మున్సిపాలిటీ కబుర్లు
ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయడమని ప్రజలు అపోహపడుతుంటారు. కానీ ప్రజల చేత సేవ చేయించుకోవడమని రాజకీయనాయకుల అభిప్రాయం. ఎవరి అపోహలు వారివి, ఎవరి అభిప్రాయలు వారివి. గనుకనే ప్రతీ ఐదేళ్ళకోసారి వచ్చే ప్రజాస్వామ్య పుష్కరాలంటే అందరికీ ఉత్సాహం, ఆనందం పొంగి పొరలుతుంటాయి . ఈ మధ్యనే చాలా అట్టహాసంగా ముగిసిన ఆ పుష్కరాలలో ఓడలు బళ్లయ్యాయి బళ్ళు ఓడలయ్యాయి. అందువలన మధ్యలో మినీ పుష్కరాల వంటి ఏ మునిసిపల్ ఎన్నికలో వస్తే తప్ప అధికారంలో ఉన్నా లేకున్నా మరో ఐదేళ్ళవరకు అందరూ పంటి బిగువున ప్రజాసేవ చేసుకొంటూపోవలసిందే. తప్పదు మరి.
పెద్ద పుష్కరాలలో ప్రజాసేవకు చాలా గట్టి పోటీ ఉంటుంది గనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తప్పనిసరిగా కొందరితో బహిరంగంగా శత్రుత్వం, రహస్యంగా మిత్రత్వం పాటించవలసి వస్తుంటుంది. దానిని రాజకీయ ప్రత్యర్ధులు అపార్ధం చేసుకొన్నప్పటికీ, ప్రజలు మాత్రం సరిగ్గానే అర్ధం చేసుకోగలరు. కనుకనే ఆ పెద్ద పుష్కరాలు అలా ముగిసిపోయాయి. అయితే పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో అటువంటి ఇబ్బందులుండవు. వీధిలో ప్రజల ముందు ఒకరినొకరు బండబూతులు తిట్టుకొన్నప్పట్టికీ, అవసరమయితే మళ్ళీ ఆ తిట్టినవాళ్ళకే నిర్లజ్జగా మద్దతు ఇచ్చుకోవచ్చును, పుచ్చుకోవచ్చును. అప్పుడు కూడా ప్రజలేమీ అపార్ధం చేసుకోరు పాపం. ఎందుకంటే ప్రజాసేవ చేసేందుకు ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకొనే ధోరణి చాలా అవసరమని అందుకే వాటిలో కొన్నిటికి సహకార ఎన్నికలని పేరు పెట్టారని దృడంగా నమ్ముతుంటారు. అందుకే కాంగ్రెస్, వై.కాంగ్రెస్, తెదేపా, తెరాసలు ఒకదానికొకటి సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలలో మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, మేయర్ పదవులు తలా ఇన్నీ అంటూ పంచేసుకొన్నాయి.
ఇక ఇంతబాగా ఒకరికొకరు సహకరించుకొని పంపకాలు చాలా సజావుగా పూర్తి చేసేసుకొన్నారు గనుక రేపటి నుండి రాముడు-భీముడు, రామ్ ఔర్ శ్యామ్ లాగా ఒకరు భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని తిరుగుతూ ప్రజాసేవ...కాదు.. ప్రజలకి సేవ చేస్తారనుకొంటే అపోహే అవుతుంది. ముందుగా ‘మునిసిపాలిటీ జమా ఖర్చులపై చర్చ’ అంటూ చిన్నపాటి యుద్ధం మొదలుపెడతారు. జీవనదుల వంటి మురికి కాలువలు గురించి, గతుకుల మద్య అక్కడక్కడ కనబడే రోడ్ల గురించి, కరెంటు ఉన్నప్పటికీ వెలగని వీధి దీపాల గురించి ఏసి గదుల్లో కూర్చొని చర్చించమని ప్రజలు కోరితే, అంతసేపు కూర్చోలేక స్టాండింగ్ కమిటీలు వేసుకొని అందులో చేరిపోతుంటారు.
కమిటీలో సభ్యులయ్యాక వీధిలో దీపం ఎందుకు వెలగడం లేదు? కాలువలో ప్రవహించాల్సిన మురుగు నీరు రోడ్ల మీద ఎందుకు ప్రవహిస్తోంది? అంటూ ఎవరయినా పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేకపోతే చాలా నామోషీగా ఉంటుంది గనుక అధ్యయనం చేసేందుకు ఏ గోవాకో వీలయితే సింగపూరుకో శ్రమ అనుకోకుండా వెళ్లిరాక తప్పదు. ఎలాగు అంతేసే దూరాలు రోజూ వెళ్లి రాలేరు గనుక పనిలోపనిగా పెళ్ళాం బిడ్డలను కూడా తోడు తీసుకువెళితే అధ్యయనం ఆహ్లాదంగా సాగుతుంది. కానీ ఈవిషయంలో మాత్రం ప్రజలు అస్సలు సహించారు ఎందుకో మరి? “టాట్! మా డబ్బుతో విలాస యాత్రలు చేస్తారా?” అంటూ ఒంటికాలి మీద లేస్తుంటారు. కానీ ప్రజలకి గజినీలా షార్ట్ మెమొరీ లాస్ ఉంది గాబట్టి ఆ విషయాన్ని ఇట్టే మరిచిపోతారు గనుక వారితో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇలా కడుపులో చల్ల కదలకుండా ఏసి గదుల్లో కూర్చొని వాడులాడుకొంటూ రోజులు దొర్లించేసినందుకు, చివారఖరు రోజున ఏ ల్యాప్ టాపో, మరొకటో బహుమానంగా పుచ్చుకొని ఇంటికి వెళ్లిపోవచ్చును. ఇప్పుడు చైర్ మ్యానులు, ఉమనుల ఎన్నిక కూడా పూర్తింది గనుక ఇక ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చును.