ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు
posted on Jun 3, 2014 @ 5:59PM
కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 8న చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రోజు నుండి ఇది అమలులోకి వచ్చి ఐదేళ్ళ పాటు అమలులో ఉంటుంది. రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళ పాటు ప్రత్యేకహోదా కల్పించేందుకు అంగీకరించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దానిని ప్లానింగ్ కమీషన్ ప్రకటించలేకపోయింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పగ్గాలు చేప్పట్టగానే ప్రత్యేక హోదాకు అనుమతి ఇవ్వడంతో నేడో రేపో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్లానింగ్ కమీషన్ ప్రకటించబోతోంది.
ఈ ప్రత్యేక హోదా కొరకు బీహార్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్, ఒడిష రాష్ట్రాలు గత పదేళ్లుగా కేంద్రానికి మొరపెట్టుకొంటున్నాయి. కానీ వేటికీ మంజూరు చేయలేదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోడీని వ్యతిరేఖిస్తూ ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చిన తరువాత, ఆయన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ డిల్లీలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. నితీష్ కుమార్ యూపీఏ కూటమిలో చేరేందుకు ఇష్టపడితే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ నితీష్ కుమార్ చెరక పోవడంతో ఆ ఆలోచన విరమించుకొంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ఒడిష ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇమ్మని మరోమారు విజ్ఞప్తి చేసారు.
ఇంతవరకు మన దేశంలో జమ్మూ మరియు కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది.
ఈ ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు దక్కే లాభాలు ఏమిటంటే: 1. ఎక్సయిజ్ పన్నులో భారీ మినహాయింపులు, 2.కేంద్ర ప్రభుత్వ వార్షిక (గ్రాస్ బడ్జెట్) బడ్జెట్ లో 30శాతం నిధులు ఈ ప్రత్యేక (కేటగిరీ) హోదా గల రాష్ట్రాలకు కేటాయించబడుతుంది. 3. కేటాయించిన నిధులలో 90 శాతం ప్రత్యేక గ్రాంటుల రూపంలో, మిగిలిన 10శాతం అప్పుగాను ఇవ్వబడుతుంది.(ఇది కేవలం సదరు రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వ అద్వర్యంలో నిర్వహింపబడుతున్న పధకాలకు, ప్రాజెక్టులకే వర్తిస్తుంది). 4. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, టాక్స్ హాలిడేస్, సులువుగా కేంద్రప్రభుత్వ అనుమతుల మంజూరు.5. వివిధ పధకాలకు, అభివృద్ధి పనులకు కేంద్రం నుండి భారీ ఎత్తున నిధుల కేటాయింపు. ఎటువంటి తాత్సారం చేయకుండా నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిగినందున ఇటువంటివి ఇంకా అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. ప్రస్తుతానికి మన రాష్ట్రానికి కేవలం ఐదేళ్ళు మాత్రమే ప్రత్యేక హోదా కల్పించినందున ఆ పుణ్యకాలం ముగియక ముందే చంద్రబాబు ప్రభుత్వం దానిని పూర్తిగా వినియోగించుకొనే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. వాటిని రాష్ట్రప్రభుత్వం ఎంత సమర్ధంగా, ఎంత త్వరగా వినియోగించుకొంటుందనే దానిపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.