వాద్రాపై విచారణ జరిపిన అధికారిపై బదీలి వేటు
posted on Oct 16, 2012 @ 12:55PM
రాబర్ట్ వాద్రా, డీఎల్ఎఫ్ మధ్య హర్యానాలో కుదిరిన ఒప్పందంపై విచారణకు ఆదేశించిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై వేటు పడింది. హుడా ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. రాబర్ట్ వాద్రా, డీఎల్ఎఫ్ ఒప్పందంపై రిజిస్ట్రేషన్ ఇన్స్‌పెక్టర్ జనరల్ అయిన ఖేమ్కా విచారణకు ఆదేశించారు. గుర్గావ్, ఫరీదాబాద్, పల్వాల్, మెవాత్ జిల్లాల్లో 2005 నుంచి అక్టోబర్ 12 వరకూ రాబర్ట్ వాద్రా పేరుపైన వచ్చిన పత్రాలన్నింటినీ పరిశీలించాలని అధికారులను కోరారు. అదే సమయంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, డీఎల్ఎఫ్కు మధ్య కుదిరిన ఒప్పందంలో అవకతవకలున్నాయనే నేపధ్యంలో డీల్‌ను రద్దు చేశారు. అవకతవకలపై విచారణకు ఆదేశించడమే ఆయన చేసిన తప్పన్నట్లుగా ఖేమ్కాను ట్రాన్స్‌ఫర్ చేయడంపై బిజెపి సహా ప్రతిపక్షాలు హుడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అవకతవకల నిగ్గు తేల్చడానికే ఆదేశించానని ఖేమ్కా తెలిపారు. మిగతా విషయాలను కోర్టులు తేల్చాలని అన్నారు.