భవిష్యత్ కు భరోసా ఇస్తున్న మోడీ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా మంచి అనుబంధం గల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నిన్న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధి అయిన బీజేపీ ప్రభుత్వాన్ని ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ ప్రసంగించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి రాష్ట్రపతే సర్వోన్నతాధికారి గనుక ఆయన సాంప్రదాయం ప్రకారం మోడీ ప్రభుత్వాన్ని కూడా ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ తన ప్రభుత్వ లక్ష్యాలను, చెప్పట్టబోయే పధకాలను వివరించారు.
అదేవిధంగా ఈసారి ఎన్నికలలో ప్రజలు మార్పు కోరుకోన్నారని, అందుకే చాలా సానుకూల దృక్పధంతో ఓట్లు వేసారని, దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని భరోసా ఇచ్చారు. ఇంతవరకు యూపీఏ ప్రభుత్వం ఎన్నడూ కలలో కూడా ఆలోచించని ‘గంగా ప్రక్షాళనం’ రాష్ట్రాల మధ్య స్పీడ్ ట్రైన్స్ ఏర్పాటు, దేశంలో కొత్తగా వంద ప్రపంచ స్థాయి నగరాల ఏర్పాటు, నగరాలతో సమానంగా పల్లెలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతీ పొలానికి సాగు నీరు, బహిరంగ ప్రదేశాలలో వైఫీ సదుపాయం వంటివి అనేకం ప్రకటించారు. మోడీ ప్రభుత్వం ముఖ్యంగా దేశంలో ఉన్న మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా భారీ ఎత్తున అభివృద్ది కార్యక్రామాలు చెప్పట్టడం, తద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించడం, మౌలిక వసతులు, విద్యా, వైద్య, విద్యుత్, ఉత్పత్తి రంగాలకు పెద్ద పీట వేయడం వంటివి చెప్పట్టబోతున్నట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారు.
గత అరవై ఏళ్లుగా పడికట్టు పదాలతో రాష్ట్రపతులు, ప్రధానులు చేసే ప్రసంగాలు వినివినీ చెవులు తుప్పు పట్టిపోయిన భారత ప్రజలు, వారి ప్రతినిధులు కూడా నిన్న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం విని పులకించిపోయారు. ఇవ్వన్నీ నిజంగా సాకారమయినట్లయితే, భారత్ కూడా అగ్రదేశాల సరసన నిలబడటం ఖాయం. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇరువురి ఆలోచనా విధానం ఒకటే గనుక బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి అభివృద్ధి సాధ్యమేనని భావించవచ్చును. దానికి కావలసిందల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులలో సంకల్ప బలం, నిబద్దత. ఆ రెండు ఉంటే అన్ని సమస్యలను అవలీలగా అధిగమించవచ్చును. మోడీ తన మంత్రివర్గానికి నిర్దిష్ట లక్ష్యం, కాలపరిమితి నిర్దేశించి ఏవిదంగా పరుగులు తీయిస్తున్నారో, అదేవిధంగా చంద్రబాబు కూడా తన ప్రభుత్వాన్ని పరుగులు తీయించలసి ఉంటుంది.