ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-2
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కొన్ని భవన సముదాయాలు నిర్మించి దానినే రాజధాని అనుకోకూడదని, రాజధానికి అన్ని హంగులతో బాటు జీవం, జీవనం కూడా ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. సింగపూరు వంటి రాజధాని నిర్మాణానికి కనీసం దాదాపు 20వేల ఎకరాల స్థలం అవసరం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటి గొప్ప రాజధాని కలిగి ఉండటం ఆంధ్ర ప్రజలందరికీ గర్వకారణమే. కానీ అది అక్షయ పాత్ర వంటి పచ్చని పంట పొలాల మీద నిలబడటం ఎవరూ హర్షించరు.
పొలాలు పోగొట్టుకొన్న రైతన్నలకి ఏదో రూపంలో పరిహారం చెల్లించ వచ్చును. కానీ సారవంతమయిన అటువంటి భూములను మరొక చోట సృష్టించలేము. వాటికి నీటి సౌకర్యమూ కల్పించడము అదనపు భారమే అవుతుంది. పైగా ఆర్భాటానికి పోయి చేజేతులా ఆహారపు కొరతను సృష్టించుకొన్నవారము అవుతాము.
రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యే ఏర్పాటు చేయాలనుకొన్నట్లయితే, అందుకు అవసరమయినంత భూమిని మాత్రమే సేకరించాలి. వీలయినంత వరకు సారవంతమయిన పంట పొలాల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. ఇప్పటికే కొందరు స్వార్ధ పరులయిన రాజకీయ నేతలు, రియల్టర్లు ఆ ప్రాంతంలో పచ్చటి పంట పొలాలను, మామిడి, కొబ్బరి, అరటి వంటి తోటలను చదునుచేసి లే అవుట్లుగా మారుస్తున్నారు. వీరు కాక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ఆ పరిసర ప్రాంతాలలో భారీగా (పంట) భూములను కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిని ప్రభుత్వం తక్షణమే అడ్డుకొని పంట భూములను కాపాడుకోవాలి. కానీ ఆపని చేయకుండా ప్రభుత్వమే ఇప్పుడు స్వయంగా ఆ రెండు జిల్లాలలో మిగిలిన పంట భూములను సేకరించి దానిపై కొత్త రాజధాని నిర్మించాలనుకొంటే, మున్ముందు ఇతర రాష్ట్రాల నుండి బియ్యం, పప్పులు దిగుమతి చేసుకోవలసి దుస్థితి ఏర్పడుతుంది.
అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే కొత్త రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఏర్పాటు చేసి, హైకోర్టు, అసెంబ్లీ, శాసనమండలి, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, పరిశ్రమలు వంటివన్నిటినీ మిగిలిన జిల్లాలలో ఒక్కో చోట ఏర్పాటు చేయవచ్చును. తద్వారా సారవంతమయిన పంట పొలాలను కాపాడుకొంటూనే, అభివృద్ధి వికేంద్రీకరణ చేసే అవకాశం ఉంటుంది. పదమూడు జిల్లాలలో ఉంటున్న ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు సమానంగా అందినట్లయితే ఇక అసంతృప్తికి తావుండదు.
రాష్ట్ర రాజధాని అంటే కేవలం ఒక వృత్తాకారంగానో, చతురస్రాకారంగానో ఉండాలనే నియమేమీ లేదు. అవసరమయితే తూర్పు గోదావరి జిల్లా నుండి ప్రకాశం జిల్లా వరకు పొడవుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చును.
ఒకవేళ రాజధానిని ఖచ్చితంగా విజయవాడ-గుంటూరు మధ్యే ఏర్పాటు చేయాలనుకొన్నట్లయితే, అక్కడ ఉన్న పంట భూములను అంతా నాశనం చేసి నిర్మించడం కంటే, ఆకాశ హర్మ్యాలు నిర్మించుకోవచ్చును కూడా. జపాన్, తైవాన్, సింగపూర్ వంటి చిన్న చిన్న దేశాలలో ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు. ఇంతవరకు మన రాష్ట్రంలో 20-30 పైబడి నిర్మించిన భవన సముదాయం ఒక్కటి కూడా లేదు. అందువల్ల సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాలలో నిర్మించినట్లు 50-100 లేదా అంతకు పైబడి అంతస్తులు గల భవన సముదాయాలు కొత్త రాజధానిలోనే నిర్మించినట్లయితే, సారవంతమయిన పంట పొలాలను రక్షించుకొన్నట్లవుతుంది. పైగా అటువంటి ఆకాశ హర్మ్యాలు దేశంలో మొట్ట మొదటగా సారిగా మన రాష్ట్రంలోనే నిర్మించబడటం రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమవుతుంది.