నిర్లక్ష్యం ఖరీదు 24 నిండు ప్రాణాలు
posted on Jun 9, 2014 @ 12:39PM
ఆంద్ర, తెలంగాణాలలో నిన్న మంత్రుల ప్రమాణ స్వీకారాలు, పదవీ బాధ్యతల స్వీకారాలతో రెండు ప్రాంతాలలో పండుగ వాతావరణం నెలకొని ఉండగా, తెలంగాణకు చెందిన 24మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లా వద్ద బియాస్ నదిలో కొట్టుకుపోవడం తెలుగు ప్రజలందరి హృదయాలు కలచివేసింది. కేవలం మానవ తప్పిదం కారణంగానే 24మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం చాలా దారుణం. విహారయాత్రతో ఉత్సాహం ఉరకలు వేస్తున్న విద్యార్ధులు నదీతీరంలో నిలబడి ఫోటోలు తీసుకొంటుంటే, ఎటువంటి హెచ్చరికలు చేయకుండా ఎగువనున్న లాజ్రీ హైడ్రో ప్రాజెక్టు డ్యాం గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో, అకస్మాత్తుగా ఉదృతంగా వెలువడిన నీటి ప్రవాహంలో విద్యార్ధులు అందరూ కొట్టుకుపోయారు. ఇప్పటికి ఐదు మృతదేహాలు బయటకు తీసారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి.
మన దేశంలో రకరకాల ప్రమాదాలలో నిత్యం వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో అనేకమంది చిన్నారులు బోరు బావులలో పడి అత్యంత దయనీయంగా చనిపోవడం చూసాము. వోల్వో బస్సులలో, రైలు ప్రమాదాలలో నిత్యం ప్రాణాలు కోల్పోతున్నవారినీ చూస్తూనే ఉన్నాము. ఉగ్రవాదుల దాడుల్లో అమాయకులయిన ప్రజలు దుర్మరణం పాలవడం చూస్తూనే ఉన్నాము. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ అడ్డుఅడుపు లేకుండా సాగుతున్న సామూహిక అత్యాచారాలు చూస్తూనే ఉన్నాము.
ఇటువంటి ప్రమాదాలను, దాడులను అరికట్టే వ్యవస్థలను, పద్దతులను మనం ఏర్పాటు చేసుకొన్నప్పటికీ, ప్రమాదాలను తగ్గించలేకపోతున్నాము. అందుకు ప్రధాన కారణం ఆ వ్యవస్థలలో పనిచేసే వ్యక్తుల నిర్లక్ష్యమేనని చెప్పవచ్చును. ఇటువంటి ప్రమాదాలు జరిగిన తరువాత ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా హడావుడి చేయడం ఆనక ఆవిషయం అందరూ మరిచిపోవడం షరా మామూలయిపోవడం చూస్తుంటే మనలో మానవత్వం నానాటికీ అడుగంటిపోతున్నట్లు అర్ధమవుతోంది.
గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకపోగా తమ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతారని తెలిసినా కూడా తమ కర్తవ్యాన్నిసక్రమంగా నిర్వర్తించని వారిని చూస్తే ఎవరికయినా కడుపు రగిలిపోతుంది. వారి నిర్లక్ష్యానికి నిత్యం ప్రజలు బలయిపోతుంటే, వారిలో ఎటువంటి అపరాధ భావం కలగకపోవడం ఒక విచిత్రమయితే, అటువంటి వారిని సస్పెండ్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వాలు భావించడం చాలా దారుణం.
ప్రభుత్వాల ఈ ఆలోచన తీరు మారనంత కాలం సదరు వ్యవస్థలలో పనిచేసే వ్యక్తుల తీరు మారుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.