బస్సు చార్జీలు తక్కువే పెంచాం : బొత్స
posted on Sep 24, 2012 @ 6:03PM
ఆర్టీసి ఛార్జీల పెంపుదలను రవాణా శాఖ మంత్రి, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ సమర్దించుకున్నారు. డీజిల్ ధర ఒక రూపాయి పెరిగితే సంస్థపై రూ. 65 కోట్ల భారం పడుతుందని, ప్రస్తుతం డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థపై రూ. 330 కోట్ల భారం పడుతుందని బొత్స వివరించారు. ఆర్టీసీ ఏడాదికి 56 వేల కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని బస్సు చార్జీలు పెంచినట్లు బొత్స వివరించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలపై ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించాలని బొత్స కోరారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిని రాజకీయ పార్టీలు కూడా అర్ధం చేసుకోవాలని సూచించారు. చార్జీల పెంపుపై రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ. 200 కోట్లు బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రెండువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు బొత్స తెలిపారు.