో తెలంగాణ విషయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశమేలేదని తేలిపోయిందని, గప్పాలుకొట్టుకుంటూ ఢిల్లీకి పోయిన సారువాడు.. ఉత్త చేతులు ఊపుకుంటూ తిరిగి రాక తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.